స్టాక్ మార్కెట్లు నేడు నష్టాల్లో ముగిశాయి. ఆరంభంలో లాభాలతో ఊరించిన సూచీలు చివరకు నష్టాలతో ముగిశాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 310 పాయింట్ల నష్టంతో 30,380 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 69 పాయింట్లు క్షీణించి.. 8,925 వద్ద ముగిసింది.
లాక్డౌన్ నేపథ్యంలో పరిశ్రమలకు ఊతమిచ్చే విధంగా కేంద్రం ఆర్థిక ప్యాకేజీ ఇస్తుందన్న ఆశల నుడుమ ఆరంభంలో భారీ లాభాలు నమోదయ్యాయి. వీటికి తోడు అమెరికాలో లాక్డౌన్ ఈ నెలాఖరులో సడలించే అవకాశాలున్నాయన్న అంచనాలు ప్రారంభ లాభాలకు కారణమయ్యాయి.
నష్టాలకు కారణాలు..
కరోనా ప్రభావం రోజు రోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో మే 3 వరకు దేశవ్యాప్త లాక్డౌన్ పొడిగిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇంకొన్నాళ్లు ప్రధాన వాణిజ్య కార్యకలాపాలు నిలిపేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే 21 రోజుల తొలి విడత లాక్‌డౌన్‌తో దేశ ఆర్థిక వ్యవస్థకు రూ.7-8 లక్షల కోట్ల నష్టం వాటిల్లినట్లు పలు నివేదికలు అంచనా వేశాయి. మరో వైపు లాక్డౌన్ నేపథ్యంలో 2020లో భారత వృద్ధి రేటు 1.9 శాతానికి పరిమితం కావచ్చని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) నివేదిక విడుదల చేసింది. ఈ అంశాలన్నీ మదుపరుల సెంటిమెంట్‌పై ప్రతికూల ప్రభావం చూపాయి. ఫలితంగా ఇటీవలి లాభాలను సొమ్ముచేసుకునే పనిలో పడ్డారు.
చమురు ధరల పతనం..
ఉత్పత్తి తగ్గింపు నిర్ణయంతో ఇటీవల కాస్త పుంజుకున్న చమురు ధరలు మరోసారి భారీ స్థాయిలో(18 ఏళ్ల కనిష్ఠస్థాయికి) పతనమయ్యాయి. ప్రపంచం అతిపెద్ద ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోనుందన్న అంచనాల నేపథ్యంలో చమురు ధరలు పతనమైనట్లు నిపుణులు అభిప్రాయపడ్డారు. ఈ అంశం కూడా మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపింది.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 31,568 పాయింట్ల గరిష్ఠాన్ని తాకగా.. 30,222 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది.
నిఫ్టీ నేడు 9,261 పాయింట్ల అత్యధిక స్థాయి, 8,874 పాయింట్ల అత్యల్ప స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
హెచ్‌యూఎల్, హెచ్‌సీఎల్‌టెక్, ఐటీసీ, నెస్లే, అల్ట్రాటెక్ సిమెంట్, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు లాభాలను ఆర్జించాయి.
కోటక్ బ్యాంక్, హీరోమోటోకార్ప్, బజాజ్ ఫినాన్స్, మారుతీ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.
ఇదీ చూడండి:మార్చిలో దిగొచ్చిన టోకు ద్రవ్యోల్బణం