గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ అరుదైన ఘనత సాధించింది. గురువారం కంపెనీ మార్కెట్ విలువ తొలిసారిగా 1 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. ఈ మైలురాయిని తాకిన నాలుగో అమెరికా టెక్ కంపెనీ ఇదే కావడం విశేషం. గురువారం నాటి ట్రేడింగ్‌లో ఆల్ఫాబెట్ షేరు ధర 0.76 శాతం పెరిగి కంపెనీ విలువ లక్ష కోట్ల డాలర్లను చేరుకుంది.
ట్రిలియన్ డాలర్ల అమెరికన్ కంపెనీలు ఇవే..
అమెరికాకు చెందిన ప్రముఖ సంస్థలు యాపిల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ ఇప్పటికే ట్రిలియన్ డాలర్ల జాబితాలో ఉన్నాయి. 2018లో తొలిసారిగా యాపిల్ ఈ ఘనత సాధించింది. గురువారం నాటికి ఈ కంపెనీ మార్కెట్ విలువ 1.38 ట్రిలియన్ డాలర్లుగా ఉంది.
బిల్‌గేట్స్ స్థాపించిన మైక్రోసాఫ్ట్ ప్రస్తుత మార్కెట్ విలువ 1.26 ట్రిలియన్ డాలర్లు. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ 2018 సెప్టెంబరులో ట్రిలియన్ డాలర్ల కంపెనీగా ఎదిగింది. అయితే ఆ తర్వాత నుంచి ఈ కంపెనీ విలువ పడిపోతూ వస్తోంది. ప్రస్తుతం అమెజాన్ విలువ 930 బిలియన్ డాలర్లుగా ఉంది.
ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ సహా ఇతర అనుబంధ విభాగాలకు ఆల్ఫాబెట్ మాతృ సంస్థ. ఈ కంపెనీ సీఈఓగా గూగుల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సుందర్ పిచాయ్‌ను నియమిస్తూ గతేడాది కంపెనీ సంచలన ప్రకటన చేసిన విషయం విదితమే.
అగ్రస్థానం ఆ కంపెనీదే..
ప్రపంచంలోనే తొలిసారి సౌదీ ఆరామ్‌కో 2 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువను తాకగా.. ఆ తర్వాత స్థానాల్లో యాపిల్, మైక్రోసాఫ్ట్, పెట్రో చైనా ఉన్నాయి. ఇప్పుడు ఈ జాబితాలో ఆల్ఫాబెట్ చేరింది.