స్టాక్ మార్కెట్లు వరుస లాభాలతో దూసుకుపోతున్నాయి. బుధవారం సెషన్లో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 284 పాయింట్లు పుంజుకుని 34,109 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 82 పాయింట్ల వృద్ధితో 10,061 వద్దకు చేరింది.
బ్యాంకింగ్, చమురు, ఎఫ్ఎంసీజీ రంగాలు ప్రధానంగా లాభపడ్డాయి.
అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా స్పందిస్తుండటం, దేశీయంగా లాక్డౌన్ సడలింపులు మదుపరుల సెంటిమెంట్‌ను బలపరిచాయి. వీటికి తోడు పరిశ్రమ వర్గాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్న ప్రధాని నరేంద్ర మోదీ హామీ లాభాలకు ఉతమందించినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 34,449 పాయింట్ల అత్యధిక స్థాయి, 34,027 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 10,176 పాయింట్ల గరిష్ఠ స్థాయి.., 10,038 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
ఎం&ఎం, కోటక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్ ఫినాన్స్, నెస్లే, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌లు ప్రధానంగా లాభాపడ్డాయి.
ఎన్టీపీసీ, ఇండస్ఇండ్ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, మారుతీ, హీరో మోటోకార్ప్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి.
భవిష్యత్‌పై సానుకూల అంచనాలతో ఇండిగో ఎయిర్‌లైన్స్ భారీ లాభాలను గడించింది.
రూపాయి..
కరెన్సీ మార్కెట్లో రూపాయి 11 పైసల నష్టాన్ని నమోదు చేసింది. డాలర్‌తో పోలిస్తే మారకం విలువ రూ.75.47 వద్ద స్థిరపడింది.
ముడి చమురు..
ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. చమురు ఉత్పత్తి తగ్గింపు ఒప్పందం పొడిగింపే లక్ష్యంగా.. త్వరలో ఒపెక్ దేశాలు సమావేశం కానున్నాయన్న వార్తలు ఇందుకు కారణమయ్యాయి.
ముడి చమురు ధరల సూచీలు- బ్రెంట్ 1.42 శాతం (బ్యారెల్ ముడి చమురు ధర 40.13 డాలర్లకు) పెరిగింది. డబ్ల్యూటీఐ 2.39 శాతం వృద్ధి చెంది.. బ్యారెల్ ముడి చమురు ధర 37.69 డాలర్ల వద్దకు చేరింది.
ఇదీ చూడండి:ఎస్బీఐ, ఐసీఐసీఐ సేవింగ్స్‌పై వడ్డీ రేటు తగ్గింపు