సామాజిక మాధ్యమ దిగ్గజం ట్విట్టర్ ప్రపంచవ్యాప్తంగా తన వేదిక (ప్లాట్‌ఫాం)లో రాజకీయ ప్రకటనలను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. సామాజిక మాధ్యమాల్లో రాజకీయ నాయకులు తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారంటూ జరుగుతున్న ఆందోళనలపై ట్విట్టర్ ఈ విధంగా స్పందించింది.
"వాణిజ్య ప్రకటనలు చాలా శక్తిమంతం, చాలా ప్రభావవంతమైనవి. తప్పుడు ప్రచారాలు రాజకీయాలకు తీవ్రనష్టం కలుగజేస్తాయి. ఈ తప్పుడు ప్రకటనలు ఓటర్లను ప్రభావితం చేయడం వల్ల లక్షలాది మంది జీవితాలపై ఆ ప్రభావం పడుతుంది."
- జాక్ డోర్సే, ట్విట్టర్ సీఈఓ ట్వీట్
రాజకీయ ప్రకటనలపై నిజనిర్ధరణ చేయాలని ఫేస్‌బుక్‌పై ఒత్తిళ్లు పెరుగుతున్న నేపథ్యంలోనే ట్విట్టర్ తాజా నిర్ణయం తీసుకుంది.
నవంబర్ 22 నుంచి నిషేధం..
ట్విట్టర్ ప్రవేశపెట్టిన ఈ కొత్త విధానాన్ని నవంబర్ 22 నుంచి అమలుచేస్తామని డోర్సే ప్రకటించారు. రాజకీయ సమస్యలతో పాటు, అభ్యర్థుల నుంచి వచ్చిన ప్రకటనలనూ పూర్తిగా నిషేధిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇందుకోసం 'మెషిన్ లెర్నింగ్ బేస్డ్ ఆప్టిమైజేషన్'లోనూ మార్పు చేస్తామని డోర్సే వెల్లడించారు.
మార్క్ వర్సెస్ జాక్...
"ఫేస్‌బుక్‌కు రాజకీయ ప్రకటనలు ప్రధాన ఆదాయవనరు కాదు. అయితే ప్రతి ఒక్కరికీ తమ అభిప్రాయాలు పంచుకునే అవకాశం ఉండాలి. రాజకీయ ప్రకటనలను నిషేధించడం వల్ల అది అధికారంలో ఉన్నవారికే అనుకూలంగా మారుతుంది."
- మార్క్ జుకర్‌బర్గ్, ఫేస్బుక్ సీఈఓ
మార్క్‌జుకర్‌బర్గ్ అభిప్రాయాలతో జాక్ డోర్సే విభేదిస్తున్నారు.
"రాజకీయ ప్రకటనలు లేకుండానే అనేక సామాజిక ఉద్యమాలు భారీ స్థాయిలో జరగడం మనం చూశాం. భవిష్యత్‌లోనూ ఇది మరింత పెరుగుతుందని నేను నమ్ముతున్నా."
- జాక్ డోర్సే, ట్విట్టర్ సీఈఓ ట్వీట్
తనిఖీలు చేసి నిజనిర్ధరణ చేయకుండానే రాజకీయ ప్రసంగాలను, ప్రకటనలను అనుమతిస్తున్న ఫేస్‌బుక్‌కు భిన్నంగా ట్విట్టర్ ఓ ముందడుగు వేసింది.
ఇదీ చూడండి: వీడియో: బాగ్దాదీని ఎలా మట్టుబెట్టారో తెలుసా..?