స్టాక్ మార్కెట్లలో బుల్ దూకుడు కొనసాగుతోంది. సోమవారం సెషన్లో మార్కెట్లు కొత్త గరిష్ఠాల వద్ద ముగిశాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ 308 పాయింట్లు బలపడి జీవనకాల గరిష్ఠమైన 48,177 వద్దకు చేరింది. ఎన్ఎస్ఈ- నిఫ్టీ 114 పాయింట్లు పెరిగి సరికొత్త రికార్డు స్థాయి అయిన 14,133 వద్ద స్థిరపడింది.
దేశీయంగా కరోనా టీకా అత్యవసర వినియోగానికి కేంద్రం అనుమతులు లభించడం.. మదుపరుల్లో సానుకూలతలు పెంచింది. అంతర్జాతీయంగా వీస్తున్న సానుకూల పవనాలు మరింత ఊతమందించాయి.
2020-21 క్యూ3 ఫలితాలపై సానుకూల అంచనాల నేపథ్యంలో ఐటీ షేర్లు భారీగా పుంజుకోవడం లాభాలకు ప్రధాన కారణంగా చెబుతున్నారు విశ్లేషకులు. దిగ్గజ బ్యాంకింగ్ షేర్లు కాస్త ఒడుదొడుకులు ఎదుర్కోవడం గమనార్హం.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 48,220 పాయింట్ల అత్యధిక స్థాయి (జీవనకాల గరిష్ఠం), 47,594 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 14,147 పాయింట్ల గరిష్ఠ స్థాయి (జీవనకాల గరిష్ఠం), 13,953 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
ఓఎన్జీసీ, టీసీఎస్, హెచ్‌సీఎల్‌టెక్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, ఎం&ఎం షేర్లు లాభాలను గడించాయి.
కోటక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్ ఫినాన్స్, ఏషియన్ పెయింట్స్ టైటాన్, పవర్‌గ్రిడ్ నష్టపోయాయి.
ఇతర మార్కెట్లు
ఆసియాలో ఇతర ప్రధాన స్టాక్ మార్కెట్లు అయిన షాంఘై, సియోల్, హాంకాంగ్ సూచీలు సోమవారం లాభపడ్డాయి. టోక్యో సూచీ మాత్రం నష్టాన్ని మూటగట్టుకుంది.