ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. మరికొద్ది రోజుల్లో నగరాలు, ప్రధాన కార్యాలయాల్లో పని చేస్తున్న 1,100 ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. తమ వ్యాపార కార్యకలాపాలపై కరోనా తీవ్ర ప్రభావం చూపడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
స్విగ్గీ వ్యవస్థాపకుడు, సీఈఓ శ్రీహర్ష మాజేటి ఈ విషయాన్ని ఉద్యోగులందరికీ ఇ-మెయిల్ ద్వారా తెలిపారు. ఇందులో ఉద్యోగ తొలగింపునకు గల కారణాలను తెలియజేశారు. పరిస్థితులు మళ్లీ మెరుగుపడే సమయానికి.. అవకాశాలను ఉపయోగించుకునేలా సిద్ధంగా ఉండాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. అందుకు తగిన సామర్థ్యాలను మరో మార్గం ద్వారా పెంపొందించుకొని మరింత బలంగా నిలబడాలని భావిస్తున్నట్లు వివరించారు.
"ఈ సంక్షోభం మా వ్యాపారంపై ప్రతికూల ప్రభావం చూపినప్పటికీ, దేశంలో ఇ-కామర్స్, హోం డెలివరీ దిశగా అడుగులేస్తున్నాం. కిరాణా సరకులు, తదితర సేవలను అందించేందుకు మార్గం చూపించినట్లైంది. దీనిని మంచి అవకాశంగా మేము భావిస్తున్నాం."
-శ్రీ హర్ష మాజేటి, స్వీగ్గీ సీఈఓ
వాటితో ఊరట...
ప్రభావిత ఉద్యోగులందరికీ ఆర్థికపరంగా సాయం అందించేందుకు స్విగ్గీ సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు శ్రీహర్ష. వారందరికీ నోటీసు వ్యవధి, పదవీకాలంతో సంబంధం లేకుండా మూడు నెలల జీతాలు ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు సీఈఓ. ఉద్యోగాలు కోల్పోతున్న వారికి, అర్హులైన తమ కుటుంబ సభ్యులకు ఈ ఏడాది డిసెంబరు 31 వరకు వైద్య బీమా, ప్రమాద బీమాలను కల్పించనున్నట్లు వెల్లడించారు.