ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో సగం కంటే ఎక్కువ భాగానికి ప్రకృతే ఆధారమని తాజా నివేదిక ఒకటి స్పష్టం చేసింది. లేని పక్షంలో ఆర్థిక రంగం బీటలు వారే ముప్పుందని హెచ్చరించింది. ప్రకృతి ముప్పు పెరుగుదల నివేదిక పేరుతో ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) ఆదివారం తాజా అధ్యయన నివేదికను విడుదల చేసింది. తాము పరిశీలించిన మొక్కలు, జంతువుల జాతుల్లో దాదాపు 25 శాతం మానవ కార్యకలాపాల కారణంగా అంతరించిపోయే ముప్పును ఎదుర్కొంటున్నాయని అందులో తెలిపింది. మొత్తం 163 పారిశ్రామిక రంగాలు, వాటి వనరులను తాజా అధ్యయనంలో భాగంగా డబ్ల్యూఈఎఫ్ విశ్లేషించింది.
నివేదికలోని మరిన్ని ముఖ్యాంశాలు...
ప్రపంచ వ్యాప్తంగా 44 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు ప్రకృతే ఆధారం. ఈ విలువ ప్రపంచ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో సగం కంటే కాస్త ఎక్కువే.
నిర్మాణం(4 ట్రిలియన్ డాలర్లు), వ్యవసాయం (2.5 ట్రిలియన్ డాలర్లు), ఆహారం- పానీయాల (1.4 ట్రిలియన్ డాలర్లు) రంగాలు ప్రకృతిపై అత్యధికంగా ఆధారపడుతున్నాయి. ఈ మూడింటి మొత్తం విలువ జర్మనీ ఆర్థిక వ్యవస్థతో పోలిస్తే రెట్టింపు ఉంటుంది.
అడవులు-మహాసముద్రాల నుంచి వనరులను నేరుగా సేకరించటంతో పాటు శుద్ధ జలం, పరాగ సంపర్కం, సారవంతమైన మృత్తిక, నిలకడైన వాతావరణం వంటివాటితో ప్రయోజనాలు పొందడాన్ని ప్రకృతిపై ఆధారపడటంగా పరిగణించారు.
నేటి నుంచి డబ్ల్యూఈఎఫ్ సదస్సు..
ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) 50వ వార్షిక సదస్సు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో సోమవారం ప్రారంభం కానుంది. ఈ సదస్సులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, జర్మనీ ఛాన్స్లర్ ఏంజెలా మెర్కెల్, పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్, భారత్ నుంచి సద్గురు జగ్గీ వాసుదేవ్, ప్రముఖ నటి దీపికా పదుకొణె తదితరులు పాల్గొంటారు.
ఇదీ చూడండి: యథావిధిగా శిరిడీ సాయిబాబా ఆలయ దర్శనం