ఆదాయపు పన్ను చట్టం, 1961 ప్రకారం మనం పెట్టే కొన్ని రకాల పెట్టుబడులు, చేసే వ్యయాలు, వచ్చే ఆదాయంపై పన్ను మినహాయింపు లభిస్తుంది. వేతన జీవులు వీటిని ఆదాయపు పన్ను రిటర్నుల్లో చూపెట్టడం ద్వారా పన్ను ఆదా చేసుకోవచ్చు. ఇంతకీ ఏ సందర్భాల్లో పన్ను మినహాయింపు లభిస్తుందో చూద్దాం..!
సెక్షన్ 80సీ కిందకి వచ్చే మినహాయింపులు..
- ఫిక్స్‌డ్ డిపాజిట్లు: ఐదేళ్ల కాలపరిమితితో చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీలో రూ.1.5 లక్షల వరకు మినహాయింపు ఉంటుంది.
- పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(పీపీఎఫ్)పై వచ్చే వడ్డీకి పన్ను రాయితీ లభిస్తుంది.
- ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్(ఈఎల్‌ఎస్‌ఎస్)లో వచ్చే రాబడిపై లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఉంటుంది. అయితే, రూ.1 లక్ష వరకు మినహాయింపు పొందవచ్చు.
- నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ పథకం ద్వారా లభించే వడ్డీలో రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంటుంది.
- మనం చెల్లించే వివిధ రకాల ఇన్సూరెన్స్ ప్రీమియంలకు కూడా మినహాయింపు ఉంటుంది. అయితే, ఆ ప్రీమియంల మొత్తం రూ.1.5 లక్షలు మించకూడదు. అలాగే బీమా విలువ వార్షిక ప్రీమియానికి పదింతలు ఉండాలి.
- గృహ రుణ చెల్లింపులో ఏటా చెల్లించే అసలులో రూ.1.5 లక్షలకు పన్ను మినహాయింపు లభిస్తుంది.
- పిల్లల చదువు కోసం చెల్లించే వార్షిక ట్యూషన్ ఫీజులో రూ.1.5 లక్షల వరకు రాయితీ ఉంటుంది.
- సంఘటిత రంగంలో ఉండే ఉద్యోగుల వేతనాల నుంచి 12 శాతం ఈపీఎఫ్‌లో కలిసిపోతుంది.
- ఏటా రూ.1.5 లక్షల ఈపీఎఫ్‌కు పన్ను మినహాయింపు కోరే అవకాశం ఉంది.
- సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్(ఎస్‌సీఎస్‌ఎస్)లో పెట్టే పెట్టుబడిపై రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు కోరవచ్చు. ఈ స్కీమ్ 60 ఏళ్లు పైబడి వారి ఐదేళ్ల కాలపరమితితో అందుబాటులో ఉంది.
- సుకన్య సమృద్ధి యోజన: 10 ఏళ్ల లోపు బాలికల తల్లిదండ్రులు ఈ పథకంలో మదుపు చేసినట్లయితే.. వారికి పన్ను మినహాయింపు లభిస్తుంది.
నేషనల్ పెన్షన్ స్కీమ్..
నేషనల్ పెన్షన్ స్కీమ్‌లో పెట్టుబడిపై సెక్షన్ 80సీసీడీ(1బి) కింద రూ.50,000 వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది.
హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం..
ఆరోగ్య బీమా కోసం ఏటా చెల్లించే ప్రీమియంలలో రూ.25,000 వరకు పన్ను మినహాయింపు ఉంటుంది. ఇది సెక్షన్ 80డీ పరిధిలోకి వస్తుంది. సెక్షన్ 80సీ కింద ఇన్సూరెన్స్ ప్రీమియంలకు లభిస్తున్న మినహాయింపునకు ఇది అదనం.
హెచ్‌ఆర్‌ఏపై ఇలా..
మీ వేతనంలో హెచ్‌ఆర్‌ఏ కూడా కలిపి ఉంటే.. ఆ మొత్తానికి పన్ను మినహాయింపు కోరే అవకాశం ఉంది. అయితే, దీనికి కొంత గరిష్ఠ పరిమితి ఉంటుంది. ఒకవేళ హెచ్‌ఆర్‌ఏ రాకపోయినా.. అద్దె చెల్లిస్తున్నట్లయితే, ఏటా రూ.60 వేల వరకు పన్ను మినహాయింపు కోరేందుకు వెసులుబాటు ఉంది.
గృహ రుణంపై చెల్లించే వడ్డీ..
గృహ రుణంపై చెల్లించే అసలుపై సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు లభిస్తే.. ఐటీ చట్టం సెక్షన్ 24 ప్రకారం.. ఏటా చెల్లించే రూ.1.5 లక్షల గృహరుణ వడ్డీకి కూడా పన్ను రాయితీ కోరవచ్చు.
పొదుపు ఖాతాలో ఉండే సొమ్ము..
పొదుపు ఖాతాల్లో ఉంచే సొమ్ములో రూ.10,000 వరకు సెక్షన్ 80టీటీఏ కింద పన్ను మినహాయింపు ఉంటుంది. సీనియర్ సిటిజన్స్ అయితే ఈ పరిమితి రూ.50 వేల వరకు ఉంటుంది.
స్వచ్ఛంద సంస్థలకు ఇచ్చే విరాళాలు..
వివిధ స్వచ్ఛంద సంస్థలకు ఇచ్చే విరాళాలతో పాటు ధార్మిక కార్యక్రమాలకు చేసే ఖర్చులో 50 శాతం వరకు పన్ను మినహాయింపు కోరవచ్చు. అయితే, దీనికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఏయే విరాళాలు, ధార్మిక కార్యక్రమాలకు పన్ను మినహాయింపు ఉంటుందో తెలుసుకోవాలి. స్వచ్ఛంద సంస్థలైతే 80జీ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
ఇదీ చూడండి: ఈ స్కీమ్‌లో చేరితే నెలకు రూ.3 వేలు పెన్షన్!