భారత ఐటీ నిపుణులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పెద్ద దెబ్బకొట్టారు. హెచ్-1బీ సహా వివిధ రకాల ఉద్యోగ వీసాలను ఈ ఏడాది డిసెంబరు 31 వరకు జారీ చేయకూడదని ఉత్తర్వులిచ్చారు. ఇవి బుధవారం నుంచే అమల్లోకి వస్తాయి. త్వరలో అధ్యక్ష ఎన్నికలను ఎదుర్కోబోతున్న ట్రంప్.. స్థానికులను ఆకట్టుకోవడంలో భాగంగానే ఈ ఉత్తర్వులను తీసుకొచ్చారని భావిస్తున్నారు. ఆయన నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజా ఉత్తర్వులతో అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే విదేశీయులందరిపై, ప్రధానంగా భారతదేశ ఐటీ నిపుణులపై ప్రభావం పడుతుంది. అమెరికాకు హెచ్-1బీ వీసాలపై వచ్చి, కాల పరిమితి అనంతరం వాటిని పునరుద్ధరించుకోవాల్సి ఉన్నవారికి తాజా ఉత్తర్వులు శరాఘాతమే. కొత్తగా గ్రీన్‌కార్డుల జారీనీ నిషేధించారు.
విదేశీయులతో మా మార్కెట్‌పై ప్రభావం
"విదేశీ సిబ్బంది వల్ల అమెరికా లేబర్ మార్కెట్‌పై ప్రభావం పడుతోంది. ప్రస్తుతం దేశంలో నిరుద్యోగిత బాగా పెరిగిపోయిన నేపథ్యంలో ఇలాంటి నిర్ణయం అవసరమే."
- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
ఈ నిర్ణయం సరికాదు
"అమెరికా ఆర్థికంగా, సాంకేతికంగా ఎదగడానికి వలసలు ఉపయోగపడ్డాయి. గూగుల్ ఈ స్థాయిలో ఉండటానికి కారణం వారే. అమెరికా నిర్ణయం అసంతృప్తికి గురిచేసింది. మేం వలసదారుల పక్షానే నిలుస్తాం."
- సుందర్ పిచాయ్, గూగుల్ సీఈవో
ప్రభావం ఇలా ?
ట్రంప్ తాజా ఆంక్షల ప్రభావం హెచ్-1బీపై మాత్రమే కాకుండా ఇంకా పలు వీసాలపై ఉంటుంది. అయితే అమెరికా వెలుపల ఉంటూ, చెల్లుబాటయ్యే నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా లేనివారికి, ఇతరత్రా అధికారిక ప్రయాణ పత్రాలు లేనివారికి మాత్రమే కొత్త నిబంధనలు వర్తిస్తాయి. పాస్‌పోర్టులో వీసా స్టాంపింగ్ పూర్తయి విదేశాల్లో ప్రయాణాల్లో ఉన్నవారికి ఈ ఉత్తర్వుల నుంచి మినహాయింపు ఉంటుంది. ఏ వీసాదారులపై ప్రభావం ఎలా ఉంటుందంటే..
హెచ్-1బీ
వివిధ రంగాల్లో నైపుణ్యం ఉన్నవారిని అమెరికా కంపెనీలు తమ ఉద్యోగులుగా నియమించుకునేందుకు హెచ్-1బీ వీసా వీలు కల్పిస్తుంది. ఈ ఏడాది అక్టోబరు ఒకటో తేదీ నుంచి మొదలయ్యే 2021 ఆర్థిక సంవత్సరం కోసం ఇప్పటికే అమెరికా, భారత్‌లకు చెందిన పలు కంపెనీలు హెచ్-1బీ వీసాలను జారీ చేశాయి. తాజా నిర్ణయం వాటన్నింటిపైనా పడనుంది. ఇలా వీసాలు పొందినవారు కనీసం ఈ ఏడాది చివరి వరకు నిరీక్షించాల్సిందే. ఆ తర్వాతే స్టాంపింగ్ నిమిత్తం ప్రయత్నించాల్సి వస్తుంది.
వీసా స్టేటస్ మార్చుకోవాలనుకునే విద్యార్థులు
అమెరికాలో ఇప్పటికే చెల్లుబాటయ్యే పత్రాలతో ఉన్నవారిపై ప్రభావం పడదు. ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ)పై ఉండి హెచ్-1బీ స్టేటస్‌కు మారాలనుకుంటున్న విద్యార్థులపై ప్రభావం ఉండదు. అయితే వారు అమెరికాను వీడి వెళ్లకూడదని, వెళ్తే తాజా ఉత్తర్వుల ప్రభావం వారిపై ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు.
హెచ్-2బీ
వ్యవసాయేతర రంగంలో తాత్కాలికంగా పనిచేసే కార్మికులకు ఇచ్చే వీసా. సంవత్సరానికి 66వేల మందికి ఇది జారీ చేస్తారు. తాజా ఆంక్షలతో ఫుడ్‌ప్రాసెసింగ్, హోటళ్లు వంటి రంగాల్లో పని చేయాలనుకునేవారికి ఈ ఏడాదికి అవకాశం లేనట్లే.
హెచ్-4
హెచ్-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములు, వారి పిల్లలకు పని చేసేందుకు అవకాశమిచ్చే వీసా ఇది. ఇవి కాకుండా ఎక్స్ఛేంజి కార్యక్రమాల కింద ఇచ్చే జె-1 వీసాలు, జె-1 వీసాదారుల జీవిత భాగస్వాములు/పిల్లలకు ఇచ్చే జె-2 వీసాలు, ఎల్-1 వీసాదారులపై ఆధారపడిన వారికిచ్చే ఎల్-2 వీసాలనూ ఆంక్షల చట్రంలోకి తీసుకొచ్చారు.
ఎల్-1
ఒక కంపెనీలో అంతర్గత బదిలీలకు ఉద్దేశించినవే ఎల్-1 వీసాలు. తాజా ఉత్తర్వుల ప్రకారం విదేశాల్లో ఉన్న వారు బదిలీపై అమెరికాలో ఉన్న అదే సంస్థలోకి రావడానికి వీల్లేదు.
ట్రంప్ నిర్ణయంపై అసంతృప్తి
కరోనా ప్రభావంతో ఉద్యోగాలు కోల్పోయిన అనేక లక్షల మంది అమెరికా వాసులకు సాయం అందించడానికి ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ట్రంప్ చెబుతున్నారు. ట్రంప్ నిర్ణయంతో అమెరికా పౌరులకు 5,25,000 ఉద్యోగాలు లభించేందుకు వీలవుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. తాజా ఉత్తర్వులపై గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ సహా పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు. వీసాల విషయంలో నిర్ణయాన్ని అధ్యక్షుడు పునఃసమీక్షించుకోవాలని భారతీయ అమెరికన్ శాసనకర్త రాజా కృష్ణమూర్తి సూచించారు. ఆర్థిక వ్యవస్థ పునరుత్థానికి, కరోనా తదుపరి దశను ఎదుర్కొనేందుకు, ఉద్యోగాల సృష్టికి విఘాతం కలిగించేలా తాజా ఉత్తర్వు ఉందని చెప్పారు. మరికొందరు అగ్రశ్రేణి సెనేటర్లు కూడా స్పందిస్తూ.. అవసరమైతే వీసాల విధానాన్ని మార్చాలే గానీ ఇలా స్తంభింపజేయకూడదని అభిప్రాయపడ్డారు. ఇలాంటి నిర్ణయాలతో అమెరికా ఆర్థిక పురోగమనం మరింత కష్టమవుతుందన్నారు. భారతీయుల బదులు అమెరికన్లను ఉద్యోగాల్లో తీసుకోవాల్సి రావడం వల్ల అమెరికా కంపెనీలకూ ఇకపై ఆర్థిక భారం పెరుగుతుందని మరికొందరు చెబుతున్నారు.
లాటరీలో ఎంపికైన 25 వేల మందికీ నిరాశే
అమెరికాలో ఉద్యోగం చేసేందుకు దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హుల ఎంపికకు ఏటా లాటరీ నిర్వహిస్తారు. అందులో ఎంపికైన వారి దరఖాస్తులకు మాత్రమే వీసా జారీ ప్రక్రియను చేపడతారు. నెలన్నర ముందుగానే ఈ ఏడాది లాటరీ ప్రక్రియ పూర్తయింది. లాటరీలో ఎంపికైనవారు నాలుగైదు నెలల్లో అమెరికా వెళ్తారు. ఈ దఫా లాటరీ నిర్వహించిన కొద్దిరోజుల్లో కరోనా వైరస్ తీవ్రరూపం దాల్చటంతో ప్రపంచవ్యాప్తంగా రాయబార, కాన్సులేట్ కార్యాలయాలను అమెరికా ప్రభుత్వం మూసివేసింది. వారి దరఖాస్తులు దస్త్రాల్లోనే ఉండిపోయాయి. లాటరీలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 25 వేల మంది వరకు ఎంపికైనట్లు వీసా కన్సల్టెంట్ల వద్ద సమాచారం ఉంది. నిషేధం నేపథ్యంలో వారికి అమెరికా ద్వారాలు మూసుకుపోయాయి. వచ్చే ఏడాది నిర్వహించే లాటరీలో మరో దఫా వారు అదృష్టాన్ని పరీక్షించుకోవాల్సిందేనని అమెరికాలోని ఓ అటార్నీ ప్రతినిధి మంగళవారం ‘ఈనాడు’కు చెప్పారు. హెచ్-1బీ వీసా గడువు పొడిగింపు కోసం ఇక్కడికి వచ్చినవారు ఆరు నెలల పాటు అక్కడికి వెళ్లలేని పరిస్థితి అని ఐఎంఎఫ్‌ఎస్ కన్సల్టెన్సీ ప్రతినిధి అజయకుమార్ వేములపాటి చెప్పారు.
ఇదీ చూడండి: మోదీ చేతుల్లోనే దేశం భద్రం!