Silver ETF Fund: కొత్త సాంకేతికతలు 5జీ, విద్యుత్ వాహనాలు, గ్రీన్ ఎనర్జీ తదితరాల్లో వెండి వినియోగం పెరుగుతోంది. ఈ లోహం మంచి విద్యుత్‌వాహకం కావడమే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో సిల్వర్‌కు గిరాకీ అధికం అవుతుందనే అంచనాలున్నాయి. దీని ప్రతిఫలాల్ని మదుపరులకు అందించే లక్ష్యంతో.. ఇందులోనూ చిన్న మదుపరులకు అవకాశం కల్పించాలని మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ నిర్ణయించింది.
ఈ మేరకు గత ఏడాది సెప్టెంబరులో సిల్వర్ ఈటీఎఫ్‌లకు అనుమతినిచ్చింది. ఆ తర్వాత నవంబరులో విధివిధానాలనూ ప్రకటించింది. దీనికి అనుగుణంగా కొత్త ఏడాదిలో పలు ఫండ్ సంస్థలు సిల్వర్ ఈటీఎఫ్‌లను విడుదల చేసేందుకు ముందుకొస్తున్నాయి. తొలి ఫండ్ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచవల్ ఫండ్ నుంచి.. ఐసీఐసీఐ సిల్వర్ ఈటీఎఫ్ పేరుతో అందుబాటులోకి వచ్చింది. ఇందులో కనీసం రూ.100తోనూ పెట్టుబడి పెట్టొచ్చు. ఈ నెల 19 వరకూ ఎన్‌ఎఫ్‌ఓ అందుబాటులో ఉంటుంది.
95 శాతం వరకూ..
సిల్వర్ ఈటీఎఫ్‌లు తాము సమీకరించిన మొత్తంలో 95 శాతం వరకూ వెండి, వెండికి సంబంధించిన పథకాల్లో మదుపు చేస్తాయి. 99.9 శాతం నాణ్యతతో కూడిన 30 కిలోల వెండి కడ్డీలను కొనుగోలు చేస్తాయి. ఈ వెండి లండన్ బులియన్ మార్కెట్ అసోసియేషన్ నాణ్యతా ప్రమాణాల మేరకు ఉండాలి. పారదర్శకత కోసం దీన్ని సెబీ తప్పనిసరి చేసింది. కస్టోడియన్‌ల దగ్గర ఉన్న ఈ వెండి నిల్వలను ఫండ్ సంస్థలు సిల్వర్ ఈటీఎఫ్‌ల విలువ మేరకు ఉందా లేదా అనేది ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తుండాలి. ప్రతి ఆరు నెలలకోసారి మ్యూచువల్ ఫండ్‌కు చెందిన ఆడిటర్ తన నివేదికను ఫండ్ ట్రస్టీలకు సమర్పించాల్సి ఉంటుంది.
చిన్న మొత్తంతోనూ..
వెండిలో పెట్టుబడులు పెట్టేందుకు మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్) ద్వారా మాత్రమే ఇప్పటివరకూ వీలుంది. అయితే, ఈ ఫ్యూచర్స్ పెట్టుబడి విధానం అందరికీ సాధ్యమయ్యే పనికాదు. ఎంతో నైపుణ్యం ఉండాలి. కానీ, సిల్వర్ ఈటీఎఫ్‌లతో రూ.100తోనూ మదుపు చేసేందుకు వీలుంది. వెండిని నేరుగా కొనాల్సిన అవసరాన్ని ఇవి తప్పిస్తాయి. ఎలక్ట్రానిక్ రూపంలో వెండిని కొనుగోలు చేసి, భద్రపర్చుకోవచ్చు. ఈ యూనిట్లను తక్కువ ఖర్చుతో నిర్వహించుకునే వీలుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు (మార్కెట్ పనివేళల్లో) క్షణాల్లో విక్రయించుకునే వీలూ ఉంటుంది. సాధారణంగా ప్రాంతాలను బట్టి, వెండి ధర మారుతుంది. ఈటీఎఫ్‌లతో ఈ ఇబ్బంది లేకుండా ధర విషయంలో పూర్తి పారదర్శకత ఉంటుంది.
డీమ్యాట్ ఉండాలి..
సాధారణ మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేసేందుకు డీమ్యాట్ ఖాతా అవసరం ఉండదు. కానీ, ఈటీఎఫ్‌లలో లావాదేవీలకు డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతా అవసరం అవుతుంది. ఇప్పుడు ఈటీఎఫ్‌లు వచ్చాయి. కానీ, త్వరలోనే ఫండ్ సంస్థలు సిల్వర్ ఈటీఎఫ్‌లలో మదుపు చేసే సిల్వర్ ఫండ్ ఆఫ్ ఫండ్లనూ విడుదల చేయబోతున్నాయి. అప్పుడు డీమ్యాట్‌తో పనిలేకుండానే మదుపు చేసుకోవచ్చు.
మనం ఏం చేయాలి?
2020లో దాదాపు రూ.79,816 కోట్ల విలువైన వెండిని పారిశ్రామిక అవసరాల కోసం వినియోగించారు. ఆభరణాల కోసం రూ.34,985 కోట్లు, పెట్టుబడులకు రూ.38,711 కోట్ల విలువైన వెండి కొనుగోళ్లు జరిగాయనేది అంచనా.
ఈ నేపథ్యంలో పెట్టుబడుల్లో వైవిధ్యం కోసం సిల్వర్ ఈటీఎఫ్‌లను ఎంచుకోవచ్చు. అయితే, వెండిలో హెచ్చుతగ్గులు అధికంగా ఉండే అవకాశం ఉంది. దీర్ఘకాలంలో ఎలాంటి లాభాలు ఇస్తుందనేదానిపై సరైన విశ్లేషణలు అందుబాటులో లేవు. ఒకవేళ ఇందులో మదుపు చేయాలని భావిస్తే.. సరైన ధరలో కొనడం, లాభం వచ్చినప్పుడు అమ్ముకోవడం వంటి వ్యూహాన్ని పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. అదే సమయమంలో మొత్తం పెట్టుబడిలో 5 శాతానికి మించి దీనికి కేటాయించకూడదనీ సలహా ఇస్తున్నారు.
ఇదీ చూడండి: 'షావోమి' భారీ మోసం.. రూ.653 కోట్ల కస్టమ్స్ సుంకం ఎగవేత