అమెరికాలో వచ్చే రెండేళ్లలో మాంద్యం ఏర్పడే అవకాశముందని అనేక మంది ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. నిజానికి ఈ ఏడాదే మాంద్యాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని తొలుత భావించారు. కానీ ఇప్పుడు ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ చర్యల వల్ల ఈ సంవత్సరం గట్టెక్కినట్టేనని అభిప్రాయపడుతున్నారు.
అప్పుడు 10... ఇప్పుడు 2
నేషనల్ అసోసియేషన్ ఫర్ బిజినెస్ ఎకనామిస్ట్స్(ఎన్ఏబీఈ) సంస్థ 226 మంది ఆర్థిక నిపుణలపై ఈ సర్వే నిర్వహించింది. వీరిలో కేవలం రెండు శాతమే ఈ ఏడాది మాంద్యం ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఇదే సంస్థ ఫిబ్రవరిలోనూ సర్వే నిర్వహించింది. అప్పుడు 10శాతం మంది 2019లోనే మాంద్యం ఎదుర్కోవాల్సి వస్తుందని అభిప్రాయపడ్డారు.
ట్రంప్ ఒత్తిడి...
వడ్డీ రేట్లను తగ్గించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫెడరల్ బ్యాంకుపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. జులై 31న వడ్డీ రేట్లను తగ్గించింది ఫెడ్. ఈ పరిణామాల మధ్య ఎన్ఏబీఈ సర్వే నిర్వహించింది.
2018లో పెంచిన వడ్డీ రేట్లను ఇప్పుడు తగ్గించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఫెడ్ సంకేతాలిస్తోంది. అమెరికా- చైనా వాణిజ్య యుద్ధం తదితర అంశాలే ఇందుకు కారణం.
అయితే మాంద్యం 2020లోనే వస్తుందా లేక 2021లో వస్తుందా అనే అంశంపై భిన్నాభిప్రాయాలు వెలువడ్డాయి. వచ్చే ఏడాదే మాంద్యం ఉంటుందని 38 శాతం మంది అంచనా. 2021 వరకు ఆ సమస్య ఉండదని మరో 34 శాతం మంది అభిప్రాయం.
ఇదీ చూడండి:- ఫ్లిప్కార్ట్లో షాపింగే కాదు... ఇక వినోదం కూడా...