ప్రముఖ వ్యాపారవేత్త వారెన్ బఫెట్.. విమానయాన సంస్థల్లో పెట్టుబడులు వెనక్కి తీసుకుని తప్పుచేశారన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అమెరికా మార్కెట్లలో అమెరికన్ ఎయిర్లైన్స్, డెల్టా, సౌత్‌వెస్ట్, యునైటెడ్ ఎయిర్లైన్స్ సంస్థల షేర్లు శుక్రవారం వరుసగా 18 శాతం, 9 శాతం, 5 శాతం, 13 శాతం వృద్ధి చెందిన నేపథ్యంలో ఈ వాఖ్యలు చేశారు ట్రంప్. బఫెట్పై తనకెంతో గౌరవముందని తెలిపిన ట్రంప్.. కొన్ని సార్లు అలాంటివారు కూడా తప్పులు చేస్తుంటారని పేర్కొన్నారు.
బఫెట్ షేర్ల విక్రయం ఇలా..
కరోనా సంక్షోభం నేపథ్యంలో.. అమెరికన్, డెల్టా, సౌత్‌వెస్ట్, యునైటెడ్ ఎయిర్లైన్స్లలో తనకు ఉన్న షేర్లన్నింటినీ ఏప్రిల్లో విక్రయించారు బఫెట్. వీటి విలువ సుమారు 400 కోట్ల డాలర్లు (రూ.30,000 కోట్లు)గా అంచనా. ఈ విషయంపై గతంలో వివరణ కూడా ఇచ్చారు. విమానయాన సంస్థల వ్యాపారాన్ని తాను సరిగా అర్థం చేసుకోలేకపోయినట్లు ఆయన తెలిపారు. వ్యాపార కార్యకలాపాలు కొనసాగించడానికి భవిష్యత్తులో ఈ సంస్థలు భారీగా అప్పులు చేయాల్సి ఉంటుందని ఆయన విశ్లేషించారు.
ఇదీ చూడండి:నిరసనలకు మద్దతుగా రెడిట్ సహవ్యవస్థాపకుడి రాజీనామా