2030 నాటికి పెట్రోల్, డీజిల్ కార్ల విక్రయాలపై నిషేధం విధించే అంశాన్ని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ పరిశీలిస్తున్నారు. దీనిపై ఆయన వచ్చేవారం ఓ ప్రకటన చేయవచ్చని సమాచారం. ఈ విషయాన్ని ఆంగ్ల వార్తపత్రిక ఫైనాన్షియల్ టైమ్స్ ప్రకటించింది. వాస్తవానికి బ్రిటన్.. 2040 ఏడాదికి పెట్రోల్, డీజిల్ కార్లను నిషేధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే.. బోరిస్ జాన్సన్ అధికారం చేపట్టాక గడువును 2035గా మార్చింది. ఇప్పుడు దానిని మరోసారి సవరిస్తూ 2030కి కుదించే అవకాశం ఉంది.
ప్రధాని బోరిస్ జాన్సన్ వచ్చే వారం పర్యావరణ పాలసీపై ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా గడువును 2030కి కుదిస్తారని ఫైనాన్షియల్ టైమ్స్ పేర్కొంది. బీబీసీ కూడా ఇలాంటి రిపోర్ట్‌ను గత వారమే ప్రచురించింది. అయితే.. ఈ అంశంపై వ్యాఖ్యానించేందుకు ప్రధాని కార్యాలయ ప్రతినిధి నిరాకరించారు.
వీటికి మినహాయింపు..
పెట్రోల్, ఎలక్ట్రానిక్ ఇంజిన్ల కలయికతో ఉండే హైబ్రీడ్ కార్లకు మాత్రం ఈ నిషేధం నుంచి మినహాయింపు ఉండొచ్చని భావిస్తున్నారు. పెట్రోల్, డీజిల్ కార్ల విక్రయాలు ముగిస్తే అది బ్రిటన్ ఆటోమొబైల్ మార్కెట్లలో అతిపెద్ద మలుపు అవుతుంది. ప్రస్తుతం బ్రిటన్ మార్కెట్లో ఈ రెండు రకాల కార్ల వాటా 73.6శాతం ఉంది.
ఇదీ చదవండి: డీజిల్ మోడళ్ల కొనసాగింపునకే హ్యుందాయ్ మోటర్స్ మొగ్గు