కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ చికిత్సకు రూ.లక్షల్లో ఖర్చవుతోంది. 'పాజిటివ్'గా తేలితే.. మిగతా విషయాల సంగతి ఎలా ఉన్నా.. డబ్బును సమకూర్చుకోవడం పెద్ద సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో కొవిడ్-19 చికిత్స కోసం ప్రత్యేకంగా పాలసీలను తీసుకురావాల్సిన అవసరం ఉందని భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ) భావించింది. దీనికి అనుగుణంగా రెండు సార్వత్రిక బీమా పాలసీలను రూపొందించి, నిబంధనలను విడుదల చేసింది. సాధారణ, ఆరోగ్య బీమా సంస్థలు కరోనా కవచ్, కరోనా రక్షక్ పేర్లతో పాలసీలను జులై 10లోగా తీసుకురావాలని సూచించింది.
తదనుగుణంగానే హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్, మ్యాక్స్ బూపా, ఐసీఐసీఐ లాంబార్డ్ సహా 30 బీమా సంస్థలు పాలసీలతో ముందుకొచ్చాయి. అధిక శాతం సంస్థలు కరోనా కవచ్ పేరుతో పాలసీలను విడుదల చేశాయి. అయితే ఇప్పుడు పాలసీ తీసుకున్నా కానీ.. 15 రోజులు వేచి ఉన్న తర్వాతే.. ఇవి పరిహారం చెల్లిస్తాయి.
అర్హులెవరంటే?
కరోనా కవచ్, కరోనా రక్షక్ పాలసీలను తీసుకునేందుకు 18- 65 ఏళ్ల మధ్య వారు అర్హులు. వ్యక్తిగతంగానూ, కుటుంబం అంతటికీ వర్తించేలా ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీగానూ అందుబాటులో ఉంటుంది. ఫ్యామిలీ ఫ్లోటర్ ఎంచుకున్నప్పుడు పాలసీదారుడిపై ఆధారపడిన 3 నెలల నుంచి 25 ఏళ్ల వయసున్న పిల్లలనూ పాలసీలో చేర్పించవచ్చు. పాలసీ తీసుకునేందుకు ఎలాంటి ముందస్తు పరీక్షలు అవసరం లేదు.
వ్యవధి?
ఈ పాలసీలు.. మూడున్నర నెలలు (105 రోజులు), ఆరున్నర నెలలు (195 రోజులు), తొమ్మిదిన్నర నెలలు (285 రోజుల) వ్యవధికి అందుబాటులో ఉంటాయి. వ్యవధి తీరిన తర్వాత పునరుద్ధరణ ఉండదు.
1. కరోనా కవచ్:
ఇది ఇండెమ్నిటీ పాలసీ. అంటే.. కొవిడ్ బారిన పడి.. ఆసుపత్రిలో లేదా ఇంట్లో చికిత్స పొందినప్పుడు అయిన వాస్తవ ఖర్చులను చెల్లిస్తుంది.
- ఈ పాలసీ కనీస బీమా విలువ రూ.50,000. గరిష్ఠంగా రూ.5లక్షల వరకూ తీసుకోవచ్చు. ఆప్షనల్ కవర్‌ను అదనంగా తీసుకోవచ్చు. దీనికోసం ప్రత్యేకంగా ప్రీమియం చెల్లించాలి. దీన్ని ఎంచుకున్నవారు ఆసుపత్రిలో చేరినప్పుడు పాలసీ విలువలో 0.5శాతం చొప్పున 15 రోజులపాటు చెల్లిస్తారు.
- ఆసుపత్రిలో చేరి చికిత్స చేయించుకున్నప్పుడు.. ఎలాంటి మినహాయింపులు లేకుండా అన్ని రకాల ఫీజులు, ఖర్చులకూ పరిహారం లభిస్తుంది.
- ఇంట్లోనే ఉండి చికిత్స చేయించుకోవాలని వైద్యులు సూచిస్తే.. దానికి అయిన ఖర్చునూ బీమా సంస్థ చెల్లిస్తుంది. అయితే, దీనికి ప్రతి రోజూ వైద్యుల నివేదికలు, ఖర్చు వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. ఎంపిక చేసిన ఆసుపత్రుల నుంచి ఈ చికిత్స పొందితే నగదు రహిత చికిత్సకు వీలుంటుంది. లేకపోతే.. సొంతంగా బిల్లు చెల్లించి, బీమా సంస్థ నుంచి తిరిగి రాబట్టుకోవాలి. గరిష్ఠంగా 14 రోజులపాటు చికిత్సకు అనుమతిస్తారు.
- ఆయుష్ మంత్రిత్వ శాఖ నిర్దేశించిన వైద్య విధానాల్లో చికిత్స తీసుకున్నా పాలసీ ద్వారా పరిహారం పొందవచ్చు.
2. కరోనా రక్షక్:
- ఈ బీమా పాలసీని సాధారణ బీమా సంస్థలతోపాటు జీవిత బీమా సంస్థలూ అందించేందుకు ఐఆర్‌డీఏ అనుమతించింది. దీన్ని బెనిఫిట్ పాలసీగా పేర్కొంటారు. అంటే.. కొవిడ్-19 పాజిటివ్‌గా తేలితే.. పాలసీ మొత్తాన్ని కొన్ని నిబంధనలకు లోబడి చెల్లిస్తారు.
- కనీస బీమా రూ.50,000. గరిష్ఠం రూ.2,50,000 వరకు ఉంటుంది.
- కొవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ జరిగిన తర్వాత.. 72 గంటలకు మించి ఆసుపత్రిలో చేరి చికిత్స చేయించుకున్నప్పుడే ఈ పాలసీ విలువ మేరకు పరిహారం చెల్లిస్తుంది. అంటే.. రూ.2,50,000ల పాలసీ తీసుకున్న వ్యక్తి.. కరోనాతో ఆసుపత్రిలో చేరాడనుకుందాం.. 72 గంటలు గడిచిన తర్వాత.. చికిత్స మొత్తంతో సంబంధం లేకుండా.. పాలసీ రూ.2,50,000లను చెల్లిస్తుంది. ఆ వెంటనే పాలసీ రద్దవుతుంది.
బీమా సంస్థ ఏదైనా సరే.. ఈ రెండు పాలసీల నిబంధనలు ఒకేలా ఉంటాయి. సంస్థలు తమ ఇష్టానుసారం ప్రీమియాన్ని నిర్ణయించుకునే అవకాశం ఉంది. పాలసీదారుడి వయసును బట్టి ప్రీమియం మారుతుంది. కరోనా కవచ్ పాలసీ.. రూ.5లక్షలు.. తొమ్మిదిన్నర నెలల (285 రోజులు) వ్యవధికి కొన్ని బీమా సంస్థలు అందిస్తున్న ప్రీమియం (జీఎస్‌టీ అదనం) వివరాలను చూస్తే...
- స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ 0-45 ఏళ్ల లోపు వ్యక్తులకు రూ.5,172 ప్రీమియం వసూలు చేస్తోంది. 46-65 ఏళ్ల మధ్య వారికి రూ.7,241; 65 ఏళ్లపై బడిన వారికి రూ.10,861 ప్రీమియంగా నిర్ణయించింది.
- బజాజ్ అలయంజ్ జనరల్ ఇన్సూరెన్స్ 0-35 ఏళ్ల లోపు రూ.1,320; 36-45 ఏళ్ల మధ్య వారికి రూ.2,770; 46-55 ఏళ్ల వారికి రూ.4,760; 56 ఏళ్లు దాటిన వారికి రూ.5,630 వసూలు చేస్తోంది.
- నేషనల్ ఇన్సూరెన్స్ 0-20 ఏళ్ల మధ్య రూ.1,185; 21-35 వారికి రూ.2,385; 36-50 లోపు వారికి రూ.4,095; 51-65 వారికి రూ.6,510; 65 ఏళ్ల పైబడిన వారికి రూ.8,370 ప్రీమియంగా నిర్ణయించింది.
- ఓరియంటల్ ఇన్సూరెన్స్ 40 ఏళ్ల లోపు వారికి రూ.1,286; 41-60 ఏళ్ల వారికి రూ.1,714; 60 ఏళ్ల పైబడిన వారికి 2,572 ప్రీమియం విధిస్తోంది.
ఇదీ చదవండి: భవిష్యత్తుకు ప్రణాళిక: బీమాతో నడి వయసులో ధీమా