ప్రస్తుత స్మార్ట్ ఫోన్ యుగంలో ఏ సందేహం వచ్చినా.. దేని గురించి తెలుసుకోవాలన్నా చాలా మంది ముందుగా వెతికేది గూగుల్లోనే. అన్ని రంగాలు, అన్ని వయస్సుల వారికి సంబంధించిన ఎటువంటి సమాచారమైన గూగుల్లో సులభంగా దొరుకుతుంది. అందుకే ఏమైనా చెయ్యొచ్చని అందరూ అనుకుంటూ ఉంటారు. అయితే ఆ జాబితాలో మీరూ ఉన్నారా? జాగ్రత్త! గూగుల్లో చేయకూడని కొన్ని పనులు ఉన్నాయి. తెలియక చేసినా.. తెలిసి చేసినా మీరు సమస్యను కొని తెచ్చుకున్నట్లే. ఇంతకీ గూగుల్లో చేయకూడని పొరపాట్లు ఏంటో తెలుసుకుందాం.
యూఆర్ఎల్తో బ్యాంక్ వెబ్సైట్లకు వెళ్లొద్దు..
మీరు ఏదైనా బ్యాంకు లావాదేవీలు జరపాలనుకున్నా.. కార్డు ద్వారా చెల్లింపులు చెయ్యాలన్నా యూఆర్ఎల్ ద్వారా ఆయా బ్యాంకుల ఖాతాలోకి లాగ్ ఇన్ అవ్వొద్దు. అలా చేస్తే మీ ఖాతా వివరాలు, కార్డుల వివరాలు హ్యాకర్ల చేతికి వెళ్లే అవకాశముంది. అలా హ్యాకర్ల వలలో చిక్కుకోకుండా.. బ్యాంకు అధికారిక వెబ్సైట్ల పేర్లతోనే గూగుల్లో సెర్చ్ చేయాలి. వాటి వల్ల మాత్రమే మీ బ్యాంకు ఖాతా గోప్యతకు రక్షణ ఉంటుంది.
గూగుల్‌తో.. సొంత వైద్యం వద్దు
మీకు వచ్చే ఆరోగ్య పరమైన సమస్యల లక్షణాలు గూగుల్లో వెతికి వాటి సంబంధించిన ఔషధాలను వాడటం మిమ్మల్ని సమస్యల్లో పడెయ్యొచ్చు. ముఖ్యంగా మీ సమస్య తెలియకుండా వేరే ఔషధాలను తీసుకోవడం కారణంగా మీ ఆరోగ్యం మరింత క్షీణించొచ్చు.
మీకు ఏదైన ఆరోగ్య సమస్య వస్తే.. సంప్రదాయ పద్ధతిలో మీకు దగ్గర్లోని వైద్యుని సంప్రదించి సరైన వైద్యం తీసుకోవడం మేలు.
కస్టమర్ కేర్ నంబర్లతో
వ్యాపార సంస్థల కస్టమర్‌కేర్ నెంబర్ గూగుల్లో వెతికేటప్పుడు కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే ఒక్క ఫోన్‌కాల్‌తో డాటా హ్యాక్ చేసే ఎంతో మంది ఆన్లైన్ చోరులు నకిలీ నంబర్లను వెబ్సైట్లలో ఉంచుతున్నారు. వాటి వలలో పడితే అంతే సంగతులు. ఇందుకోసం మీకు ఏ సంస్థ కస్టమర్‌కేర్ నెంబర్ కావాలో వాటి సైట్లు లేదా.. వాటికి సంబంధించిన డాక్యుమెంట్లపై ఉన్న నంబర్లను మాత్రమే వినియోగించాలి.
ఆర్థిక సలహాలు గూగుల్‌ను కోరొద్దు..
మీ పెట్టుబడులు, ఇతర ఆర్థిక సలహాలకోసం గూగుల్ సమాచారాన్ని వినియోగించకపోవడమే మంచిది. గూగుల్లో ఉన్న సమాచారం పూర్తిగా నిజమైనది అని చెప్పలేం. వాటిలో ఉన్న అన్ని సలహాలు ఉత్తమమైనవి కాకపోవచ్చు. ఇందువల్ల వాటిలో ఉండే సలహాలను కాకుండా.. గుర్తింపు పొందిన ఆర్థిక నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.
ప్రభుత్వ వెబ్సైట్లతో జాగ్రత్త..
ప్రభుత్వ వెబ్సైట్లతో కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది.. ఎందుకంటే వాటిని హ్యాక్ చేసేందుకు చాలా మంది హ్యాకర్లు ప్రయత్నిస్తూ ఉంటారు. వాటి కోసం వెతికే క్రమంలో మీ డేటా హ్యాకర్ల చేతికి చిక్కే ప్రమాదం ఉంది. అందువల్ల సరైన ప్రభుత్వ వెబ్‌సైట్‌ను.. అది అవసరమున్నప్పుడు మాత్రమే వినియోగించడం మంచిది.
ఆన్లైన్ ఆఫర్లు అన్నీ అసలైనవి కావు..
ఈ కామర్స్ వెబ్సైట్ల ఆఫర్లు, ప్రోమో కోడ్ల కోసం గూగుల్లో వెతకటం మిమ్మల్ని ఇబ్బందుల్లో పడెయ్యొచ్చు. వాటిల్లో చూపించే ఆఫర్లకు ఆకర్షితులై.. ఇచ్చిన లింక్ ద్వారా వెబ్సెట్లలోకి వెళ్తే.. అవి వేరే నకిలీ వెబ్సెట్లకు తీసుకెళ్లొచ్చు. ఆ లింక్ ద్వారా మీ డేటా తస్కరణకు గురయ్యే అవకాశముంది.
యాంటీ వైరస్‌లతో జాగ్రత్త..
యాంటీ వైరస్‌లను కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రముఖ సంస్థలకు చెందిన యాంటీవైరస్‌లను పోలి.. నకిలీ యాంటీ వైరస్లు గూగుల్లో స్వైర విహారం చేస్తున్నాయి. అందుకే గుర్తింపు పొందిన వెబ్సైట్లనుంచి మాత్రమే యాంటీ వైరస్‌లను కొనుగోలు చేయాలి.
మీరు వెతికే సమాచారం ఆధారంగానే..
ప్రస్తుతం గూగుల్లో మీరు ఎక్కువగా వెతికే సైట్లు.. సమాచారం ఆధారంగానే యాడ్స్ వస్తుంటాయి. ఒక వేళ మీరు అశ్లీల వెబ్సైట్ల వంటివి చూస్తే వాటికి సంబంధించిన యాడ్లు మీ గూగుల్ వాల్‌పై డిస్ప్లే అవుతాయి. ఇతరులు మీ బ్రౌజర్ వాడినప్పుడు వారికి మీపై తప్పుడు అభిప్రాయం ఏర్పడే ప్రమాదం ఉంది. అందుకే మీరు వెతికే సమాచారం అందరికీ ఆమోదయోగ్యమైందిగా ఉంటే మేలు.
సామాజిక మాధ్యమాలు ఎక్కడంటే అక్కడ లాగ్ఇన్ అవ్వద్దు..
మీరు ఏదైనా వెబ్సైట్లలో ఉన్నప్పుడు.. వాటి మధ్యలో వచ్చే సామాజిక మాధ్యమాల సైట్ల ద్వారా మీ ఖాతాను లాగ్ చేయకుండా ఉండటమే మంచిది. వాటి ద్వారా మీ అనుమతి లేకుండానే.. మీ ఖాతా వివరాలు ఇతరుల చేతికి వెళ్లే ప్రమాదం ఉంది. అందుకే నేరుగా మీరు వినియోగించే సామాజిక మాధ్యమ వెబ్సైట్లో లాగ్ఇన్ అవ్వడం మేలు.
బరువు తగ్గే స్టంట్ల జోలికి దూరంగా ఉండండి..
బరువు తగ్గేందుకు.. గూగుల్ లోని చిట్కాల ఆధారంగా ఎటువంటి స్టంట్లు చెయ్యొద్దు. ఎందుకంటే బరువు తగ్గడం.. పెరగటం అనేవి ప్రతి వ్యక్తి శరీర ఆకృతి, స్వభావం ఆధారంగా వేరువేరుగా ఉంటాయి. బరువు తగ్గడం కోసం వైద్యుల సలహా ఆధారంగా మాత్రమే ప్రయత్నించడం ఉత్తమం.
ఇదీ చూడండి:బ్యాంకు డిపాజిట్లపై బీమా పెంపు దిశగా కేంద్రం అడుగులు..!