ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా.. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మోసాలు మాత్రం తగ్గడం లేదు. ఆర్బీఐ ఇటీవల వెల్లడించిన గణాంకాలే ఇందుకు నిదర్శనం.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 2,480 బ్యాంకు మోసాలు జరిగినట్లు సమాచార హక్కు చట్టం ద్వారా బయటపడింది. ఈ మోసాల మొత్తం విలువ రూ.31,898.63 కోట్లుగా ఉన్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. మధ్యప్రదేశ్‌కు చెందిన సామాజిక కార్యకర్త చంద్రశేఖర్ గౌర్ స.హ దరఖాస్తుకు సమాధానంగా ఆర్బీఐ పలు కీలక విషయాలు వెల్లడించింది.
ఈ మోసాల్లో 38 శాతం.. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐకి చెందినవని వెల్లడించింది ఆర్బీఐ. మోసాలకు సంబంధించి ఎస్బీఐలో మొత్తం 1,197 కేసులు నమోదయ్యాయి. వీటి విలువ రూ.12,012.77 కోట్లు. ఎస్బీఐ తర్వాతి స్థానంలో అలహాబాద్ బ్యాంకు ఉంది. ఇందులో 381 కేసులు నమోదవగా.. వీటి విలువ రూ.2,855.46 కోట్లుగా ఉన్నట్లు ఆర్బీఐ పేర్కొంది.
బ్యాంకు మోసాలు,వాటి విలువను చెప్పినప్పటికీ.. అవి ఏ విధంగా జరిగాయో అనే అంశంపై ఆర్బీఐ స్పష్టత ఇవ్వలేదు. బ్యాంకులు, వాటి వినియోగదారులు ఎలాంటి నష్టాలు ఎదుర్కొంటున్నారో కూడా వెల్లడించలేదు ఆర్బీఐ.
మరిన్ని బ్యాంకు మోసాల వివరాలు..
బ్యాంకు | మోసాలు | విలువ |
---|---|---|
బరొడా బ్యాంకు | 75 | రూ.2,297,05 కోట్లు |
ఓరియంటల్ బ్యాంకు | 45 | రూ.2,133.08 కోట్లు |
కెనరా బ్యాంకు | 69 | రూ.2,035.81 కోట్లు |
సెంట్రల్ బ్యాంకు | 194 | రూ.1,982.27 కోట్లు |
యునైటెడ్ బ్యాంకు | 31 | రూ.1,196.19 కోట్లు |
కార్పొరేషన్ బ్యాంకు | 16 | రూ.960.80 కోట్లు |
ఐఓబీ | 46 | రూ.934.67 కోట్లు |
సిండికేట్ బ్యాంకు | 54 | రూ.795.75 కోట్లు |
యూనియన్ బ్యాంకు | 51 | రూ.753.37 కోట్లు |
బ్యాంక్ ఆఫ్ ఇండియా | 42 | రూ.517 కోట్లు |
యూకో బ్యాంకు | 34 | రూ.470.74 కోట్లు |