Small scale Investors in Stock Market: భారత స్టాక్ మార్కెట్లపై చిన్న మదుపర్లు విశ్వాసాన్ని ప్రదర్శిస్తున్నారు. కరోనా కేసులు పెరిగినా.. అంతర్జాతీయ కేంద్ర బ్యాంకులు కఠిన పరపతి విధానాలకు మారుతున్నా, ఈక్విటీల్లో పెట్టుబడులకు చిన్న మదుపర్లు వెనక్కి తగ్గడం లేదు. 2021 చివరి త్రైమాసికం (అక్టోబరు-డిసెంబరు)లో ఎన్‌ఎస్‌ఈ నమోదిత కంపెనీల్లో రిటైల్ మదుపర్ల వాటా ఆల్‌టైం గరిష్ఠమైన 7.32 శాతానికి చేరిందని ప్రైమ్ డేటాబేస్ గ్రూప్ వెల్లడిస్తోంది. సెప్టెంబరు చివరకు ఇది 7.13 శాతంగా ఉండగా.. 2020 డిసెంబరు త్రైమాసికంలో ఇది 6.9 శాతం మాత్రమే.
విలువ పరంగా కూడా ఎన్‌ఎస్‌ఈ కంపెనీల్లో రిటైల్ మదుపర్ల వాటా విలువ 2021 డిసెంబరు త్రైమాసికం చివరకు రూ.18.98 లక్షల కోట్లకు చేరింది. ఇది కూడా రికార్డు గరిష్ఠ స్థాయే. సెప్టెంబరు ఆఖరుకు ఈ విలువ రూ.18.16 లక్షల కోట్లు కాగా, అప్పటితో పోలిస్తే ఇది 4.54 శాతం అధికం.
ఎందుకు పెరిగాయంటే..
మార్కెట్లో దిద్దుబాట్లను ట్రేడింగ్‌కు అవకాశంగా చిన్న మదుపర్లు భావిస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు. 2021 చివరి నెలల్లో మార్కెట్లో బలహీనతలు కనిపించగానే, చిన్న మదుపర్లు డబ్బులతో మార్కెట్లోకి ప్రవేశించారని చెబుతున్నారు. కొవిడ్ పరిణామాల తరవాత షేర్లు అధిక ప్రతిఫలాలను ఇస్తుండడంతో, ధర తగ్గినపుడల్లా కొనుగోళ్లు చేయడానికి చిన్న మదుపర్లు అలవాటు పడ్డారని విశ్లేషిస్తున్నారు. డిసెంబరు త్రైమాసికంలో సెన్సెక్స్, నిఫ్టీలు 1.5 శాతం మేర తగ్గాయి. అయితే డిసెంబరు త్రైమాసికంలో 1.023 కోట్ల కొత్త డీమ్యాట్ ఖాతాలు ఆరంభం కావడం, రిటైల్ మదుపర్ల జోరును సూచిస్తోంది. సగటున నెలకు 34 లక్షల డీమ్యాట్‌లను మదుపర్లు ప్రారంభించారు. సెప్టెంబరు త్రైమాసికం మొత్తంమీద 82 లక్షల డీమ్యాట్ ఖాతాలు ఆరంభమయ్యాయి. 2021 ఏడాదిలో కొత్తగా 3.08 కోట్ల మంది ఖాతాలు తెరవడంతో, దేశీయంగా మొత్తం డీమ్యాట్ ఖాతాల సంఖ్య రికార్డు స్థాయి అయిన 8.06 కోట్లకు చేరుకుంది.
871 కంపెనీల్లో వాటా పెంచుకున్నారు
మొత్తం మీద చూస్తే ఎన్‌ఎస్‌ఈలోని 871 కంపెనీల్లో రిటైల్ మదుపర్లు తమ వాటా పెంచుకున్నారు. ఈ కంపెనీల షేర్ల ధరలు సగటున 15.51 శాతం పెరిగాయి. 759 కంపెనీల్లో రిటైల్ మదుపర్ల వాటా తగ్గినా, ఆ కంపెనీల సగటు షేరు ధర 20.35 శాతం పెరిగింది. సాధారణంగా సంస్థాగత మదుపర్లు దూరంగా ఉండే మధ్య, చిన్నస్థాయి కంపెనీల షేర్లలో రిటైల్ మదుపర్లు పెట్టుబడులు పెడుతున్నారు. నిఫ్టీ కంపెనీల్లో రిటైల్ మదుపర్ల వాటా 7.08 శాతం; అగ్రగామి ఎన్‌ఎస్‌ఈ 100 కంపెనీల్లో 6.68 శాతం వాటా ఉండడం గమనార్హం.
ఎఫ్‌ఐఐల వాటా తగ్గింది
రూ.2 లక్షల కంటే ఎక్కువ వాటా పెట్టే లేదా అధిక నికర విలువ గల వ్యక్తుల(హెచ్‌ఎన్‌ఐ) వాటా కూడా డిసెంబరు త్రైమాసికంలో రికార్డు స్థాయిలో 2.26 శాతానికి చేరింది. 2020 ఇదే సమయంలో ఎన్‌ఎస్‌ఈలోని నమోదిత కంపెనీల్లో వీరి వాటా 2 శాతంగానే ఉంది. దీంతో రిటైల్, హెచ్‌ఎన్‌ఐల మొత్తం వాటా 9.58 శాతానికి చేరినట్లయింది. మరో వైపు, 2021 అక్టోబరు-డిసెంబరులో విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్లు(ఎఫ్‌పీఐ) మాత్రం రూ.38,521 కోట్ల మేర నికర అమ్మకాలు జరపడంతో వీరి వాటా తొమ్మిదేళ్ల కనిష్ఠ స్థాయి అయిన 20.74 శాతానికి చేరింది.
ఇదీ చూడండి: ఎల్‌ఐసీ పాలసీదారులకు గుడ్‌న్యూస్.. ఐపీవోలో 5 శాతం డిస్కౌంట్?