12 నెలల కాలంలో ఏదో ఒక వస్తువు, ఏదో ఒక నెలలో ఆఫర్లతో మార్కెట్లోకి వస్తుంటుంది. అసలే భారతీయులకు డిస్కౌంట్లంటే ఎనలేని మక్కువ. ఏ వస్తువు ఎప్పుడు తక్కువ ధరలో వస్తుందా అని ఆలోచిస్తారు. మరి ఎప్పుడు, ఎక్కడ, ఏది, ఎలా కొనాలో నెలల వారీగా వివరాలు మీకోసం..
1. జనవరి - వ్యాయామ సామగ్రి
నూతన సంవత్సరంలో ఎక్కువమంది నిర్దేశించుకునే లక్ష్యం... 'కసరత్తులు'. అందుకే జనవరిలో ఎక్కువ అమ్ముడయ్యే వస్తువుల జాబితాలో ముందు వరుసలో ఉంటాయి ఈ వ్యాయామ సామగ్రి. వినియోగదారులను ఆకట్టుకోవడానికి వ్యాపారులు భారీ ఆఫర్లు ప్రకటిస్తుంటారు. సుమారు 30 నుంచి 70 శాతం డిస్కౌంట్లతో ఇవి లభిస్తాయి. మీరు ఒకవేళ వీటిని కొనుగోలు చేయాలంటే జనవరి నెల అత్యుత్తమం.
2. ఫిబ్రవరి - కెమెరా, ఎల్ఈడీ టీవీ
శీతాకాలం మంచు అందాలను వీక్షించడానికి విదేశీ యానానికి సిద్ధమవుతారు పర్యటకులు. ఈ సమయంలో వీరు మొదట కొనుగోలు చేసే వస్తువు కెమెరా. ఫిబ్రవరిలో కెమెరాలు అత్యధికంగా అమ్ముడవుతాయి. వివిధ సంస్థలు నూతన మోడళ్లు విడుదల చేయడమే కాక... ఆఫర్లు ప్రకటించడంలో పోటీ పడతాయి.
ఎక్కువగా అమ్ముడయ్యే మరో వస్తువు టీవీ. ఫిబ్రవరిలో ఎల్ఈడీ టీవీలు అమ్మకాలు భారీగా ఉంటాయని ఒక మార్కెట్ సర్వేలో తేలింది. ఈ నెలలో టీవీలపై ఆఫర్లు ఘనంగానే ఉంటాయి.
3. మార్చి-చల్లటి ఆహార పదార్థాలు
శీతాకాలం పోయి భానుడి ప్రతాపం మొదలయ్యే నెల ఇది. ఈ నెలలో చల్లటి ఆహార పదార్థాలకున్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ఈ ఒక్క నెల వ్యాపారంతో సంవత్సరం ఆదాయం సంపాదిస్తుంటాయి శీతలపానీయ సంస్థలు. ఐస్‌క్రీం, కూల్డ్రింక్స్పై వివిధ ఆఫర్లు ప్రకటించి వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తాయి.
ఫ్రిజ్, ఏసీలు కూడా ఇదే కోవలోకి వస్తాయి. ఈ నెలలో వీటిపై భారీ డిస్కౌంట్లు ప్రకటిస్తాయి తయారీ సంస్థలు.
4. ఏప్రిల్ - పన్ను లావాదేవీ సాఫ్ట్వేర్లు, సౌందర్య ఉపకరణాలు
ఏప్రిల్ అనగానే పన్ను లావాదేవీలు గుర్తొస్తాయి. అందుకే వీటికి సంబంధించిన అమ్మకాలు భారీగా జరుగుతాయి. ఆఫర్లు అదే స్థాయిలో ఉంటాయి.
ఈ నెలలో సౌందర్య ఉపకరణాలూ అధికంగా అమ్ముడవుతాయి. పెళ్లిల్లు సహా పలు శుభకార్యాలు ఈ నెల అధికంగా జరగడమే వీటి డిమాండ్‌కు కారణం.
5. మే- దుస్తులు
మేలో అత్యధికంగా అమ్ముడయ్యేవి దుస్తులు. ఈ నెలలో వీటిపై సూమారు 30 నుంచి 70 శాతం వరకు డిస్కౌంట్ ఉంటుంది. పెళ్లిళ్ల సీజన్ కూడా కావటం దీనికి కారణం.
6.జూన్ - గృహ అలంకరణ వస్తువులు
జూన్‌లో అలంకరణ వస్తువులకు డిమాండ్ అధికంగా ఉంటుందని ఓ సర్వేలో తేలింది. వివిధ సంస్థలు కూడా చక్కటి ఆఫర్లతో వీటిని అందిస్తాయి.
7. జులై-పాదరక్షలు
జులైలో ఎక్కువ అమ్ముడయ్యే వస్తువులు పాదరక్షలు. అందుకే సంస్థలు మంచి ఆఫర్లతో మార్కెట్లోకి వస్తాయి.
8.ఆగస్టు- లాప్‌ట్యాప్‌లు
ఆగస్టులో లాప్‌ట్యాప్‌లు, కంప్యూటర్ పరికరాలపై డిస్కౌంట్లు అధికంగా ఉంటాయని ఓ మార్కెట్ సర్వే తేల్చింది.
9. సెప్టెంబర్ - గ్రిల్స్ ,రక్షణ సామగ్రి
సెప్టెంబర్‌లో గ్రిల్స్, రక్షణ సామగ్రికి డిమాండ్ అధికం. ఈ నెలలో దొంగతనాలకు ఎక్కువ ఆస్కారం ఉండటమే ఇందుకు కారణమని ఓ సర్వే స్పష్టం చేసింది.
10. అక్టోబర్ - కార్లు, ఆటోమొబైల్ అమ్మకాలు
అక్టోబర్‌ను ఆటోమొబైల్ నెల అంటారు. ఈ నెలలో వివిధ సంస్థలకు చెందిన కార్లు, వివిధ మోడళ్లలో భారీ ఆఫర్లతో మార్కెట్లోకి విడుదలవుతాయి. కార్లు కొనడానికి అక్టోబర్ అనుకూల సమయం.
11. నవంబర్ - విద్యుత్ ఉపకరణాలు
నవంబర్ నెలలో విద్యుత్ ఉపకరణాలు చౌకగా లభిస్తాయి.
12. డిసెంబర్ - క్రీడా సామగ్రి
డిసెంబర్లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. అందుకే క్రీడల వైపు ప్రజలు ఎక్కువ మక్కువ చూపిస్తారు. క్రీడా వస్తువుల అమ్మకాలు ఎక్కువగా జరుగుతాయి. డిస్కౌంట్లూ ఇదే స్థాయిలో ఉంటాయి.