సూపర్ మార్కెట్లు కిటకిట... స్టోర్లన్నీ ఖాళీ... ఎక్కడ చూసినా నో స్టాక్ బోర్డులు... కరోనా లాక్డౌన్ విధించడానికి ముందు దాదాపు అన్ని దేశాల్లో కనిపించిన దృశ్యాలివి. ఇప్పుడు సౌదీ అరేబియాలోని అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఇంకా మిగిలి ఉన్నది ఒక్కరోజే అనుకుంటూ ప్రజల దుకాణాల వైపు పరుగులు తీశారు. పెద్దఎత్తున కొనుగోళ్లు జరిపారు.
కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. వారంతా ఒక్కసారిగా ఈ స్థాయిలో కొనుగోళ్లు జరపడానికి కారణం కరోనా కాదు. కొన్నది నిత్యావసరాలు అసలే కాదు. సౌదీ అరేబియా వాసులంతా ఎగబడింది బంగారం, కార్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఇతర ఖరీదైన సామగ్రి కోసం.
ఎందుకిలా?
కరోనా సంక్షోభం, ముడి చమురు ధరల పతనంతో సౌదీ అరేబియా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. హజ్ యాత్ర ద్వారా వందల కోట్ల డాలర్లు రావాల్సి ఉన్నా... వైరస్ దెబ్బకు లెక్క మారింది. ఫలితంగా ఈ ఏడాది జీడీపీ 6.8శాతం క్షీణిస్తుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది. ఈ పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు కీలక సంస్కరణలకు ఉపక్రమించింది సౌదీ సర్కార్. వస్తువులు, సేవలపై విలువ ఆధారిత పన్నును ఏకంగా 3 రెట్లు(5శాతం నుంచి 15శాతానికి) పెంచింది. కొత్త పన్నులు బుధవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి.
పన్నులు పెరగకముందే కావాల్సిన వస్తువులు కొనుక్కోవాలని అనుకున్నారు సౌదీ వాసులు. ఫలితందా కొద్దిరోజుల ముందు నుంచే కార్ల షోరూంలు, బంగారం దుకాణాలు, ఎలక్ట్రానిక్ వస్తువుల స్టోర్లు కిటకిటలాడడం ప్రారంభించాయి. ఆఖరి రోజైన బుధవారం ఆ రద్దీ మరింత పెరిగింది.
ఇదీ చదవండి: చైనాకు మరో షాక్- ఆ 2 సంస్థలపై అమెరికా బ్యాన్