Home Loan topup: అత్యవసరంలో దీర్ఘకాలిక వ్యవధికి అప్పు కావాలా? మీకు ఇప్పటికే గృహరుణం ఉందా.. మీకు ఇబ్బంది లేనట్లే. ఈ అప్పుపైనే టాపప్ తీసుకునే వీలుంది. కొత్తగా మరో ఆస్తిని తాకట్టు పెట్టాల్సిన అవసరం లేకుండానే సులువుగా రుణం తీసుకునే మార్గం ఇది.
గృహరుణానికి చెల్లించే వడ్డీకి, అసలుకు ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 24, సెక్షన్ 80సీ పరిమితుల మేరకు మినహాయింపు లభిస్తుంది. టాపప్ రుణం తీసుకొని, దాన్ని ఇంటి నిర్మాణం లేదా కొనుగోలుకు వాడినప్పుడు మాత్రమే పన్ను మినహాయింపు లభిస్తుంది. కాబట్టి, టాపప్ రుణం తీసుకున్నప్పుడు ఆ మొత్తాన్ని ఇంటి కొనుగోలు లేదా నిర్మాణానికి ఉపయోగించినట్లు రుజువు చేయాలి. దీనికి సంబంధించిన రశీదులు, ఇతర పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది.
వ్యవధి ఎక్కువ..
వ్యక్తిగత రుణం, బంగారంపై అప్పులాంటివి తీసుకున్నప్పుడు ఆయా రుణాలను బట్టి, వ్యవధి 1-15 ఏళ్లదాకా ఉంటుంది. టాపప్ రుణాల విషయంలో ఇది కాస్త భిన్నంగా ఉంటుంది. ఇంటి అప్పు వ్యవధికి ఇది అనుసంధానమవుతుంది. ఉదాహరణకు గృహరుణ వ్యవధి 20 ఏళ్లుంటే.. టాపప్ రుణానికీ అదే 20 ఏళ్ల వ్యవధి ఉంటుంది. దీనివల్ల దీర్ఘకాలంలో అప్పు తీర్చే వెసులుబాటు ఉంటుంది. బ్యాంకు నిబంధనలను బట్టి, ఇది ఆధారపడి ఉంటుంది.
ఓవర్‌డ్రాఫ్ట్...
మీకు అప్పుడప్పుడూ డబ్బు అవసరం అనుకుంటే.. ఒకేసారి రుణం తీసుకోవడం వల్ల ఫలితం ఉండదు. టాపప్‌లోనే ఉండే ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యాన్ని మీరు ఉపయోగించుకోండి. కొన్ని బ్యాంకులు గృహరుణం టాపప్‌పైనా ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యాన్ని అందిస్తున్నాయి. దీనికి వర్తించే వడ్డీ గృహరుణంకన్నా కాస్త అధికంగానూ, వ్యక్తిగత రుణం కన్నా తక్కువగానూ ఉంటుంది. అదే సమయంలో దీర్ఘకాలం వరకూ అవసరమైనప్పుడు మాత్రమే డబ్బును తీసుకునే ప్రయోజనం ఇది కల్పిస్తుంది. కాబట్టి, ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యంతో వచ్చే టాపప్ హోంలోన్ మేలు.
సులువుగా..
ఇప్పటికే రుణగ్రహీతకు సంబంధించిన అన్ని వివరాలూ బ్యాంకు దగ్గర ఉంటాయి. రుణ వాయిదాలను ఎలా చెల్లిస్తున్నారనేదీ తెలుస్తుంది. రుణగ్రహీత వాయిదాలన్నీ సరిగ్గా చెల్లించిన వివరాలు, ఆదాయం ధ్రువీకరణ, ఇతర కొన్ని పత్రాలు అందిస్తే చాలు. టాపప్ రుణం ఎంతివ్వాలన్నది ఆదాయం, గృహరుణం మొత్తం, తనఖా పెట్టిన ఆస్తి మార్కెట్ విలువ తదితరాలను బట్టి ఆధారపడి ఉంటుంది.
తక్కువ వడ్డీ రేటు..
సాధారణంగా ఈ టాపప్ రుణాలపై వడ్డీ రేట్లు గృహరుణం వడ్డీకి సమానంగానే ఉంటాయి. కాబట్టి, ఇప్పుడున్న పరిస్థితుల్లో తక్కువ వడ్డీకి లభిస్తున్న రుణాలుగా వీటిని చెప్పుకోవచ్చు.
ఇప్పుడు కొన్ని బ్యాంకులు, రుణ సంస్థలు టాపప్ రుణాలను ముందుగానే మంజూరు చేస్తున్నాయి. అధిక వడ్డీకి అప్పులు తీసుకునే బదులు.. డబ్బు అవసరం ఉన్నప్పుడు దీన్ని ఎంచుకోవడం మంచిది.
ఇదీ చూడండి: రష్యా- ఉక్రెయిన్ ఉద్రిక్తతలతో ఇవి ప్రియం!