ఒకప్పడు బీమా సంస్థలు బలవంతంగా ఆరోగ్య బీమా పాలసీలను అంటగట్టేవి. బీమా సలహాదార్లు వీటిని అమ్మేందుకు ఎంతో కష్టపడేవారు. కానీ, మారిన పరిస్థితుల్లో వైద్య ఖర్చులు పెరగడం, వ్యాధుల బారిన పడి, ఆసుపత్రిలో చేరిన వారి ఆర్థిక కష్టాలను చూసిన తర్వాత.. స్వచ్ఛందంగా ఈ పాలసీలను తీసుకునే వారి సంఖ్య పెరిగింది. ఇప్పుడు బీమా సంస్థలు అమ్మడం కాకుండా.. పాలసీదారులు కొనే జాబితాలోకి ఇవి చేరిపోయాయి. ముఖ్యంగా గత నాలుగైదేళ్ల కాలంలో ఆరోగ్య బీమా రంగం గణనీయమైన వృద్ధి సాధించింది. అదే సమయంలో వైద్య విధానంలోనూ ఎన్నో కొత్త మార్పులు వచ్చాయి. ఫలితంగా ఎప్పుడో రూపొందించిన ఆరోగ్య బీమా పాలసీల నిబంధనల్లో మార్పులు, చేర్పులు చేయాల్సిన అవసరం వచ్చింది. ముఖ్యంగా కరోనా వైరస్‌లాంటి కొత్త వ్యాధులు ప్రబలుతున్న పరిస్థితుల్లో బీమా సంస్థలు తమ పాలసీలకు కొత్త రూపును ఇవ్వాలని భావిస్తున్నాయి. సెప్టెంబరు 27, 2019న ఇచ్చిన మార్గదర్శకాల్లో మినహాయింపుల జాబితాను తగ్గించి, ఆధునిక చికిత్స పద్ధతులకూ పరిహారం చెల్లించేలా పాలసీలను రూపొందించాలని సూచించింది. దీనికోసం సెప్టెంబరు 30, 2020 వరకూ సమయం ఇచ్చింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని, ఆరోగ్య బీమా పాలసీలను అందించే అన్ని బీమా సంస్థలూ కొత్త పాలసీలను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. కోవిడ్-19 నేపథ్యంలో వీటిని ముందుగానే తీసుకొచ్చి, ప్రీమియాలను పెంచాలనే ఆలోచనతో ఉన్నాయి.
పాత పాలసీదారులకూ...
బీమా సంస్థలు ఇప్పటికే ఉన్న పాలసీల్లోనూ నిబంధనలు మారుస్తున్నాయి. అంటే, కొత్తగా పాలసీ తీసుకునే వారితోపాటు, ఇప్పటికే పాలసీ తీసుకున్న వారూ పెంచిన ప్రీమియం మొత్తాన్ని భరించాల్సిందే. ఇక పాత పాలసీలతోనే పునరుద్ధరణ చేసుకున్న వారికి కొత్త నిబంధనలు వర్తించాలంటే.. ఏడాది వరకూ ఆగాల్సిందే. ఉదాహరణకు మీరు ఒక బీమా సంస్థ నుంచి పాలసీ తీసుకున్నారు.. సెప్టెంబరులో దాన్ని పునరుద్ధరించుకున్నారు. సంస్థ ఆ పాలసీ నియమ నిబంధనలను మార్చి అక్టోబరులో కొత్త పాలసీని తెచ్చిందనుకుందాం.. అంటే మళ్లీ వచ్చే సెప్టెంబరులోనే మీకు కొత్త పాలసీ నిబంధనలు వర్తిస్తాయన్నమాట. బీమా సంస్థలు ఇప్పటికే ఈ విషయంలో పాలసీదారులకు సమాచారాన్ని పంపిస్తున్నాయి.
పారదర్శకత పెరిగేలా..
ఆరోగ్య బీమా విషయంలో చాలామందికి అనేక అనుమానాలుంటాయి. ఒక్కో పాలసీకి ఒక్కో నియమనిబంధనలు ఉండటం, ముందస్తు వ్యాధులు, వేచి ఉండే వ్యవధులు ఇలా పలు అనుమానాలు.. వీటన్నింటినీ పరిహరిస్తూ.. వీటిని బీమా పాలసీలను మరింత అర్థవంతంగా రూపొందించడం లక్ష్యంగా భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏ) జారీ చేసిన మార్గదర్శకాలతో కొత్త పాలసీలు రూపొందించే అవకాశం ఉంది. ఇందులో వర్తించని వ్యాధుల జాబితా తగ్గడం, కొత్త వైద్య విధానాలకు పాలసీ వర్తించడం, బీమా సంస్థలను మార్చినప్పుడు (పోర్టబులిటీ) వేచి ఉండే సమయంలో తేడా రాకపోవడంలాంటివి ఉండబోతున్నాయి. పాలసీ తీసుకున్న నాటికి పూర్తి ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి.. తర్వాత బీమా సంస్థ మినహాయించిన వ్యాధుల బారిన పడినా.. పరిహారం వర్తించేలా కొత్త పాలసీలు రాబోతున్నాయి.
ప్రీమియం భారం..
కొత్త నిబంధనలు, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఇప్పటికే ఉన్న పాలసీల్లో పూర్తి మార్పులు చేసేందుకు సాధారణ/ఆరోగ్య బీమా సంస్థలు సిద్ధం అవుతున్నాయి. దీనివల్ల ప్రీమియం కనీసం 5%-25% వరకూ పెరిగే అవకాశం ఉంది. ‘కొత్త వ్యాధులతోపాటు, ఇప్పటివరకూ శాశ్వత మినహాయింపుల జాబితాలో ఉన్న అనేక జబ్బులకు బీమా సంస్థలు ఇక నుంచి చికిత్స పరిధిలోకి తీసుకురావాల్సి వస్తుంది. పాలసీదారులకు ఈ మార్పులు ప్రయోజనం చేకూర్చేవే. అదే సమయంలో వారిపై కొంత భారం తప్పదు’ అని పాలసీబజార్.కామ్ హెల్త్ ఇన్సూరెన్స్ విభాగాధిపతి అమిత్ ఛాబ్రా పేర్కొంటున్నారు. నియంత్రణ సంస్థ మార్గదర్శకాలను పాటిస్తూనే.. మరింత భిన్నమైన పాలసీలను తీసుకొచ్చేందుకూ సంస్థలు ప్రయత్నిస్తున్నాయని ఆయన చెబుతున్నారు. ఇప్పటికే బీమా సంస్థలు కొత్త పాలసీలు, ప్రీమియం పెంచే విషయానికి సంబంధించి నియంత్రణ సంస్థకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది.
తగ్గనున్న జాబితా..
ఐఆర్‌డీఏ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం చూస్తే.. మినహాయింపుల జాబితా తగ్గిందనే చెప్పాలి. ముందస్తు వ్యాధుల గురించి పాలసీదారుడు చెప్పినప్పుడు.. వాటికి శాశ్వత మినహాయింపు ఇవ్వాలా? లేదా ముందస్తు వ్యాధుల నిబంధన వర్తింపజేయాలా అనేది పాలసీ ఇచ్చేటప్పుడే నిర్ణయించాలి. ఒకసారి పాలసీ ఇచ్చాక.. ఆ నిబంధనలను పాటించాల్సిందే. ఒకసారి పాలసీ ఇచ్చాక వచ్చిన ఏ జబ్బుకైనా పరిహారం ఇవ్వాల్సిందే. ‘ముఖ్యంగా అల్జీమర్స్, ఎయిడ్స్/హెచ్‌ఐవీలాంటి వాటికి వేచి ఉండే సమయం ముగిసిన తర్వాత కచ్చితంగా పరిహారం అందించాల్సిందే. వీటిని మినహాయించాలని అనుకుంటే బీమా సంస్థ కచ్చితంగా ఆ విషయాన్ని పాలసీ నిబంధనల్లో పేర్కొని, నియంత్రణ సంస్థకు సమర్పించాల్సి ఉంటుంది’ అని అమిత్ ఛాబ్రా పేర్కొన్నారు. ఇలాంటప్పుడు ఆ సంస్థ పాలసీ తీసుకోవాలా వద్దా అని నిర్ణయించుకునే వీలు పాలసీదారుడికి ఉంటుందని తెలిపారు.