ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్ నేతృత్వంలోని ఎఫ్ఎంసీజీ సంస్థ పతంజలి గ్రూప్ టర్నోవర్ గత ఆర్థిక సంవత్సరం రూ.30,000 కోట్ల మార్క్‌ను అందుకుంది. రుచి సోయాను స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో ఈ స్థాయి టర్నోవర్ సాధించడం గమనార్హం.
ఈ నేపథ్యంలో 'బాబా రామ్‌దేవ్'తో 'ఈటీవీ భారత్' టెలిఫోన్ ద్వారా ఇంటర్వ్యూ చేసింది. పతంజలి భవిష్యత్ ప్రణాళికలు, వంట నూనెల ధరల పెరుగుదల, కంపెనీ ఐపీఓ సహా పలు సామాజిక, ఆర్థిక అంశాలపై 'ఈటీవీ భారత్'తో ఆయన పలు కీలక విషయాలు పంచుకున్నారు.
రుచి సోయా గురించి..
రుచి సోయాను దివాలా ప్రక్రియ ద్వారా పతంజలి గ్రూప్ స్వాధీనం చేసుకుంది. గ్రూప్ టర్నోవర్‌లో సగం కంటే ఎక్కువ దీని నుంచే సాధ్యమైందని పతంజలి గ్రూప్ చెబుతోంది. రుచి సోయా ప్రధానంగా.. నూనె గింజల శుద్ది, ముడి వంట నూనె రిఫైనరీలు, సోయా ఉత్పత్తుల తయరీ వంటి వ్యాపారాలు నిర్వహిస్తుంటుంది.
టీం వర్క్ వల్లే సాధ్యమైంది..
సంస్థలోని సభ్యులందరి కృషి వల్లే ఈ స్థాయిలో వృద్ధి సాధ్యమైనట్లు.. బాబా రామ్‌దేవ్ తెలిపారు. కోట్లాది మంది భారతీయులు తమపై ఎంతో నమ్మకాన్ని ఉంచారని.. అది ఎల్లప్పుడు అలానే ఉండేలా కృషి చేస్తామన్నారు.
విదేశీ కంపెనీల ఏకచక్రాధిపత్యానికి అడ్డుకట్టవేసి.. దేశాన్ని స్వయం సమృద్ధిగా మార్చాలన్నదే తమ ముఖ్య ఉద్దేశమన్నారు బాబా రామ్‌దేవ్.
పారదర్శకంగా ఐపీఓ..
రుచి సోయా ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) గురించి ప్రశ్నించగా.. ప్రజల్లో తమపై నమ్మకం పెరిగిందని, అందుకోసమే తమ కంపెనీలో పెట్టుబడి పెట్టాలని ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే 'సెబీ'కి డైరెక్ట్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (డీఆర్ఎస్)కు పతంజలి గ్రూప్ దరఖాస్తు సమర్పించినట్లు పేర్కొన్నారు.
ప్రమోషన్స్..
ఈ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించనున్నట్లు తెలిపారు బాబా రామ్‌దేవ్. ఇందుకు సంబంధించి తమ వైపు ప్రక్రియ దాదాపు పూర్తయిందని.. త్వరలోనే ఇష్యూకు రావచ్చని చెప్పారు. రుచి సోయాతో పాటు పతంజలికీ సెలెబ్రెటీలతో ప్రమోషన్స్ ఇప్పించే యోచన కూడా ఉన్నట్లు చెప్పుకొచ్చారు.
రుచి సోయాలో 98 శాతం వాటాను ప్రమోటర్లు అట్టే పెట్టుకున్నట్లు వస్తున్న ఊహాగానాల గురించి అడగగా.. కంపెనీ కోరుకుంటే.. 100 శాతం వాటాను కూడా అట్టే పెట్టుకోగలదని.. అయితే ఇందులో పెట్టుబడులు పెట్టిన వారికి మంచి రిటర్నులు రావాలనుకుంటున్నట్లు వెల్లడించారు.
వంట నూనెల ధరల్లో పెరుగుదల అందుకే..
వంట నూనెల ధరలు రికార్డు స్థాయికి పెరగటం గురించి ప్రశ్నించగా.. భారత్ ఈ విషయంలో (వంట నూనెల) స్వయం సమృద్ధి సాధించలేదని పేర్కొన్నారు బాబా రామ్‌దేవ్. అందువల్లే ధరలు పెరుగుతున్నట్లు చెప్పారు. పెరిగిన ధరలు ప్రజలకు భారంగా మారిన మాట వాస్తవమేనన్నారు.
ఇందుకు (ధరల తగ్గుదలకు) తమ వంతు ప్రయత్నం చేస్తున్నామని.. ప్రభుత్వం ఈ దిశగా చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రానున్న రోజుల్లో వంట నూనెల విషయంలో భారత్ స్వయం సమృద్ధిగా మారగలదని ధీమాగా చెప్పారు. ప్రభుత్వం కూడా ఆ దిశగా త్వరలోనే కీలక నిర్ణయం తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
వారికి అడ్డుకట్ట వేస్తాం..
ప్రత్యర్థి సంస్థల నుంచి ఎదురయ్యే పోటీ, ఇతర సమస్యల గురించి ప్రశ్నించగా.. తాము ఇప్పటికే 99 శాతం కంపెనీలను దాటుకుని ముందుకు వచ్చినట్లు తెలిపారు బాబా రామ్‌దేవ్. మిగిలిన ఒక శాతం కంపెనీల ఏక చక్రాధిపత్యానికి కూడా స్వస్తి పలుకుతామని అన్నారు. అయితే ఇందుకోసం తాము ఎలాంటి తప్పుడు మార్గాలను ఎంచుకోబోమని స్పష్టం చేశారు. తమ వినియోగదారుల సంఖ్య పెరుగుతోందని.. అందుకు తగ్గట్లుగా ముందుకు సాగుతామని వివరించారు.
అదే మా కల
'పతంజలి రీసెర్చ్ ఫౌండేషన్ పేరిట.. మాకు ప్రపంచంలోనే అతిపెద్ద పరిశోధన విభాగముంది. రుచి సోయా ద్వారా వచ్చే డబ్బు.. పరిశోధనల మీదనే ఖర్చవుతుంది. ఆ తర్వాత విద్య, వ్యవసాయం వంటి వాటికి కేటాయిస్తాం. ప్రపంచ అవసరాలకు స్థానిక పరిష్కారాలను అందించాలన్నదే.. మా కల. మా కంపెనీ ఏటా కొత్త రికార్డులు సృష్టిస్తోంది.' అని బాబా రామ్‌దేవ్ పేర్కొన్నారు.
అంతా దేశీయంగానే..
దిగుమతుల గురించి ప్రస్తావించగా.. తాము ఇతర దేశాలపై ఆధారపడటం చాలా వరకు తగ్గించుకున్నట్లు బాబా రామ్‌దేవ్ వెల్లడించారు. తమ ఉత్పత్తుల తయారీకి కావాల్సిన 90 శాతం ముడి పదార్థాలను దేశీయంగానే సరఫరా అవుతున్నట్లు తెలిపారు.
ప్రభుత్వ చొరవ అవసరం..
పెరుగుతున్న ద్రవ్యోల్బణం వంటి ఆర్థిక అంశాలు, కరోనా వ్యాప్తి, జనాభా వృద్ధి వంటి సామాజిక అంశాలపైనా బాబా రామ్‌దేవ్ స్పందించారు. త్వరలోనే సానుకూలమైన విషయాలను వింటామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆహార పదార్థాల ధరలని నియంత్రించేందుకు ప్రభుత్వం వినూత్నమైన నిర్ణయాలను తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
ఇవీ చదవండి: