ఈ అధునాత ప్రపంచంలో కంప్యూటర్/మొబైల్‌తోనే ఎన్నో బ్యాంకింగ్ వ్యవహారాలను చక్కబెట్టుకోవచ్చు. ఆన్‌లైన్ బ్యాంకింగ్ ద్వారా బిల్లు చెల్లింపులు, షాపింగ్, సినిమా, బస్ టికెట్ల కొనుగోళ్లు చేయవచ్చు. ఈ సమయంలో ఖాతా వివరాలు నమోదు చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇదే అదునుగా సైబర్ నేరగాళ్లు విరుచుకుపడుతున్నారు. ఆన్‌లైన్ లావాదేవీ జరిపేటప్పుడు ఒళ్లంతా కళ్లు చేసుకొని ఉండాల్సిందే. లేకపోతే చిక్కుల్లో పడిపోవడం ఖాయం.
లాగ్ ఆవుట్ చేయడం మర్చిపోకండి..
ఇంటర్నెట్ కెఫెల్లో ఆన్‌లైన్ బ్యాంకింగ్ చేయకుండా ఉండేందుకు వీలైనంత మేర ప్రయత్నించాలి. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో చేయాల్సి వస్తే.. పని పూర్తయిన వెంటనే పాస్‌వర్డ్‌ను మార్చుకోవడం మంచిది. లావాదేవీ పూర్తయిన తర్వాత బ్రౌజింగ్ హిస్టరీ, క్యాచీ మొత్తం డిలీట్ చేయాలి. లాగిన్ అయ్యేటప్పడు Remember Password అని అడుగుతూ ఉంటుంది. Never అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఆన్‌లైన్‌లో పని పూర్తి చేసుకొని లాగిన్‌లోనే ఉంచి బ్రౌజర్‌ను నేరుగా మూసివేయద్దు. లాగ్ అవుట్ చేయండి.
వెబ్సైట్లో ఇవి ఉంటే సురక్షితం..
బ్యాంకు సంబంధిత వెబ్ చిరునామా అక్షరాలను కచ్చితంగా చూసుకోవాలి. తప్పుడు వెబ్‌సైట్లతో మీ బ్యాంకు ఖాతా వివరాలు బట్టబయలవుతాయి. ఆన్‌లైన్ బ్యాంకింగు చేసేటప్పుడు ఇతర వెబ్‌సైట్లు తెరిచి సర్ఫింగ్ చేయడం లాంటివి మానుకోండి. మెయిల్స్ పంపడం వంటివి ఆ సమయంలో చేయకండి.
వెబ్ సైటు అడ్రస్ ముందు https: అని ఉంటే భద్రతతో ఉందని భావించాలి.
మెయిల్‌తో జాగ్రత్త...
ఫోన్ ద్వారా మోసపుచ్చి వ్యక్తిగత, ఆర్థిక సమాచారాలను దొంగలించడాన్నే ఫిషింగ్ అంటారు. బ్యాంకు మెయిల్ ఐడీని పోలినట్టుగానే కొన్ని మెయిల్ ఐడీలు వస్తాయి. అందులో కొన్ని లింక్స్ ఉంటాయి. ఆ లింకులపై క్లిక్ చేసి వైబ్సైటు తెరిస్తే మీ బ్యాంకు ఖాతా,ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్ ఐడీ, పాస్ వర్డ్ వివరాలను నమోదు చేయాలని అడుగుతుంది. ఇవి చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి.
లాటరీ అంటూ..కేటుగాళ్ల మాయ
'మీరు లాటరీలో పెద్ద మొత్తం గెల్చుకున్నారు' అని అపరిచిత వ్యక్తుల నుంచి మెయిల్స్ వస్తాయి. అందులో మీ పేరు బ్యాంకు ఖాతా, ఐఎఫ్ఎస్సీ కోడ్ వంటి వివరాలను అడుగుతారు. అలాంటి వాటికి స్పందించకండి. భారీ మొత్తంలో లాటరీ తగిలిందని, అయితే ఆ సొమ్ముపై ఛార్జీల రూపేణ కొంత డిపాజిట్ చేస్తేనే లాటరీ సొమ్ము రిలీజ్ చేయగలమని చెప్తారు. కొంత మొత్తాన్ని బదిలీ చేయాల్సిందిగా కోరతారు. మనం దాన్ని నిజంగానే నమ్మి డబ్బులు జమచేశామో... ఇక మోసపోయినట్టే. ఇలాంటి ఉదంతాలు రోజూ పత్రికల్లో మనం చూస్తూనే ఉంటాం. లాటరీ మెయిళ్లకు సమాధానం ఇవ్వకపోవడమే మంచిది.
మీ వివరాలు ఎవరికీ చెప్పొద్దు...
వివిధ మార్గాల ద్వారా ఖాతా సంఖ్యను, ఆన్‌లైన్ లావాదేవీ సమాచారాన్ని మోసగాళ్లు సేకరిస్తారు. ఒక్కోసారి బ్యాంకు ఉద్యోగిలాగానో, ఆర్బీఐ ప్రతినిధి అనో చెప్పి పరిచయం చేసుకుని.. భద్రతా ప్రక్రియలో భాగంగా ఫోన్ చేసినట్లు నమ్మిస్తారు. నెట్ బ్యాంకింగ్ యూజర్ ఐడీ, పాస్ వర్డ్ (పిన్) వంటివి అడుగుతారు. పొరపాటున వాటిని వెల్లడిస్తే మీ ఖాతా భద్రతను ఇరకాటంలో పెట్టినట్టే.
ఇంటర్నెట్ వినియోగంలో జాగ్రత్తలు..
ఆన్‌లైన్ బ్యాంకింగ్ సురక్షింతంగా జరిపేందుకు యాంటి వైరస్‌లను ఇన్‌స్టాల్ చేసుకోండి. సేఫ్ బ్రౌజింగ్ ఆప్షన్ ఎంచుకోండి. దీని వల్ల మీరు టైప్ చేసిన వివరాలు, కీలాగర్స్ లాంటివి తస్కరించకుండా జాగ్రత్త పడవచ్చు. బ్రౌజింగు చేసే ముందు ఫైర్ వాల్స్ ను తప్పకుండా ఎనేబుల్ చేయాలి. ఏదైనా వెబ్‌సైట్‌ను బ్రౌజ్ చేసేటప్పుడు మభ్యపెట్టే వాణిజ్య ప్రకటనలను క్లిక్ చేయకుండా జాగ్రత్తపడండి.
ఇదీ చూడండి:- పండుగ సీజన్లో 'ఆటో' గేర్ మారేనా...?