దేశంలో పెరుగుతున్న కరోనా కేసుల కారణంగా ఆయా రాష్ట్రాల్లో స్థానిక లాక్డౌన్లు విధించడం, ఆంక్షల అమలు చేస్తున్నారు. దీంతో వేసవి కాలంలో ఎక్కువ మొత్తంలో అమ్ముడుపోవాల్సిన ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, కూలర్ల వంటి శీతల సామగ్రి అమ్మకాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. సాధారణంగా ఏప్రిల్, మే నెలల్లో ఎయిర్ కండీషనర్లు(ఏసీ), రిఫ్రిజిరేటర్లు భారీగా అమ్ముడుపోయేవి. అయితే.. వీటిపైనా కరోనా ప్రభావం చూపింది. వైరస్ వ్యాప్తి భయంతో కొనుగోలు చేసేందుకు ప్రస్తుతం ఎవరు ముందుకు రావడం లేదు.
కొవిడ్‌కు ముందు(2019)తో పోల్చుకుంటే గత రెండేళ్లుగా అమ్మకాల సంఖ్య దారుణంగా పడిపోయినట్లు పరిశ్రమవర్గాలు తెలిపాయి. ఈ రంగంలో లీడింగ్ కంపెనీలుగా ఉన్న వోల్టాస్, డైకిన్, బ్లూ స్టార్, పానాసోనిక్, హైయర్లతో సహా మిగిలిన అన్నీ కంపెనీల అమ్మకాలు 2019 ఏప్రిల్‌తో పోల్చితే 75శాతం తగ్గినట్లు పేర్కొన్నాయి. ఇదిలా ఉంటే 2021 ప్రారంభం నుంచి మే వరకూ అమ్మకాలు ఊసే లేకుండా పోయింది.
వృథా ఖర్చుగా భావించి..
ప్రస్తుతం కరోనా రెండో దశ విలయతాండవం చేస్తోంది. దీనికి తోడు మూడో దశ ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంతో వినియోగదారుల మనోభావాలు దెబ్బతిన్నాయి. కొవిడ్ పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకూ అనవసర ఖర్చులు పెట్టకూడదని ప్రజలు భావిస్తున్నారు. దీంతో ఎసీలు, ఫ్రిజ్‌లు, కూలర్ల వంటి శీతలీకరణ యంత్రాల కొనుగోలుపై తీవ్ర ప్రభావం పడింది.
ఇదీ చూడండి: అమెజాన్ ప్రైమ్ నెలవారీ ప్లాన్, ఫ్రీ ట్రయల్ లేనట్లే!