స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాలతో ముగిశాయి. బొంబయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 519 పాయింట్లు పుంజుకుని 35,430 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 160 పాయింట్ల వృద్ధితో 10,471 వద్దకు చేరింది.
అంతర్జాతీయ మార్కెట్ల సానుకూలతలు లాభాలకు బాసటగా నిలిచాయి. భారత్-చైనా సరహద్దుల్లో నెలకొన్న వివాదానికి తెరదించేందుకు చర్చలు జరగ్గా.. బలగాల ఉపసంహణకు ఇరు దేశాల మధ్య పరస్పర అంగీకారం కుదిరింది. ఈ నేపథ్యంలో మదుపరుల సెంటిమెంట్ బలపడిందని విశ్లేషకులు చెబుతున్నారు.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 35,482 పాయింట్ల అత్యధిక స్థాయి, 34,844 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 10,477 పాయింట్ల గరిష్ఠ స్థాయి; 10,302 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
ఎల్&టీ 6.68 శాతం, బజాజ్ ఫినాన్స్ 6.54 శాతం, ఇండస్ఇండ్ బ్యాంక్ 5.29 శాతం, ఎన్టీపీసీ 5.83 శాతం, పవర్ గ్రిడ్ 5.06 శాతం లాభపడ్డాయి.
రిలయన్స్ అత్యధికంగా 1.55 శాతం నష్టపోయింది. భారతీ ఎయిర్టెల్ 0.36 శాతం, మారుతీ 0.20 శాతం నష్టాన్ని మూటగట్టుకున్నాయి. 30 షేర్ల ఇండెక్స్‌లో ఈ మూడు కంపెనీలు మాత్రమే నష్టాలను నమోదు చేశాయి.
రూపాయి..
కరెన్సీ మార్కెట్లో రూపాయి గురువారం 37 పైసలు పుంజుకుంది. డాలర్‌తో పోలిస్తే మారకం విలువ 75.66 వద్ద స్థిరపడింది.