అమెరికాలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. అయినప్పటికీ కొన్ని కంపెనీలు తమ కార్యకలపాలను తిరిగి ప్రారంభిస్తున్నాయి. కాలిఫోర్నియాలో టెస్లా కంపెనీ పునః ప్రారంభమైనప్పటికీ పనికి రావటానికి కొంతమంది ఉద్యోగులు ఇష్టపడటం లేదు. దీంతో విధుల్లోకి రాని ఉద్యోగులను తొలగించనున్నట్లు టెస్లా సంస్థ ప్రకటించిందని ఆ కంపెనీకి చెందిన కార్మిక సంఘాలు తెలిపాయి. ఉద్యోగులు మాత్రం కరోనా భయంతో బయటకు వచ్చేందుకు భయపడుతున్నారని వెల్లడించారు.
కర్మాగారంలో మెరుగైన భద్రతా ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకోవాలని ఓక్లాండ్‌లోని అల్మెడ కౌంటీ పబ్లిక్ హెల్త్ విభాగం వద్ద టెస్లా ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు . ఉద్యోగులు తమ ఆరోగ్య భద్రత కోసం డబ్బులు చెల్లిస్తున్నప్పటికీ కంపెనీ ఎటువంటి చర్యలు తీసుకోవటం లేదని ఓ టెస్లా ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేశాడు.
కంపెనీ స్పందన..
ఈ వ్యాఖ్యలపై స్పందించిన టెస్లా ప్రతినిధి... ఉద్యోగులను తొలిగిస్తున్నట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదన్నారు. కర్మాగారంలో భద్రతా ప్రమాణాలను పాటిస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి ఒక్క ఉద్యోగి శరీర ఉష్ణోగ్రత పరీక్షిస్తున్నామన్నారు. చేతి గ్లౌజులు, మాస్క్లు ధరించారో లేదో తనిఖీ చేసిన తర్వాతే లోపలికి అనుమతినిస్తున్నట్లు తెలిపారు. కార్మికుల మధ్య భౌతిక దూరం పాటించే విధంగా బారియర్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
ఇదీ చూడండి:చైనా నిజస్వరూపం బయటపడింది: ట్రంప్