ఏజీఎం... ఏడాదికోసారి జరిగే కంపెనీ వార్షిక సర్వసభ్య సమావేశం. ఇదంటే ఎంతోమంది వాటాదార్లకు పండుగ లాంటి సందర్భం. ఈ సమావేశానికి హాజరుకావటానికి చాలామందే ఆసక్తి చూపుతారు. కంపెనీ యాజమాన్యాన్ని, ఎండీ- సీఈఓ వంటి ఉన్నత స్ధాయి కంపెనీ ఆధికార్లను కలిసి భవిష్యత్తు వృద్ధిపై ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉండటం, తాము పెట్టే పెట్టుబడి భద్రమేనా లేదా అని ఒకసారి సమీక్షించుకునే సందర్భం కావటంతో వాటాదార్లు ఏజీఎంలకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చేవారు. ఇటీవలి కాలంలో లేదు కానీ, పది-పదిహేనేళ్ల క్రితం అయితే ఏజీఎంకు హాజరయ్యే వాటాదార్లకు స్వీటు బాక్సు లేదా గిఫ్టు తప్పనిసరిగా ఇచ్చేవారు. అదొక అదనపు ఆకర్షణగా ఉండేది. కానీ కాలం తెచ్చిన మార్పులతో స్వీటు బాక్సు, గిఫ్టు బాక్సు కనుమరుగయ్యాయి. ఇప్పుడు 'కరోనా' మహమ్మారి పుణ్యమా అని వార్షిక సమావేశాలు 'వీడియో కాన్ఫరెన్సింగ్' పద్ధతికి మారిపోయాయి. దీంతో ఎక్కడా ఏజీఎం సందడే కనిపించటం లేదు. యాజమాన్యాన్ని కలిసే అవకాశం కూడా పోయినట్లే. వాటాదార్లు తాము పెట్టుబడి పెట్టిన కంపెనీ పనితీరుకు సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే, ఏజీఎం- వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొని తీర్చుకోవలసిందే.
వీడియో కాన్ఫరెన్సింగ్
అగ్రశ్రేణి ఫార్మా కంపెనీ అయిన డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ ఏజీఎం, ఈ నెల 30న జరగనుంది. దీన్ని వీడియో కాన్ఫరెన్సింగ్ పద్ధతిలో నిర్వహించనున్నారు. మొన్నటికి మొన్న లారస్ ల్యాబ్స్ వార్షిక సర్వసభ్య సమావేశం కూడా ఈ పద్ధతిలోనే జరిగింది. ఇటీవలి కాలంలో పెద్దఎత్తున విదేశీ పెట్టుబడిని ఆకర్షించిన దిగ్గజ సంస్థ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏజీఎం ఈ నెల 15న జరగనుంది. ఇది వీడియో కాన్ఫెరెన్సింగ్‌లోనే జరుగుతుంది. ఈ నెలలోనే ఎన్నో కంపెనీల ఏజీఎంలు ఇదేవిధంగా జరగనున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, బాంబే డైయింగ్, కర్ణాటక బ్యాంకు, ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్, బజాజ్ ఫైనాన్స్ ... తదితర కంపెనీలే ఏజీఎం తేదీలు ప్రకటించాయి. కంపెనీల వార్షిక సర్వసభ్య సమావేశాలు ఏటా జులై నుంచి అక్టోబరు మధ్య కాలంలో జరుగుతుంటాయి. దీనికోసం కంపెనీలు ఎంతో ముందుగా సన్నాహాలు మొదలు పెడతాయి. ఈసారి సాధారణ పద్ధతిలో కాకుండా వీడియో కాన్ఫరెన్సింగ్ పద్ధతిలో ఏజీఎంలను నిర్వహించాల్సిన పరిస్థితికి కరోనా మహమ్మారి కారణమైంది. మనదేశంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో 'కరోనా' కేసులు బయటపడటం ప్రారంభమైంది. రెండు మూడు నెలల్లో తగ్గిపోతుందేమోనని అందరూ అనుకున్నారు. అప్పటికీ వివిధ కంపెనీలు బోర్డు డైరెక్టర్ల సమావేశాలను 'ఆన్‌లైన్' పద్ధతికి మార్చాయి. డైరెక్టర్లు తమ ఇళ్లు/కార్యాలయాల నుంచే బోర్డు సమావేశాల్లో పాల్గొనటం జరుగుతూ వచ్చింది. కానీ 'కరోనా' తగ్గుముఖం పట్టకపోగా రోజురోజుకూ విస్తరించి ప్రజలు ఒకరినొకరు కలుసుకోలేని పరిస్థితిని సృష్టించింది. సామాజిక దూరాన్ని పాటించాల్సి రావటానికి తోడు, ఎక్కువమంది గుమిగూడే అవకాశం ఉన్న సమావేశాలకు అధికారికంగా అనుమతి లేని పరిస్థితి ఏర్పడింది. పైగా ఈ వ్యాధికి ఇంతవరకూ సరైన చికిత్స అందుబాటులోకి రాలేదు. వ్యాధి సోకకుండా రక్షణ కవచం మాదిరిగా నిలిచే టీకా కూడా ఇంకా పరీక్షల స్ధాయిలోనే ఉంది. ఇక ప్రజా రవాణా సంగతి సరేసరి. బస్సులు, రైళ్లు అందుబాటులో లేవు. విమానయాన సంస్థలు మాత్రం అత్యవసర సర్వీసులు నిర్వహిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఏజీఎం నిర్వహణకు వీడియో కాన్ఫరెన్సింగ్ తప్ప మరో మార్గం లేకుండా పోయింది.
ముకేశ్‌ను చూసేందుకే..
రిలయన్స్ ఇండస్ట్రీస్ వాటాదార్లకు ఏజీఎం ఎంతో పెద్ద సందర్భం. ఎంతోకాలంగా ఈ కంపెనీ వాటాదార్లుగా ఉన్నవారు తప్పనిసరిగా ఈ సమావేశానికి హాజరవుతుంటారు. కేవలం ముకేశ్ అంబానీని, ఆయన కుటుంబ సభ్యులను చూడటానికి, కలవటానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏజీఎంకు వెళ్లేవారు ఉంటారంటే అతిశయోక్తి కాదు. దీనికి తోడు కంపెనీ విజయాలు, ఎదుర్కొన్న సవాళ్లను స్వయంగా తన ప్రసంగంలో ముకేశ్ అంబానీ వివరిస్తారు. దీని ప్రకారం భవిష్యత్తుపై ఒక అవగాహనకు వచ్చే అవకాశం కలుగుతుందని వాటాదార్లు పేర్కొంటారు. కానీ ఈసారి ఇటువంటి అవకాశం లేదు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగే ఏజీఎంలో పాల్గొని యాజమాన్యం చెప్పింది వినాల్సిందే కానీ, స్వయంగా కలిసే అవకాశం ఉండటం లేదు. ఈసారి కంపెనీల వార్షిక సమావేశాలకు వెళ్లి యాజమాన్యాన్ని కలిసే అవకాశం లేకపోవటం విచారం కలిగిస్తోందని ఏటా అయిదారు కంపెనీల ఏజీఎంలకు హాజరయ్యే స్థానిక మదుపరి ఒకరు విచారం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: ప్యాంగాంగ్ నుంచి వెనక్కు తగ్గిన చైనా బలగాలు!