డిజిటల్ లావాదేవీలు.. ఒకప్పుడు పట్టణాలకు మాత్రమే పరిమితమైన ఈ విధానం.. గత కొంత కాలంగా దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు విస్తరించాయి. ముఖ్యంగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (ఎన్పీసీఐ) అందుబాటులోకి తెచ్చిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేజ్ (యూపీఐ) విధానం డిజిటల్ పేమెంట్స్ విప్లవానికి ఆజ్యం పోసింది. ఐదేళ్ల కాలంలో పెరిగిన డిజిటల్ లావాదేవీలే ఇందుకు ఉదాహరణ.
డిజిటల్ లావాదేవీలకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను తీసుకొచ్చింది ఫోన్‌పే. ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన ఫోన్‌పే యూపీఐ ఆధారిత పేమెంట్ సేవలు అందిస్తుంది.
99 శాతం ప్రాంతాల్లో ఫోన్ పే వినియోగం..
దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం పిన్‌కోడ్ ప్రదేశాల్లో..99 శాతం (19,000) ప్రాంతాల్లో డిజిటల్ పేమెంట్లకు తమ యాప్‌ను వినియోగిస్తున్నట్లు ఫోన్‌పే ప్రకటించింది. ఈ మొత్తం ప్రాంతాలు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు.. అండమాన్, నికోబార్ దీవులు, లక్ష ద్వీప్లను కవర్ చేస్తున్నాయి.
గ్రామీణ ప్రాంతాలదే హవా..
ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. ఫోన్‌పేకు నెలవారీగా 13.3 కోట్ల యాక్టివ్ యూజర్లు ఉన్నట్లు ఎన్పీసీఐ డేటాలో వెల్లడైంది. మొత్తం యూపీఐ పేమెంట్ మార్కెట్లో 46 శాతం వాటా దీనిదే కావడం విశేషం. ఇందులో 80 శాతం లావాదేవీలు టైర్-2, టైర్-3, టైర్-4 పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల నుంచే జరుగుతున్నట్లు ఎన్పీసీఐ డేటా వెల్లడించింది.
మొత్తం లావాదేవీల్లో టైర్-1 పట్టణాల వాటా 18.1 శాతం, టైర్-2 పట్టణాల వాటా 15.9 శాతం ఉన్నట్లు తేలింది. టైర్-3 పట్టణాల వాట అత్యధికంగా 65 శాతం ఉండటం విశేషం
పీ2పీ లావాదేవీల్లో ఆ ఐదు రాష్ట్రాలదే హవా..
ఫోన్‌పేను అత్యధికంగా.. ఒక యూజర్ మరో యూజర్‌కు డిజిటల్‌గా డబ్బులు పంపించేందుకు (పీర్-టూ-పీర్ పేమెంట్స్ లేదా పీ2పీ ట్రాన్సాక్షన్) వినియోగిస్తున్నారు. దీని తర్వాత కొనుగోళ్లకు, రీఛార్జ్, ప్రీ పెయిడ్ మొబైల్ రీఛార్జ్, డీటీహెచ్ రీఛార్జ్, కరెంట్ బిల్లు వంటి అవసరాలకు ఫోన్‌పేను వాడుతున్నారు.
ఫోన్‌పే.. పీ2పీ ట్రాన్సాక్షన్స్ విషయంలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, రాజస్థాన్‌లు 55 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఇందులో కూడా టైర్-3 టౌన్లు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలదే అగ్ర స్థానం (దాదాపు 50 శాతం) కావడం గమనార్హం.
డిజిటల్ లావాదేవీల్లో కర్ణాటకదే అగ్రస్థానం..
డిజిటల్ లావాదేవీల విషయంలో కర్ణాటక అగ్రస్థానంలో ఉన్నట్లు నివేదికలో తేలింది. కర్ణాటక రాజధాని బెంగళూరుకు భారత ఐటీ రాజధానిగా కూడా పేరుంది. ఫోన్ పే మొత్తం లావాదేవీల్లో కర్ణాటక వాటానే 15 శాతం. ఇక మహారాష్ట్ర, తెలంగాణతో కలిగి మూడు రాష్ట్రాల వాటా 40 శాతం వాటాను కలిగి ఉన్నాయి.
బంగారం కొనుగోళ్లలో కేరళ టాప్..
ఆన్లైన్లో బంగారం కొనుగోళ్ల విషయంలో కేరళ అగ్రస్థానంలో ఉంది. అయితే ఫోన్ పే ద్వారా బంగారం కొనుగోలు చేసే విషయంలో మాత్రం కేరళ టాప్ 10 రాష్ట్రాల జాబితాలో కూడ లేకపోవడం గమనార్హం.
ఫోన్ పే ద్వారా బంగారం కొనుగోలు చేస్తున్న వారిలో మహారాష్ట్ర 11 శాతం వాటాతో ప్రథమ స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో బంగాల్ (10 శాతం), ఉత్తర్ ప్రదేశ్ (10 శాతం), ఆంధ్ర ప్రదేశ్ (8 శాతం), తెలంగాణ (8 శాతం), కర్ణాటక (8 శాతం), రాజస్థాన్ (6 శాతం), ఒడిశా (6 శాతం), మధ్య ప్రదేశ్ (5 శాతం), బిహార్ (5 శాతం) ఉన్నాయి.
ఇవీ చదవండి: