soma sankara prasad interview: నిరర్థక ఆస్తులు పెరగడంతో ఆర్‌బీఐ ఆంక్షల పరిధిలోకి వెళ్లినప్పటికీ.. తిరిగి వృద్ధిలోకి వచ్చి, తమ సామర్థ్యాన్ని చాటి చెప్పామని యూకో బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్(ఎండీ), చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) సోమ శంకర ప్రసాద్ అన్నారు. 'దాదాపు మూడేళ్లుగా బ్యాంకు విస్తరణ ప్రణాళికలు పూర్తిగా నిలిచిపోయాయి. దీన్ని సవాలుగా తీసుకొన్నాం. ఆర్‌బీఐ సత్వర దిద్దుబాటు చర్యల (పీసీఏ) పరిధి నుంచి బయటకు వచ్చాం. మేము కోల్పోయిన మార్కెట్ వాటాను సాధించడమే ఇప్పుడు మా ముందున్న లక్ష్యం' అని చెబుతున్నారు. ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో సమీప భవిష్యత్తులో వడ్డీ రేట్లు పెరిగేందుకు అవకాశం ఉంటుందని 'ఈనాడు' ఇంటర్వ్యూలో తెలిపారు. విశేషాలు..
యూకో బ్యాంకుకున్న అవకాశాలు, సవాళ్లను ఏ విధంగా విశ్లేషిస్తారు
మాది 78 ఏళ్ల వారసత్వం. బ్యాంకులో సగటు ఉద్యోగుల వయసు 35. ఈశాన్య రాష్ట్రాల్లో బలంగా ఉన్నాం. రూ.3.5 లక్షల కోట్ల వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాం. మూలధన నిష్పత్తి 14.56% ఉంది. నిబంధనల మేరకు 11.5% ఉంటే సరిపోతుంది. ఇవన్నీ మా బలాలే. సవాళ్ల విషయానికి వస్తే.. భారత్‌లో బ్యాంకింగ్ రంగం వృద్ధికి ఎంతో అవకాశం ఉంది. దీన్ని మేము ఒడిసిపట్టుకోవాలి. గత మూడేళ్లుగా మామీద ఆర్‌బీఐ పీసీఏ ఆంక్షలున్నాయి. మేము మళ్లీ కొత్తగా పరిచయం చేసుకోవాల్సి ఉంది. ఈ మధ్యకాలంలో కోల్పోయిన మార్కెట్ వాటాను తిరిగి సొంతం చేసుకోవాలి.
బ్యాంకు వృద్ధి కోసం చేస్తున్న ప్రయత్నాలేమిటి
బ్యాంకును సంస్థాగతంగా బలోపేతం చేస్తున్నాం. ప్రస్తుతం మాకు 3,000లకు పైగా శాఖలున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 200 శాఖలను ప్రారభించబోతున్నాం. కార్పొరేట్ రుణాలతోపాటు, రిటైల్, ఎంఎస్‌ఎంఈ, వ్యవసాయ రుణాలపై దృష్టి సారిస్తున్నాం. గృహరుణాల మార్కెట్‌లో విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నాం. జీవిత బీమా పాలసీల విక్రయం, క్రెడిట్ కార్డులు, మ్యూచువల్ ఫండ్లు ఇలా వడ్డీయేతర ఆదాయం పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. ఫిస్‌డం అంకుర భాగస్వామ్యంతో డీమ్యాట్ ఖాతాను అందించడం, డిస్కౌంట్ బ్రోకరేజీసేవలు అందుబాటులోకి తీసుకొచ్చాం. ఈ ఆర్థిక సంవత్సరంలో 820 నియామకాలు చేపట్టాం. అవసరాన్ని బట్టి మరిన్ని నియామకాలు ఉంటాయి.
కొవిడ్ తర్వాత రుణాల విభాగంలో పరిస్థితి ఎలా ఉంది
స్థూలంగా బ్యాంకింగ్ రంగంలో కార్పొరేట్ రుణాలు కాస్త నెమ్మదించాయి. ఇప్పుడిప్పుడే సిమెంట్, స్టీలు, రోడ్లు తదితర రంగాల్లోని పరిశ్రమలు, ప్రభుత్వ రంగంలోని సంస్థలు రుణాలు తీసుకోవడం ప్రారభించాయి. ప్రైవేటు కార్పొరేట్లు సెప్టెంబరు నుంచి రుణాలను అధికంగా తీసుకుంటాయని అంచనాలున్నాయి. మా రుణాల విభాగంలో 12-15% వరకూ వృద్ధి సాధించాలనే లక్ష్యం విధించుకున్నాం.
నిరర్థక ఆస్తులు ఎంత శాతం ఉన్నాయి
పీసీఏ ఆంక్షల నుంచి బయటపడేందుకు నిరర్థక ఆస్తులను తగ్గించుకోవడంపైనే దృష్టి సారించాం. ఇప్పుడు మా స్థూల ఎన్‌పీఏలు మూడో త్రైమాసికంలో 18% ఉండగా, నికర ఎన్‌పీఏ 2.81% మాత్రమే. కొత్తగా ఎన్‌పీఏలు వచ్చే అవకాశం ఏమీ లేదు. కొన్ని రాని బాకీలకు ముందుగానే కేటాయింపులు చేశాం. అవి తర్వాత వసూలు అవుతాయనే నమ్మకం ఉంది. వ్యవసాయ, ఎంఎస్‌ఎంఈలలో ఎన్‌పీఏలు నమోదయ్యే అవకాశం ఉంది కానీ, ఇవేమంత పెద్ద మొత్తాలు కావు.
బ్యాంకు లాభాలు ఎలా ఉన్నాయి? రానున్న సంవత్సరాల్లో పనితీరు ఎలా ఉండబోతోంది
ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకూ వరుసగా మూడు త్రైమాసికాల్లో రూ.100 కోట్లు, రూ.200 కోట్లు, రూ.310 కోట్ల లాభాన్ని ఆర్జించాం. మార్చి 31 నాటికి మొత్తం రూ.850 కోట్ల వరకూ లాభం ఉంటుందని అంచనా వేస్తున్నాం. ఇప్పుడున్న వ్యాపారం నిర్వహించినా మా లాభాలు ఇదే స్థాయిలో ఉంటాయి. కానీ, ఇక్కడితో మేము ఆగిపోం. కనీసం 15 శాతం వృద్ధి సాధించాలనుకుంటున్నాం. వచ్చే ఆర్థిక సంవత్సరం రూ.1,000 కోట్ల లాభాన్ని ఆర్జించడమే మా ముందున్న లక్ష్యం.
డిజిటలీకరణ దిశగా యూకో బ్యాంకు ఎలా సిద్ధమవుతోంది
పెద్ద బ్యాంకులు సాంకేతికంగా ముందుండేందుకు పెట్టుబడులు పెడుతున్నాయి. మేము అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు ఫిన్‌టెక్ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంటున్నాం. ఆన్‌లైన్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ నేటితరం యవతను ఆకర్షించేలా తీర్చిదిద్దాం. వచ్చే మార్చి నాటికి వ్యక్తిగత రుణాల మంజూరు మొత్తం డిజిటల్ ద్వారానే జరుగుతుంది. భవిష్యత్తులో మరిన్ని రుణాలను డిజిటల్ పరిధిలోకి తీసుకురాబోతున్నాం.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మీ ప్రణాళికలు ఎలా ఉన్నాయి
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో 81 శాఖలు ఉన్నాయి. రూ.11,700 కోట్ల వ్యాపారం జరుగుతోంది. ఈ రెండు రాష్ట్రాల్లోనూ కొత్తగా 20 శాఖలను ప్రారంభించబోతున్నాం. హైదరాబాద్‌లో గృహరుణాల మార్కెట్‌లో విస్తరించేందుకు 14కు పైగా స్థిరాస్తి సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం.
ఇదీ చూడండి: