దేశంలోనే అతిపెద్ద బ్యాంకైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఏటీఎంలలో అనధికార లావాదేవీల నుంచి తన వినియోగదారులను రక్షించడానికి వన్ టైమ్ పాస్‌వర్డ్ (ఓటీపీ) ఆధారిత నగదు ఉపసంహరణ వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఓటీపీ- ఆధారిత నగదు ఉపసంహరణ వ్యవస్థ జనవరి 1, 2020 రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల మధ్య అన్ని ఎస్బీఐ ఏటీఎంలలో అందుబాటులోకి వచ్చింది.
"ఏటీఎంలలో అనధికార లావాదేవీల నుంచి మిమ్మల్ని రక్షించడానికి ఓటీపీ ఆధారిత నగదు ఉపసంహరణ వ్యవస్థను ప్రవేశపెడుతున్నాం. జనవరి 1, 2020 నుంచి ఈ కొత్త భద్రతా విధానం అన్ని ఎస్బీఐ ఏటీఎంలలో అందుబాటులో ఉంటుంది.ఎస్బీఐ ఓటీపీ- ఆధారిత నగదు ఉపసంహరణ సౌకర్యం రూ. 10,000 కంటే ఎక్కువ విలువగల లావాదేవీలకు మాత్రమే వర్తిస్తుంది.కాబట్టి, మీరు ఎస్‌బీఐ వినియోగదారుడు అయితే, మీ మొబైల్ నంబర్‌ను ఇంకా బ్యాంకులో నమోదు చేసుకోకపోతే ఇప్పుడే చేయండి. లేకపోతే, మీరు మీ ఖాతా నుంచి రూ. 10,000 కంటే ఎక్కువ ఉపసంహరించుకోలేరు. మొబైల్ నంబర్లను రిజిస్టర్ చేసుకోవాలని లేదా అప్‌డేట్ చేయాలని ఎస్‌బీఐ వినియోగదారులను కోరింది. ఎస్‌బీఐ ఎటిఎమ్ నగదు ఉపసంహరణలు 2020 జనవరి 1 నుంచి ఓటీపీ ఆధారిత ప్రామాణీకరణ ప్రక్రియతో మరింత సురక్షితం అయ్యాయి! ఈ సేవ నుంచి లబ్ది పొందటానికి మీ మొబైల్ నంబర్‌ను సమీప ఎస్‌బీఐ శాఖ లేదా ఏటీఎం వద్ద నమోదు చేయండి"
-ట్వీట్, ఎస్బీఐ.
ఎస్బీఐ ఓటీపీ ఆధారిత నగదు ఉపసంహరణ సౌకర్యం గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు…
- ఈ కొత్త భద్రతా విధానం ద్వారా నగదు ఉపసంహరించుకోవడానికి మీ బ్యాంకు ఖాతాకు లింక్ చేసుకున్న మొబైల్ నంబర్ తప్పనిసరి.
- ఖాతాదారుడు తాను ఉపసంహరించుకోవాలనుకున్న మొత్తాన్ని నమోదు చేసిన తర్వాత, ఏటీఎం స్క్రీన్ పై ఓటీపీ నమోదు చేయాల్సిన పాప్ అప్ కనిపిస్తుంది.
- అనంతరం ఖాతాదారుడు తన మొబైల్ నెంబర్ కి వచ్చిన ఓటీపీని ఏటీఎం స్క్రీన్ పై ఎంటర్ చేసి నగదును ఉపసంహరించుకోవచ్చు.
- అయితే, ఈ సౌకర్యం మరొక బ్యాంకు ఏటీఎంల ద్వారా చేసే లావాదేవీలకు వర్తించదు, ఎందుకంటే ఈ కార్యాచరణను నేషనల్ ఫైనాన్షియల్ స్విచ్ (ఎన్ఎఫ్ఎస్) లో డెవలప్ చేయలేదు.
ఇదీ చూడండి: ఐటీ శాఖ 2020 క్యాలెండర్: ఇక పన్ను కట్టడం మర్చిపోరు