సుజుకీ సంస్థ మార్కెట్లోకి తన తొలి బీఎస్-6 వాహనం 'సుజుకీ యాక్సెస్ 125' స్కూటర్‌ను ప్రవేశపెట్టింది. దీని ధర 64,800 నుంచి 69,500(ఎక్స్ షోరూం దిల్లీ) మధ్య ఉన్నట్లు తెలిపింది. ఈ నూతన బీఎస్-6 వాహనం స్టాండర్డ్, స్పెషల్ వేరియంట్లలో(అల్లాయ్ డ్రమ్ బ్రేక్, అల్లాయ్ స్టీల్ డ్రమ్ బ్రేక్, స్టీల్ డ్రమ్ బ్రేక్) లభించనున్నట్లు పేర్కొంది.
"సుజుకీ మోటర్ సైకిల్ ప్రైవేట్ లిమిటెడ్ అభివృద్ధిలో సుజుకీ యాక్సెస్ 125 ప్రధాన భాగస్వామి. ఈ వాహనానికి వినియోగదారుల నుంచి అద్భుత స్పందన వచ్చింది. సుజుకీ యాక్సెస్ 125 బీఎస్-6 వాహనాల ద్వారా కూడా వినియోగదారుల అంచనాలను అందుకుంటాం."
-కొయిచిరొ హిరావో, సుజుకీ ఎండీ
బీఎస్-6 రెగ్యులేటరీ ప్రమాణాల ప్రకారం సుజుకీ సంస్థ నూతన ఫ్యామిలీ స్కూటర్‌ను పరిచయం చేసినట్లు హిరావో తెలిపారు. దీంతో తమ ఉత్పత్తులన్నింటినీ నూతన ప్రమాణాల ప్రకారం తయారుచేయనున్నట్లు ప్రకటించారు.
ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి బీఎస్-6 వాహన ప్రమాణాలు అమలులోకి రానున్నాయి.