భారత్‌కు గతంలో రద్దు చేసిన ప్రాధాన్య వాణిజ్య హోదా(జీఎస్పీ)ను పునరుద్ధరించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు అమెరికా తెలిపింది. ఈ మేరకు భారత్‌తో చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించింది. జీఎస్పీ లబ్ధికి ప్రతిగా భారత్ నుంచి సరైన ప్రతిపాదనలు వస్తే పునరుద్ధరణ దిశగా వేగంగా అడుగులు పడతాయని పేర్కొంది.
వాషింగ్టన్‌కు చెందిన ఓ ప్రతినిధి చట్టసభలో మాట్లాడుతూ.. యాపిల్ పండ్లపై భారత్ 70 శాతం సుంకాలు విధిస్తోందని తెలిపారు. దీని నుంచి విముక్తి పొందాలంటే ఏం చేయాలని ప్రశ్నించారు. మరో ప్రతినిధి మాట్లాడుతూ.. పప్పు దినుసులపై కూడా భారత్ సుంకాలు పెంచిందని గుర్తుచేశారు. ఇండియాలో దినుసులకు భారీ గిరాకీ ఉందని పేర్కొన్నారు. కానీ, సుంకాల పెంపు వల్ల అమెరికా రైతులు నష్టపోతున్నారన్నారు. ఇలా పలువురు ప్రతినిధులు భారత్‌కు జీఎస్పీ రద్దు చేయడం వల్ల కలుగుతున్న నష్టాన్ని తెరమీదకు తెచ్చారు. దీనికి బదులిస్తూ వాణిజ్య ప్రతినిధి రాబర్ట్ లైటైజర్ గురువారం జీఎస్పీ పునరుద్ధరణ దిశగా జరుగుతున్న ప్రయత్నాల్ని వివరించారు.
జీఎస్పీ రద్దుకు ప్రతిగా భారత్ విధించిన సుంకాలు అధికంగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. అందుకే తిరిగి దాన్ని పునరుద్ధరించేందుకు చర్చలు జరుపుతున్నామన్నారు. అలాగే భారత్‌తో భారీ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునే దిశగానూ చర్చలు జరుగుతున్నట్లు ట్రంప్ పాలకవర్గంలోని మరో అధికారి తెలిపారు.
ఇదీ చూడండి:ఆహారం దొరక్క కొబ్బరి చెట్టెక్కిన భల్లూకం