ఆర్థిక సేవల రంగం భవితవ్యంపై అనిశ్చితితో మదుపర్లు ఆచితూచి వ్యవహరించగా... బ్యాంకింగ్ రంగ షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. ఫలితంగా స్టాక్మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 155 పాయింట్ల నష్టంతో 38వేల 667 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 38 పాయింట్లు కోల్పోయి 11వేల 474వద్ద స్థిరపడింది.
ఎస్ బ్యాంక్ షేర్లు అత్యధికంగా 15 నష్టాలను చవిచూశాయి. ఇతర ప్రధాన బ్యాంకులు ఇండస్ఇండ్, ఎస్బీఐ, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ , యాక్సిస్ బ్యాంకు షేర్లు దాదాపు ఏడు శాతం వరకు క్షీణించాయి.
భారతీ ఎయిర్టెల్ షేర్లు 5 శాతానికి పైగా లాభపడ్డాయి. ఐటీ రంగానికి సంబంధించి టీసీఎస్, హెచ్సీఎల్ షేర్లు వృద్ధి సాధించాయి.
ఇవీ కారణాలు...
మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఇటీవలే ప్రభుత్వం చేపట్టిన ఉద్దీపన చర్యలు మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపలేకపోయాయి. ఆర్బీఐ ద్రవ్యపరపతి విధాన ప్రకటనకు ముందు మదుపర్లు అప్రమత్తమై, అమ్మకాలకు మొగ్గుచూపడం నష్టాలకు మరో కారణం.
ఇదీ చూడండి: స్థిరాస్తి: 7 ప్రధాన నగరాల్లో తగ్గిన ఇళ్ల అమ్మకాలు