రమేష్, లక్ష్మి బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు. కొత్తగా పెళ్లయింది. ఒక టూ-బెడ్‌రూమ్ ఫ్లాట్ తీసుకుని కాపురం పెట్టారు. కానీ ఫర్నిచర్ ఎలా. కొనాలంటే ఎంతో ఖర్చు. పైగా ఉద్యోగంలో ఎప్పుడు బదిలీ అవుతుందో, ఎక్కడికి మారాల్సి వస్తుందో తెలీదు. ఫర్నిచర్ కొంటే, దాన్ని తీసుకువెళ్లడం పెనుభారం కదా. పైగా కొంతకాలానికి మొహంమొత్తినా, అదే ఫర్నిచర్‌తో ఏళ్ల తరబడి నెట్టుకురావాల్సి వస్తుంది. అప్పుడు వారికొక స్నేహితుడు చెప్పాడు.. 'కావలసిన ఫర్నీచర్ అద్దెకు దొరుకుతుంది, వాడుకున్నంత కాలం అద్దె కడుతూ, తర్వాత వెనక్కి ఇస్తే సరిపోతుంది' అని. వారిద్దరికీ ఈ ఆలోచన నచ్చింది. అప్పటికప్పుడు తమకు అవసరం అనిపించిన ఫర్నీచర్ అద్దెకు తెచ్చుకున్నారు.
ఇప్పటి వరకు ఇళ్లు, కార్లు, ఏసీల వంటివి అద్దెకు తీసుకోవడం తెలుసు. ఆ కోవలో ఇప్పుడు ఫర్నీచర్ అద్దెకు ఇచ్చే సంస్థలు వెలుస్తున్నాయి. సోఫాలు, మంచాలు, డైనింగ్ టేబుళ్లు.. ఇలా, ఏదైనా అద్దెకు తీసుకునే సదుపాయం వీటి దగ్గర ఉంటోంది. దీనికి ఎంతో మంది మొగ్గుచూపుతున్నారు కూడా. టేబుళ్లు, సోఫా, మంచాలు కొని, కొన్నాళ్లకు మొహం మొత్తినా, మళ్లీ కొత్తవి కొనాలంటే అయ్యే ఖర్చు తలచుకుంటూ, ఇబ్బంది పడే బదులు నచ్చినంత కాలం వాడుకుని వెనక్కి ఇవ్వటం మేలనే ఆలోచన చేస్తున్నారు. తరచు బదిలీపై వెళ్లాల్సిన వారు, వీసా రాగానే విదేశాలకు వెళ్లాలనుకునే యువతరం.. అద్దె ఫర్నీచర్‌ను ఇష్టపడుతోంది. పైగా ఒకేసారి పెద్ద మొత్తాన్ని చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. దీంతో దేశీయంగా ఫర్నీచర్ అద్దెకు ఇచ్చే మార్కెట్ శరవేగంగా పెరుగుతోంది.
అతిపెద్ద మార్కెట్
- మనదేశంలో అద్దెకు ఫర్నీచర్- గృహోపకరణాల మార్కెట్ రూ.33,500 కోట్ల స్థాయిలో ఉన్నట్లు 'రెడ్‌సీర్' అనే మార్కెట్ పరిశోధనా సంస్థ ఒక నివేదికలో పేర్కొంది.
- సగటున 13 నెలల కాలానికి ఫర్నీచర్‌ను అద్దెకు తీసుకోవటం కనిపిస్తోంది.
- రెంటోమోజో, ఫర్లెంకో, రెంటికిల్, సిటీఫర్నిష్ సంస్థలు ఈ వ్యాపార విభాగంలో క్రియాశీలకంగా ఎదుగుతున్నాయి.
- కోటిన్నర ఇళ్లకు అద్దెపై ఫర్నీచర్ అందించేలా ఈ సంస్థలు ఉన్నాయి.
- మనదేశంలో ప్రస్తుతం 43% జనాభా నగరాలు/ పట్టణ ప్రాంతాల్లో ఉంటున్నారు. అందువల్ల నగరాల్లో అద్దె ఫర్నీచర్‌కు మార్కెట్ ఉంది. మొత్తం వ్యాపారంలో 55% దేశంలోని 20 నగరాల్లోనే కనిపిస్తోంది.
- 2025 వరకు ఏటా 11% చొప్పున వృద్ధి రేటు ఈ విభాగంలో నమోదు కావచ్చని అంచనా.
- ఇటీవల కాలంలో ప్రజల్లో, ముఖ్యంగా యువకుల్లో అద్దె ఫర్నీచర్‌పై అవగాహన పెరిగింది. అందువల్ల ఈ వ్యాపారం విస్తరించే అవకాశం ఏర్పడింది.
- ఎప్పటికప్పుడు సరికొత్త డిజైన్ల ఫర్నీచర్ తీసుకునే అవకాశం ఉండటం కూడా ఈ వ్యాపారానికి కలిసి వస్తోంది.
అంకుర సంస్థల హవా
అద్దె ఫర్నీచర్ మార్కెట్లో కొన్ని అంకుర సంస్థలు క్రియాశీలకంగా కనిపిస్తున్నాయి. ఈక్విటీ - రుణ నిధులు సమీకరించి తమ వ్యాపార కార్యకలాపాలను వేగంగా విస్తరిస్తున్నాయి. ఈ సంస్థలకు పెట్టుబడి సమకూర్చేందుకు సంస్థాగత ఇన్వెస్టర్లూ ముందుకు వస్తున్నారు. 'రెంటోమోజో' ఇటీవల రెండు పీఈ సంస్థల నుంచి రూ.10 కోట్ల పెట్టుబడి సమీకరించింది. ఫర్లెంకో అనే సంస్థ రుణ నిధులు సమకూర్చుకుంది. ఈ విభాగంలో హైదరాబాద్ కేంద్రంగా కొన్ని అంకుర సంస్థలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి.
ఇదీ చదవండి : సోనీ నుంచి అదిరిపోయే స్మార్ట్ టీవీ.. ఫీచర్లు ఇవే!