కొవిడ్-19 ప్రజల జీవన విధానంలో చాలా మార్పులు తీసుకొచ్చింది. ప్రజలు ఎక్కువగా ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. కొవిడ్ భద్రత చర్యల్లో భాగంగా మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడమే కాకుండా సొంత వాహనాల్లో ప్రయాణించడానికి ప్రజలు మొగ్గు చూపుతున్నారు. రోజువారీ పనుల నిమిత్తం బయటకు వెళ్లేవారు, కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు టూవీలర్ కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. కారు కొనుగోలు చేయాలనుకునేవారు సైతం ట్రాఫిక్‌ను దృష్టిలో ఉంచుకుని టూవీలర్ వైపే ఆసక్తి కనబరుస్తున్నారు. మీరూ ఆ జాబితాలో ఉన్నారా? బ్యాంకు రుణం తీసుకుని కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే, బ్యాంక్ లోన్ నిబంధనలు, మీ రుణ అర్హత, వివిధ బ్యాంకులు ఆఫర్ చేస్తున్న వడ్డీ రేట్లు తదితర వివరాలు తెలుసుకోవడం ముఖ్యం. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
సాధారణంగా బ్యాంకులు వాహనం విలువలో 90 శాతం వరకు రుణం ఇస్తాయి. మిగిలిన 10 శాతం డౌన్‌పేమెంట్ రూపంలో కొనుగోలుదారుడు స్వయంగా చెల్లించాలి. కాబట్టి దరఖాస్తు చేసుకునే ముందే వాహనం కొనుగోలు చేసేందుకు ఎంత మొత్తం ఖర్చవుతుంది? ఎంత రుణం లభిస్తుంది? లెక్కించి, డౌన్‌పేమెంట్ చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నారా చూసుకోవాలి. వాహనాన్ని ఎంపిక చేసుకునేటప్పుడు కావలసిన ఫీచర్లతో బడ్జెట్‌లో ఉండే వాహనాన్ని ఎంచుకోవాలి.
కావలసిన పత్రాలు..: దరఖాస్తు ఫారంతో పాటు గుర్తింపు ధ్రువపత్రం (పాన్‌కార్డు, ఓటర్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్), చిరునామా ధ్రువపత్రం (యుటిలిటీ బిల్స్, పాస్‌పోర్ట్), ఆదాయ ధ్రువపత్రం (ఉద్యోగులైతే పేస్లిప్, ఐటీ రిటర్నులు, బ్యాంకు స్టేట్‌మెంటులు, ఉద్యోగులు కాని వారు ఐటీ రిటర్నులు, బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు, ఆడిట్ ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్లు) ఇవ్వాల్సి ఉంటుంది.
రుణ అర్హతలు: తక్కువ వడ్డీ రేటుతో రుణం ఆమోదం పొందడంలో క్రెడిట్ స్కోరు ముఖ్య పాత్ర పోషిస్తుంది. 750 కంటే తక్కువ స్కోరు ఉన్న వారి దరఖాస్తులను బ్యాంకులు తిరస్కరించొచ్చు లేదా అధిక వడ్డీతో రుణం మంజూరు చేయొచ్చు. రుణం పొందేందుకు కనీస వయసు 21 సంవత్సరాలు. గరిష్ఠంగా 65 నుంచి 70 సంవత్సరాలు ఉండొచ్చు. నెలవారీ ఆదాయం కనీసం రూ.6 వేలు ఉండాలి. కనీసం ఒక సంవత్సరం వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. ప్రస్తుత చిరునామాలో కనీసం ఒక సంవత్సరం నుంచి నివసిస్తూ ఉండాలి. రుణ అర్హతలు అన్ని బ్యాంకులకూ ఒకే విధంగా ఉండవు.
ద్విచక్ర వాహన రుణాలను తక్కువ వడ్డీ రేట్లకు అందిస్తున్న 15 బ్యాంకులు-మూడేళ్ల కాలపరితితో చెల్లించాల్సిన నెలవారీ ఈఏంఐల వివరాలు..
- యూకో బ్యాంక్ - వార్షిక వడ్డీ రేటు 7.20 శాతం, ఈఎంఐ - రూ.3,097
- సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా - వార్షిక వడ్డీ రేటు 7.25 శాతం, ఈఎంఐ - రూ.3,099
- బ్యాంక్ ఆఫ్ ఇండియా - వార్షిక వడ్డీ రేటు 7.35 శాతం, ఈఎంఐ - రూ.3,104
- పంజాబ్ నేషనల్ బ్యాంక్ - వార్షిక వడ్డీ రేటు 8.45 శాతం, ఈఎంఐ - రూ.3,154
- జమ్ము అండ్ కశ్మీర్ బ్యాంక్ - వార్షిక వడ్డీ రేటు 8.70 శాతం, ఈఎంఐ- రూ.3,166
- పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ - వార్షిక వడ్డీ రేటు 8.80 శాతం, ఈఎంఐ - రూ.3,171
- కెనరా బ్యాంక్ - వార్షిక వడ్డీ రేటు 9 శాతం, ఈఎంఐ - రూ.3,180
- ఐడీబీఐ బ్యాంక్ - వార్షిక వడ్డీ రేటు 9.80 శాతం, ఈఎంఐ - రూ.3,217
- యూనియన్ బ్యాంక్ - వార్షిక వడ్డీ రేటు 9.90 శాతం, ఈఎంఐ- రూ.3,222
- బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర - వార్షిక వడ్డీ రేటు 10.05 శాతం, ఈఎంఐ - రూ.3,229
- ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ - వార్షిక వడ్డీ రేటు 10.05 శాతం, ఈఎంఐ - రూ.3,229
- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా - వార్షిక వడ్డీ రేటు 10.25 శాతం, ఈఎంఐ - రూ.3,238
- యాక్సిస్ బ్యాంక్ - వార్షిక వడ్డీ రేటు 10.80 శాతం, ఈఎంఐ - రూ.3,264
- సౌత్ ఇండియన్ బ్యాంక్ - వార్షిక వడ్డీ రేటు 10.95 శాతం, ఈఎంఐ - రూ.3,272
- బ్యాంక్ ఆఫ్ బరోడా - వార్షిక వడ్డీ రేటు 11 శాతం, ఈఎంఐ - రూ.3,274
నోట్: బ్యాంక్ వైబ్‌సైట్‌ల ప్రకారం సెప్టెంబరు 21, 2021 నాటికి ఆయా బ్యాంకులు ఆఫర్ చేస్తున్న వడ్డీరేట్లు ఇక్కడ ఇచ్చాం..
ఇవీ చదవండి: