ట్రాక్టర్ల పరిశ్రమ దేశవ్యాప్తంగా గత నెలలో 3.29 శాతం అధికంగా 66,217 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. క్రితం ఏడాది ఇదేకాలంలో 63,137 ట్రాక్టర్లు అమ్ముడయ్యాయి. కొవిడ్-19 తీవ్రత తగ్గుముఖం పట్టటం, లాక్‌డౌన్ ఆంక్షల ఎత్తివేత.. తదితర కారణాల వల్ల ట్రాక్టర్ల అమ్మకాలు పెరుగుతున్నట్లు, ఈ ఏడాదిలో గత ఏడాదితో పోల్చితే ట్రాక్టర్ల అమ్మకాలు అధికంగా నమోదు కాగలవనే ఆశాభావంతో ఉన్నట్లు ఎం అండ్ ఎం లిమిటెడ్ లోని స్వరాజ్ ట్రాక్టర్స్ డివిజన్ సీఈఓ హరీష్ చవాన్ తెలిపారు. దేశీయ ట్రాక్టర్ల మార్కెట్లో మహీంద్రా, స్వరాజ్ ట్రాక్టర్లకు 40 శాతానికి పైగా వాటా ఉంది. ఈ వాటాను కొనసాగించటంతో పాటు ఈ ఏడాదిలో పరిశ్రమ సగటు వృద్ధి కంటే, స్వరాజ్ ట్రాక్టర్ల డివిజన్ అధిక వృద్ధి సాధిస్తుందని ఆయన 'ఈనాడు' కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ధీమా వ్యక్తం చేశారు.
దేశీయంగా ట్రాక్టర్ల పరిశ్రమ కొవిడ్-19 ప్రభావం నుంచి కోలుకుంటోందా?
కొవిడ్-19 ప్రభావంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వచ్చింది. అన్ని వర్గాల ప్రజల మీద, వివిధ రంగాలపై తీవ్రమైన ప్రభావం పడింది. కానీ ట్రాక్టర్ పరిశ్రమ అమ్మకాల మీద పెద్దగా ప్రభావం లేదు. పైగా ఇప్పుడు సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ప్రస్తుత సీజన్లో రుతుపవనాలు ఆశాజనకంగానే ఉన్నాయి. అందువల్ల ట్రాక్టర్ల అమ్మకాలు ఇంకా పెరుగుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్- జూన్ త్రైమాసికంలో అత్యంత సానుకూలత కనిపించింది. అందువల్ల ట్రాక్టర్ల పరిశ్రమ ఈ ఆర్థిక సంవత్సరంలో అధిక వృద్ధి నమోదు చేస్తుందని ఆశిస్తున్నాం.
ఏమేరకు వృద్ధి ఉండవచ్చు.., స్వరాజ్ ట్రాక్టర్ల అమ్మకాలు ఎలా ఉంటాయి?
గత ఆర్థిక సంవత్సరంలో (2020-21) దేశీయంగా దాదాపు 9 లక్షల ట్రాక్టర్ల అమ్మకాలను పరిశ్రమ నమోదు చేసింది. క్లిష్టమైన పరిస్థితుల్లోనూ ట్రాక్టర్ల అమ్మకాలు ఎంతో అధికంగా జరిగాయి. ఈ ఏడాది కూడా ఆకర్షణీయమైన వృద్ధి ఉంటుంది. స్వరాజ్ ట్రాక్టర్లకు సంబంధించి మేం అధిక విక్రయాల లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. అందువల్ల పరిశ్రమ సగటు వృద్ధి కంటే, ఎంతో అధికంగా స్వరాజ్ ట్రాక్టర్ల అమ్మకాలు ఉంటాయని చెప్పగలను.
దక్షిణాది రాష్ట్రాల్లో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అమ్మకాలు ఎలా ఉన్నాయి?
గత కొంతకాలంగా దక్షిణాది రాష్ట్రాల్లోనూ స్వరాజ్ ట్రాక్టర్ల అమ్మకాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో స్వరాజ్ ట్రాక్టర్లకు ఆదరణ అధికంగా ఉంది. విభిన్నమైన వ్యవసాయ పరిస్థితులు ఉన్న ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో మెట్ట వ్యవసాయ పనులకు, మాగాణి పనులకు అనువైన.., 15 హెచ్‌పీ నుంచి 65 హెచ్‌పీ వరకూ ట్రాక్టర్లను, వ్యవసాయ యంత్ర సామగ్రిని అందిస్తున్నాం. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో మాకు విస్తృతమైన మార్కెటింగ్- విక్రయాల వ్యవస్థ ఉంది. దాదాపు 65 మంది డీలర్లు ఉన్నారు.
మహీంద్రా, స్వరాజ్ ట్రాక్టర్లు.. రెండూ, మహీంద్రా అండ్ మహీంద్రాలో భాగమే. ఈ రెండింటి మధ్య పోటీ ఉండదా?
మహీంద్రా, స్వరాజ్ ట్రాక్టర్లకు మాతృ సంస్థ ఒకటే అయినప్పటికీ, ఉత్పత్తి కార్యకలాపాలు, మార్కెటింగ్, విక్రయాలు, విక్రయానంతర సేవల వరకూ.. అంతా విడివిడిగానే సాగుతాయి. అందువల్ల మా వరకూ మేం.. మహీంద్రా ట్రాక్టర్లను పోటీ బ్రాండుగానే పరిగణిస్తాం.
ఇటీవల కాలంలో స్టీలు, అల్యూమినియం ధరలు బాగా పెరిగాయి. ఈ భారాన్ని కొనుగోలుదార్ల మీద మోపుతారా లేక ట్రాక్టర్ కంపెనీలే భరిస్తాయా?
ట్రాక్టర్ల తయారీకి వినియోగించే లోహాలు ధరలు బాగా పెరిగిన మాట వాస్తవం. కానీ ఈ భారాన్ని మొత్తం రైతులు మీద మోపాలనుకోవటం లేదు. సాధ్యమైనంత వరకూ ధరలు పెంచకుండా ఉండేందుకే మేం ప్రయత్నం చేస్తున్నాం. తప్పనిసరి పరిస్థితుల్లో స్వల్పంగా పెంచాల్సి రావచ్చు.
ఇదీ చూడండి: మహీంద్రా ఎక్స్‌యూవీ700 వచ్చేసిందోచ్!