స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ముగిశాయి. వారాంతపు సెషన్లో బీఎస్ఈ-సెన్సెక్స్ 327 పాయింట్లు పుంజుకుని.. 40,509 వద్దకు చేరింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ 80 పాయింట్ల లాభంతో 11,914 వద్ద సెషన్‌ను ముగించింది.
స్టాక్ మార్కెట్లు లాభాలను గడించడం వరుసగా ఇది ఏడో రోజూ కావడం విశేషం.
ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతూ ఆర్బీఐ ఎంపీసీ సమీక్షలో నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ త్రైమాసికానికి ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తుందని ఇందులో అంచనా వేసింది. ఈ నేపథ్యంలో బ్యాంకింగ్ షేర్లు లాభపడ్డాయి. ప్రస్తుత ఆర్థిక సంతవ్సరం చివరి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు పాజిటివ్ జోన్లోకి వచ్చే అవకాశముందని రిజర్వు బ్యాంక్ అంచనా వేయడం మదుపరుల సెంటిమెంట్‌ను బలపరిచిందని స్టాక్ బ్రోకర్లు చెబుతున్నారు.
ఇంట్రాడే సాగిందిలా
సెన్సెక్స్ 40,569 పాయింట్ల అత్యధిక స్థాయి, 40,066 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 11,936 పాయింట్ల గరిష్ఠ స్థాయి;11,805 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎల్&టీ ప్రధానంగా లాభాల్లో ఉన్నాయి.
సన్‌ఫార్మా, ఏషియన్ పెయింట్స్, నెస్లే, అల్ట్రాటెక్, హెచ్‌యూఎల్, బజాజ్ ఆటో షేర్లు నష్టపోయాయి.
ఆసియా మార్కెట్లు
ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లలో షాంఘై సూచీ శుక్రవారం లాభాలను నమోదు చేసింది. టోక్యో, హాంకాంగ్ సూచీలు నష్టాలతో ముగిశాయి.
రూపాయి, ముడి చమురు
కరెన్సీ మార్కెట్లో రూపాయి శుక్రవారం 15 పైసలు పుంజుకుంది. దీనితో డాలర్‌తో పోలిస్తే మారకం విలువ 73.09 వద్దకు చేరింది.
ముడి చమురు ధరల సూచీ-బ్రెంట్ 0.16 శాతం తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు ధర 42.27 డాలర్లుగా ఉంది.
ఇదీ చూడండి:డిసెంబర్ నుంచి 24 గంటలూ ఆర్టీజీఎస్ సేవలు