2019 మూడో త్రైమాసికంలో జీడీపీ వృద్ధి 4.7 శాతానికి పడిపోవడంపై ఆర్థికమంత్రిత్వశాఖ స్పందించింది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న జీడీపీ వృద్ధి క్షీణతకు తాము అడ్డుకట్ట వేశామని, వృద్ధి పుంజుకునేందుకు ఇంకా కృషి చేస్తున్నామని స్పష్టం చేసింది.
"దేశ వృద్ధి క్షీణతను ఇప్పటికే మేము తగ్గించాం."- అతాను చక్రవర్తి, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి
సానుకూలంగా..!
జాతీయ గణాంక కార్యాలయం (ఎన్ఎస్ఓ) 2019-20 మొదటి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి అంచనాలను 5.6 శాతానికి (5 శాతం నుంచి) సవరించింది. అలాగే రెండో త్రైమాసికంలో దీన్ని 5.1 శాతానికి (4.5 శాతం నుంచి) సవరించింది. మొత్తం ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధిని 5 శాతంగా ఎన్ఎస్ఓ అంచనా వేసింది.
పుంజుకుంటున్నాం..!
డిసెంబర్లో కీలక రంగాల పరిశ్రమలు వృద్ధిని సాధించాయని, అంతే కాకుండా జనవరి మార్చి త్రైమాసికంలో ఉత్పాదక రంగం 'బాగా పుంజుకుంటుంద'ని, అతాను చక్రవర్తి పేర్కొన్నారు.
కరోనా ప్రభావం
ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తున్న కరోనా వైరస్‌పై అతాను చక్రవర్తి మాట్లాడుతూ.. 'ఇది ఇప్పట్లో ముగియని కథ' అని అన్నారు.
కరోనా భయాలతో ప్రపంచ వృద్ధి మందగిస్తుందనే భయంతో దేశీయ మార్కెట్లు ఐదు నెలల కనిష్ఠానికి పడిపోయి భారీగా నష్టాన్ని చవిచూశాయి.
ఇదీ చూడండి: మూడో త్రైమాసికంలో జీడీపీ వృద్ధి 4.7 శాతమే