దిగుమతి సుంకాన్ని కేంద్రం 200 శాతం పెంచడాన్ని నిరసిస్తూ కోల్కతాలో నేడు ఆందోళనకు దిగారు హోల్సేల్ వ్యాపారులు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో దేశ వ్యాప్తంగా లక్షకు పైగా రిటైలర్లపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళనకారులు తెలిపారు.
బొమ్మలపై 20 నుంచి 60 శాతం వరకు సుంకాలను పెంచాలని కేంద్రం తాజా బడ్జెట్లో ప్రతిపాదించింది. దేశీయ వ్యాపారులను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
"దిగుమతి సుంకాన్ని 200శాతం పెంచుతూ ప్రతిపాదించడం నిజంగా దారుణమైన నిర్ణయం. ప్రజలు అమాంతం పెరిగిన ధరలకు బొమ్మలను కొనలేరు. ప్రస్తుతం కొనసాగుతున్న 20 శాతం పన్నును అమలు చేసేలా కేంద్రం నిర్ణయం తీసుకోవాలి"
-మోహిత్, పశ్చిమబెంగాల్ ఎగ్జిమ్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కోల్కతా పర్యటనకు రేపు రానున్నారు. ఈ నేపథ్యంలో వ్యాపారులు, దిగుమతిదారులు ఆమెను కలిసే అవకాశముందని మోహిత్ తెలిపారు.
బొమ్మల వ్యాపారం లెక్కలు..
ప్రతి ఏటా రూ.2,500 కోట్ల విలువైన బొమ్మలు, ఆటవస్తువులను భారత్ దిగుమతి చేసుకుంటోందని అధికారులు చెబుతున్నారు. ఇందులో కేవలం చైనా నుంచే 75 శాతం దిగుమతి అవుతుండటం గమనార్హం.