విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ లిమిటెడ్ .. తెలుగు రాష్ట్రాలలో ఆరోగ్య పరీక్షలకు సంబంధించి చాలా మందికి సుపరిచితమైన పేరు. కేదారా క్యాపిటల్ మద్దతుతో విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ఈ సెప్టెంబర్ 1న 'ఐపీఓ'కు రానుంది. ఈ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ లిమిటెడ్ తన ప్రారంభ పబ్లిక్ ఆఫర్ ధరను రూ. 522-531గా నిర్ణయించింది. సంస్థ తన 'ఐపీఓ' సెప్టెంబర్ 1న ప్రారంభమై సెప్టెంబర్ 3తో ముగుస్తుందని తెలిపింది.
ఐపీఓ దాని ప్రస్తుత వాటాదారులు, ప్రమోటర్ల ద్వారా 35.69 మిలియన్ షేర్ల ఆఫర్ ఫర్ సేల్ కలిగి ఉంది. ఆఫర్ ఫర్ సేల్‌లో డాక్టర్ ఎస్. సురేంద్రనాథ్ రెడ్డి ద్వారా 5.1 మిలియన్ షేర్లు, కారకోరం లిమిటెడ్ ద్వారా 29.49 మిలియన్ షేర్లు, కేదారా క్యాపిటల్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ - కేదారా క్యాపిటల్ ఏఐఎఫ్ఐ ద్వారా 1.10 మిలియన్ షేర్లు ఉన్నాయి. ఎగువ బ్యాండ్ ధరపై కంపెనీ రూ. 1,895.14 కోట్లు సమీకరించాలని యోచిస్తోంది. సంస్థ షేర్లను సెప్టెంబర్ 14న ఎక్స్ఛేంజీలలో లిస్ట్ చేసే అవకాశం ఉంది. ఐసీఐసీఐ సెక్యూరిటీస్, ఎడెల్‌వైస్ ఫైనాన్షియల్ సర్వీసెస్, కోటక్ మహీంద్రా క్యాపిటల్ కంపెనీ లిమిటెడ్ ఈ ఐపీఓ ఇష్యూకు లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి.
2021 ఆర్థిక సంవత్సరానికి ఈ సంస్థ రూ. 376.75 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. గతేడాది ఈ లాభం 338.82 కోట్లు మాత్రమే. ఈ ఏడాది నికర లాభం రూ. 84.91 కోట్లు. గతేడాది నికర లాభం రూ. 62.51 కోట్లు. సంస్థకు బ్యాంక్ బ్యాలెన్స్ రూ. 200.11 కోట్లు ఉండగా, మార్చి 2021 నాటికి రుణ బకాయిలు రూ. 4.47 కోట్లుగా ఉన్నాయి.
విజయ డయాగ్నోస్టిక్ దక్షిణ భారతదేశంలో అనేక ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్న సంస్థ. అంతేగాక ఆరోగ్య పరీక్షల ద్వారా అధిక ఆదాయం ఆర్జిస్తున్న సంస్థ కూడా. ఒకే చోట పాథాలజీ, రేడియాలజీ సేవలతో వినియోగదారులకు అనేక రకాల ఆరోగ్య పరీక్షల సేవలను అందిస్తుంది. 80 డయాగ్నోస్టిక్ సెంటర్‌లను, 11 రిఫరెన్స్ లాబరేటరీలను 13 నగరాలలో, అనేక పట్టణాల్లో నిర్వహిస్తోంది. ఢిల్లీ ఎన్‌సీఆర్, కోల్‌కతలో కూడా ఈ సంస్థ డయగ్నోస్టిక్ సెంటర్లను నిర్వహిస్తోంది.
ఈ సంస్థ మర్చి 2021 నాటికి సుమారు 740 సాధారణ, 870 ప్రత్యేక పాథాలజీ పరీక్షలు, 320 ఆధునాతన రేడియాలజీ పరీక్షలను అందిస్తుంది.
ఇదీ చూడండి: కోటి యూజర్ల 'కూ'- న్యూస్ సైట్‌కు యాహూ గుడ్ బై