అమెరికాలో దిగ్గజ సంస్థలకు, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య వివాదం ముదురుతోంది. అన్ని ప్రభుత్వ కాంట్రాక్టుల నుంచి మైక్రోసాఫ్ట్‌ను తప్పించాలనే ఓ ట్వీట్‌ను ట్రంప్ రీట్వీట్ చేశారు. అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ మాజీ డైరెక్టర్ రిచర్డ్ గ్రెనెల్ ఈ వివాదానికి ఆజ్యం పోశారు.
ట్వీట్లతో దుమారం..
జార్జ్ ఫ్లాయిడ్ మరణం తర్వాత.. పోలీసులకు ముఖ కవళికల గుర్తింపు సాంకేతికతను విక్రయించొద్దని నిర్ణయించినట్లు మైక్రోసాఫ్ట్ ఇటీవల ప్రకటించింది. ఈ నేపథ్యంలో 'మైక్రోసాఫ్ట్ తీసుకున్న ఈ నిర్ణయానికి సమాధానంగా అన్ని ప్రభుత్వ కాంట్రాక్టుల ఆ సంస్థను తప్పించాలి.' అని ట్వీట్ చేశారు గ్రెనెల్. ఈ ట్వీట్‌కు ట్రంప్‌ను ట్యాగ్ చేశారు. ఆ ట్వీట్‌నే రీ ట్వీట్ చేశారు ట్రంప్.
వివాదానికి మొదలు..
ఇలాంటి వివాదాస్పద సాంకేతికతను నియంత్రించేందుకు దేశంలో చట్టాలను తెచ్చే వరకు ముఖ కవళికల గుర్తింపు సాంకేతికతను పోలీసులకు విక్రయించమని మైక్రోసాఫ్ట్ అధ్యక్షుడు బ్రాడ్ స్మిత్ ఇటీవల బహిరంగంగా ప్రకటించారు.
ఇలాంటి సాంకేతికతను దుర్వినియోగం చేసి నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మృతికి కారణమైనందుకుగాను పోలీసులకు ముఖ కవళికల గుర్తింపు, విశ్లేషణ సేవలందించే కాంట్రాక్టును ఏడాది పాటు రద్దు చేసుకుంటున్నట్లు అమెజాన్ కూడా అంతకుముందు ప్రకటించింది. మరో టెక్ దిగ్గజం ఐబీఎం కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకుంది.
ట్విస్ట్..
అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ గత ఏడాది ఓ క్లౌడ్ కంప్యూటింగ్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. ఇందుకోసం 10 బిలియన్ డాలర్ల కాంట్రాక్టును మైక్రోసాఫ్ట్‌కు ఇచ్చింది. తొలుత ఈ ప్రాజెక్ట్ అమెజాన్ దక్కించుకుంటుందని అందరూ భావించారు. డొనాల్డ్ ట్రంప్, జెఫ్ బెజోస్ మధ్య ఉన్న వివాదం కారణంగానే తమకు ఆ కాంట్రాక్టును ఇవ్వలేదని అప్పట్లో అమెజాన్ ఆరోపించింది.
ఈ డీల్‌తో గత ఏడాది ఒక్కసారిగా బిల్‌గేట్స్ సంపద భారీగా పెరిగి.. ప్రపంచ కుబేరుల్లో తొలిస్థానాన్ని దక్కించుకున్నారు. అమెజాన్ అధినేత బెజోస్ రెండో స్థానానికి పడిపోయారు.
ఇదీ చూడండి:పోలీసులతో ఒప్పందాలను రద్దు చేసుకోవాలని మైక్రోసాఫ్ట్ ఉద్యోగుల లేఖ