ఏపీలోని కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలం కొప్పర్తి పారిశ్రామికవాడలో ట్రయో విజన్-కాంపోజిట్ టెక్నాలజీ కంపెనీ 2016లో ఏర్పాటైంది. ఏపీఐఐసీ నుంచి కొనుగోలు చేసిన ఎకరా స్థలంలో కడపకు చెందిన పారిశ్రామిక వేత్త నందన్‌రెడ్డి దీనిని ఏర్పాటు చేశారు.
మెట్రో రైలు విడిభాగాల తయారీ..
సంస్థ ప్రధానంగా మెట్రో రైలు విడి భాగాలను తయారు చేస్తోంది. వీటితోపాటు ఫైబర్, స్టీల్ విడిభాగాలు, గాలి మరల రెక్కలు, జారుడు బల్లలు వంటివి ఇక్కడ తయారవుతున్నాయి. ఇక్కడ తయారైన మెట్రో రైల్ విడి భాగాలను చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీకి సరఫరా చేస్తున్నారు. అక్కడ వాటిని అసెంబుల్ చేసి కెనడాకు పంపుతున్నారు. ప్రస్తుతం కెనడాలోని ‘మోంట్రియల్’ మెట్రో రైల్, సిడ్నీ మెట్రో రైల్ ఇంజిన్‌కు సంబంధించిన కొన్ని విడిభాగాలను ఇక్కడ తయారు చేస్తున్నారు. బెంగళూరు మెట్రో రైల్‌కు కావాల్సిన విడి భాగాలు, ట్రాఫిక్ బూత్‌లకు సంబంధించిన కొన్ని పరికరాలను రూపొందిస్తున్నారు. గతంలో వందేమాతరం ఎక్స్‌ప్రెస్ ఇంజిన్ ఆకృతిని, ఎలక్ట్రికల్ వెహికల్, ఆటో తయారు చేసి ఇచ్చారు. వెండ్ మిల్‌ను రూపొందించి నైజీరియాకు ఎగుమతి చేశారు.
రోబోటిక్ మిల్లింగ్ మిషన్ ఏర్పాటుతో..
మొదట కంప్యూటర్ డిజైన్, సీఎన్సీ ద్వారా ఆకృతులను చేసి విడి భాగాలు తయారు చేసినా నాణ్యత అంతగా లేకపోవడంతో.. రూ.2.5 కోట్లను వెచ్చించి జర్మనీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన రోబోటిక్ మిల్లింగ్ మిషన్ తీసుకొచ్చారు. అవసరమైన ట్రాక్‌ను స్విట్జర్లాండు నుంచి దిగుమతి చేసుకున్నారు. ఇది 15 మీటర్ల పొడవు, 5 మీటర్ల వెడల్పుతో ఉన్న థర్మోకోల్, చెక్క, స్టీలు, ఇనుము తదితరాలకు సంబంధించిన చక్కటి ఆకృతులను రూపొందిస్తుంది. సీఎన్సీ మిషన్లు 4 కోణాల్లోనే డిజైన్లు తయారు చేస్తే.. ఈ రోబోటిక్ మిల్లింగ్ మిషన్ 8 కోణాల్లో 360 డిగ్రీల్లో తిరుగుతూ డిజైన్లు రూపొందిస్తోందని అంటున్నారు. సూక్ష్మమైన ఆకృతుల నుంచి పెద్ద పెద్ద డిజైన్లను సైతం దీనితో తయారు చేయొచ్చని చెబుతున్నారు.
ఇది దేశంలోనే ప్రథమం
రోబోటిక్ మిల్లింగ్ మిషన్ ఉపయోగించి కాంపోజిట్ టెక్నాలజీతో విడిభాగాలు తయారు చేయడం దేశంలోనే ప్రథమం. మెట్రో రైలు విడిభాగాలతోపాటు, గాలిమరల రెక్కలను ఇక్కడే తయారు చేసిఎగుమతి చేస్తున్నాం. అంతకు ముందు పలు దేశాల్లోని వివిధ కంపెనీల్లో పని చేశా. ఇప్పుడు నా పరిశ్రమలో 170 మంది కార్మికులు పని చేస్తున్నారు.
- నందన్‌రెడ్డి, ఎండీ, ట్రయో విజన్ కాంపోజిట్ టెక్నాలజీ, కడప
ఇదీ చదవండి: మిడతల దాడులను 'ప్రకృతి విపత్తు'గా ప్రకటించాలి: కాంగ్రెస్