మారటోరియం సమయంలో రుణాల చక్రవడ్డీ మాఫీ అంశాన్ని బుధవారం విచారించనుంది సుప్రీం కోర్టు. ఇప్పటికే కేంద్రం, రిజర్వు బ్యాంకు దాఖలు చేసిన అఫిడవిట్లను పరిశీలించనుంది.
కరోనా కట్టడికి విధించిన లాక్డౌన్లో వివిధ రుణాలపై ఆర్బీఐ మారటోరియం అమలు చేసింది. ఆ వ్యవధిలో రుణాలపై వడ్డీ వసూలు చేయటం, ఆ వడ్డీపై వడ్డీ విధించటం వల్ల లాభమేమీ ఉండదని పలువురు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
రుణాలపై మారటోరియం గడువును మరింతకాలం పొడిగించలేమని సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో ఆర్బీఐ పేర్కొంది. మారటోరియం కాలాన్ని పెంచితే అది వాయిదాల చెల్లింపులపై ప్రతికూల ప్రభావం పడుతుందని, ఆర్థిక క్రమశిక్షణ తప్పుతుందని ఆందోళన వ్యక్తంచేసింది.
కేంద్రం సైతం దాదాపు ఇదే తరహా వాదన వినిపించింది. అయితే రూ.2కోట్లు వరకు రుణాలపై చక్రవడ్డీ మాఫీకి నిర్ణయం తీసుకుంది. ఇదే విషయాన్ని అఫిడవిట్ ద్వారా సుప్రీంకోర్టుకు తెలియచేసింది.
మారటోరియానికి సంబంధించిన వ్యాజ్యాలపై మంగళవారమే విచారణ జరగాల్సి ఉంది. అయితే బుధవారం వాదనలు వింటామని జస్టిస్ అకోశ్ భూషణ్, జస్టిస్ ఆర్ఎస్ రెడ్డి, జస్టిస్ ఎంఆర్ షాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం స్పష్టంచేసింది.
ఇదీ చూడండి: 'చక్రవడ్డీ మాఫీకి ఓకే.. మారటోరియం పొడిగింపే కష్టం'