ఇప్పటికీ పలు దేశాల్లో పూర్తి వ్యాక్సినేషన్‌కు సరిపడా కరోనా టీకాలు అందుబాటులో లేవని.. ఈ సమయంలో బూస్టర్ డోసును(Poonawalla Booster Dose) ప్రారంభించడం అనైతికమని సీరమ్ ఇన్స్టిట్యూట్ సీఈఓ అదర్ పూనావాలా(Adar Poonawalla News) అన్నారు. ఇప్పటికే కొన్ని సంపన్న దేశాలు బూస్టర్ డోసు పంపిణీని మొదలు పెట్టగా.. మరికొన్ని దేశాలు ఆ దిశగా ప్రణాళికలు రచిస్తున్నాయి.
"అభివృద్ధి చెందుతున్న దేశాలు 2 నుంచి 3 శాతం మాత్రమే టీకాలు పొందాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో వ్యాక్సినేషన్ రేటు 40 నుంచి 50 శాతంగా ఉంది. ఈ సమయంలో బూస్టర్ డోసు ఇవ్వడం సరికాదు. ప్రపంచదేశాలు గణనీయమైన స్థాయిలో రెండుడోసులు పొందిన తర్వాత.. అప్పుడు బూస్టర్ డోసు ఇవ్వడం గురించి ఆలోచించాలి"
-అదర్ పూనావాలా, సీరమ్ ఇనిస్టిట్యూట్ సీఈఓ
బెంగళూరులో జరిగిన ఒక కార్యక్రమంలో భాగంగా ఆయన(Poonawalla Booster) పలు వ్యాఖ్యలు చేశారు. 'వైరస్ ముప్పు పొంచి ఉన్న వ్యక్తులు, బలహీన రోగనిరోధక శక్తి ఉన్నవారికి మాత్రం ఈ డోసు ఇవ్వడం గురించి ఆలోచించొచ్చు. అలాగే కొవిషీల్డ్‌కు మూడో మోతాదు ఇవ్వాల్సిన అవసరం ఉందని ఇప్పటికైతే ఎలాంటి ఆధారాలు లేవు. కొందరు ఈ డోసు తీసుకొని ఉండొచ్చు. మా నుంచి మాత్రం ఎలాంటి సిఫార్సు లేదు. డెల్టా వేరియంట్‌పై వ్యాక్సిన్ ప్రభావం, కేంద్ర ప్రభుత్వం సూచన మేరకు ఆ డోసుపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇప్పటికే కొన్ని పాశ్చాత్య దేశాలు దీనిపై ముందుకెళ్తున్నాయి. ఇప్పుడు మన లక్ష్యం మాత్రం అందరికీ రెండు డోసుల టీకా ఇవ్వడమే. భారత్‌లో టీకా తయారీదారులు ఉండటం మనందరి అదృష్టం. లేకపోతే మన పరిస్థితి కూడా ఆఫ్రికా దేశాల మాదిరిగానే ఉండేది' అని అన్నారు.
ఇదీ చదవండి:కొత్త ఆఫీస్ కొన్న 'సీరం బాస్'- విలువ తెలిస్తే షాకే!