అంతర్జాతీయ ప్రతికూలతల నేపథ్యంలో ఇవాళ స్టాక్‌మార్కెట్లు నష్టాలపాలయ్యాయి. ముఖ్యంగా ఐటీ, ఫార్మా రంగాలు నష్టాలు చవిచూశాయి. లోహ రంగాల షేర్లు లాభపడ్డాయి. ప్రారంభంలో నష్టాలు చవిచూసిన వాహనరంగం చివరకు 10 శాతం మేర పుంజుకుంది.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 167 పాయింట్లు కోల్పోయి 38 వేల 822 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 58 పాయింట్లు నష్టపోయి 11 వేల 512 వద్ద స్థిరపడింది.
అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశముందన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటనతో నిన్న దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలను మూటగట్టుకున్నాయి. అయితే అమెరికా సభలో ఆయనపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టడం మదుపర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.
లాభల్లో
భారతీ ఎయిర్టెల్, బజాజ్ ఫైనాన్స్, కోటక్ బ్యాంకు, ఎన్టీపీసీ, కోటక్ మహీంద్రా, ఐటీసీ, బజాజ్ ఫెన్సివ్, రిలయన్స్ 1.61 శాతం మేర రాణించాయి.
నష్టాల్లో
వేదాంత, జీ ఎంటర్టైన్మెంట్, ఎస్ బ్యాంకు, ఇండస్ఇండ్ బ్యాంకు, టాటా స్టీల్, ఓఎన్జీసీ, టాటా మోటార్స్, సన్‌ఫార్మా, ఎమ్ అండ్ ఎమ్, టీసీఎస్, హీరో మోటోకార్ప్ 5.39 శాతం మేర నష్టపోయాయి.
ఆసియా మార్కెట్లు
హాంగ్‌సెంగ్, నిక్కీ, కోస్పీ నష్టాలపాలవ్వగా, షాంఘై కాంపోజిట్ సూచీ లాభాలతో ముగిసింది. ఐరోపా మార్కెట్లు మాత్రం లాభాల్లో కొనసాగుతున్నాయి.
రూపాయి విలువ
రూపాయి విలువ 20 పైసలు పెరిగి, ఒక డాలరుకు రూ.70.67 గా (ఇన్ట్రా డే) ఉంది.
ముడిచమురు
అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధర 0.33 శాతం పడిపోయింది. ప్రస్తుతం బ్యారల్ ధర 62.55 డాలర్లుగా ఉంది.
ఇదీ చూడండి: లైక్‌లు దాయడంపై ఆస్ట్రేలియాలో ఫేస్బుక్ ప్రయోగం