భారత్- చైనాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా ఉత్పత్తులను బహిష్కరించేందుకు దిల్లీలోని చిన్న (బడ్జెట్) హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకుల సంఘం నిర్ణయం తీసుకుంది. చైనావాసులకు గదులు అద్దెకు ఇవ్వబోమని కూడా స్పష్టం చేశాయి. ఈ మేరకు తమ నిర్ణయాన్ని తెలియజేస్తూ కెయిట్‌కు (అఖిల భారత వర్తక సంఘాల సమాఖ్య) దిల్లీ హోటల్స్ అండ్ రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్ ఓ లేఖ రాసింది. ఈ సంఘంలో దాదాపు 3000కి పైగా బడ్జెట్ హోటళ్లు, రెస్టారెంట్లు సభ్యత్వం కలిగి ఉన్నాయి. కెయిట్ తలపెట్టిన ‘బాయ్‌కాట్ చైనా’ ప్రచార కార్యక్రమానికి సంపూర్ణ మద్దతునిస్తామని హోటళ్ల సంఘం తెలిపింది.
చైనీయుల నుంచి బుకింగ్‌లు తీసుకోబోమని, సేవలనూ అందించమని దిల్లీ హోటల్స్ అండ్ రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మహేంద్ర గుప్తా వెల్లడించారు. అలాగే తమ హోటళ్లలో చైనా ఉత్పత్తులను ఉపయోగించకూడదని నిర్ణయించామని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల్లోని హోటళ్ల సంఘాలు కూడా ఇదే తరహా నిర్ణయాలు తీసుకోవాలని అడుగుతామని వెల్లడించారు.
మరో వైపు చైనా వస్తువులను బహిష్కరించడం పూర్తిగా సాధ్యం కాకపోవచ్చని భారత ఎగుమతిదార్ల సమాఖ్య (ఫియో) అభిప్రాయపడింది. దేశీయ పరిశ్రమల్లో చాలా వరకు చైనా ముడి సరుకులపై ఆధారపడి ఉండటమే ఇందుకు కారణమని తెలిపింది.
ఇదీ చూడండి:'బాయ్‌కాట్ చైనా' సరే.. మరి ఈ అంకురాలకు దిక్కెవరు?