జూన్ నెలలో 9-10 కోట్ల కొవిషీల్డ్(Covishield) టీకా డోసులు ఉత్పత్తి చేసి, సరఫరా చేస్తామని కేంద్రానికి తెలిపింది సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. టీకాల కొరతపై రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో సీరం ప్రకటన ఊరట కలిగిస్తుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ఈ విషయంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాసింది సీరం సంస్థ. మహమ్మారితో సవాళ్లు ఎదురైనా.. తమ ఉద్యోగులు రోజులో 24 గంటలు పని చేస్తున్నారని పేర్కొంది. కొవిషీల్డ్ అభివృద్ధి, ఉత్పత్తి, సరఫరాలో తమకు మద్దతుగా నిలిచిన అమిత్ షాకు కృతజ్ఞతలు తెలిపింది.
"మే నెలలో మా ఉత్పత్తి సామర్థ్యం 6.5 కోట్ల డోసులతో పోలిస్తే.. జూన్లో 9-10 కోట్ల డోసులకు పెంచి సరఫరా చేయగలమని తెలియజేస్తున్నాం. కొవిడ్-19 నుంచి దేశ ప్రజలతో పెద్ద సంఖ్యలో ప్రపంచ జనాభాను రక్షించేందుకు సీరం సంస్థ ఎప్పుడూ పాటుపడుతుంది. మా సీఈఓ అదర్ పూనావాలా నాయకత్వంలో మా బృందం ప్రభుత్వంతో కలిసి కొవిడ్ మహమ్మారి పోరులో నిస్వార్థంగా పని చేస్తోంది. భారత ప్రభుత్వ మద్దతు, మార్గదర్శనంలో అందుబాటులో ఉన్న అన్ని వనరులను వినియోగించుకుని మా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకే ప్రయత్నిస్తాం. "
- ప్రకాశ్ కుమార్ సింగ్, ప్రభుత్వ, నియంత్రణ వ్యవహారాల డైరెక్టర్, సీరం.
మే తొలినాళ్లలో.. కొవిషీల్డ్ ఉత్పత్తిని జూన్లో 6.5 కోట్లుకు, జులైలో 7 కోట్లకు, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో 10 కోట్లకు పెంచుతామని తెలిపింది. టీకా కొరత ఉన్న నేపథ్యంలో ఉత్పత్తి వేగవంతం చేసినట్లు పేర్కొంది.
ఇదీ చూడండి: కరోనాను జయించారా? ఈ టెస్టులు చేయిస్తే బెటర్!