అంతర్జాతీయంగా సానుకూల పరిణామాలు, భారత్లో త్వరలోనే కరోనా టీకా అందుబాటులోకి వస్తుందనే నమ్మకంతో స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు జీవితకాల గరిష్ఠాలను తాకాయి. బొంబాయి స్టాక్ ఎక్సేంజీ సూచీ- సెన్సెక్స్ 259 పాయింట్ల లాభంతో 47,613 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్సేంజీ సూచీ-నిఫ్టీ 59 పాయింట్లు మెరుగుపడి 13,932 వద్ద స్థిరపడింది.
ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు అత్యధికంగా 5 శాతానికి పైగా వృద్ధి సాధించాయి. యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, టెక్ మహీంద్ర షేర్లు లాభాల్లో ముగిశాయి.
నెస్లీ, టాటా మోటార్స్, కోల్ ఇండియా, ఎన్టీపీసీ, హిండాల్కో షేర్లు నష్టాలు చవిచూశాయి.
2.3 ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆమోదం తెలపడం, భారత్లో ఈ వారమే టీకా పంపిణీ మొదలుకానుందనే వార్తలు మదుపర్ల సెంటిమెంటుకు బలం చేకూర్చాయి.