విద్య, వాణిజ్యం, వ్యవసాయం, రవాణా, పరిశ్రమలు, ఇలా అన్ని రంగాలకు ఊతమిచ్చేలా కేంద్రం 2020-21 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. కోట్ల మంది భారతీయుల కొండంత ఆశల నడుమ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ రెండోసారి పార్లమెంట్లో పద్దు ప్రవేశపెట్టారు. ఆశావహ భారతం, సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్, ప్రజా సంక్షేమమ ప్రధాన లక్ష్యాలుగా రూపొందించిన ఈ బడ్జెట్లో.. ఆదాయపన్ను శ్లాబుల్లో భారీ మార్పులు తీసుకొచ్చింది. ఎల్ఐసీలో పెట్టుబడుల ఉపసంహరణకు నిర్ణయం తీసుకుంది. మొత్తం కేటాయింపులు ఓసారి చూస్తే..
వ్యవసాయానికి పెద్దపీట
బడ్జెట్‌లో వ్యవసాయం, సాగునీరు, గ్రామీణాభివృద్ధికి అగ్రతాంబూలమిచ్చిన కేంద్ర ప్రభుత్వం.. ఏకంగా 2లక్షల 83 వేల కోట్లు కేటాయించినట్లు ప్రకటించింది. రానున్న ఆర్థిక సంవత్సరానికి..... వ్యవసాయ రుణాల లక్ష్యం 15 లక్షల కోట్లుగా పేర్కొంది. రైతులకు 20 లక్షల సోలార్ పంపులు ఇవ్వడం సహా.. బీడు భూముల్లో సౌర విద్యుదుత్పత్తి వ్యవస్థలు ఏర్పాటుకు ప్రోత్సాహం అందిస్తామని ప్రకటించింది.
రవాణా, మౌలిక రంగాల వసతులకు భారీ నిధులు
రోడ్డు, రైల్వే, జల, వాయు మార్గాల్లో రవాణా రంగ అభివృద్ధికి తమ ప్రభుత్వ కట్టుబడి ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రవాణా రంగంలో మౌలిక వసతుల కల్పనకు లక్షా 70 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు. ఉడాన్ పథకం కింద 2025 కల్లా దేశంలో మరో వంద విమానాశ్రయాలను అభివృద్ధి చేస్తామని తెలిపారు. జాతీయ రహదారులను వేగవంతంగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు.
2500 కిలోమీటర్ల యాక్సెస్ కంట్రోల్ హైవేలు, 9 వేల కిలోమీటర్ల ఆర్థిక కారిడార్లు, 2 వేల కిలోమీటర్ల తీర ప్రాంత రహదారులు, 2 వేల కిలోమీటర్ల వ్యూహాత్మక రహదారులు అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. దిల్లీ-ముంబయి ఎక్స్‌ప్రెస్ వే 2023 కల్లా పూర్తి చేస్తామని, చెన్నై-బెంగళూరు ఎక్స్‌ప్రెస్ వేని ప్రారంభిస్తామని తెలిపారు
విద్యారంగానికి రూ.0.99 లక్షల కోట్లు
విద్యారంగంలో సమూల మార్పులే లక్ష్యంగా.. త్వరలో నూతన విద్యా విధానం ప్రకటించనున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి.. విద్యారంగానికి 99 వేల 3వందల కోట్లు, నైపుణ్యాభివృద్ధికి 3వేల కోట్లు కేటాయించినట్లు ప్రకటించారు.
స్వచ్ఛభారత్‌కు రూ.12,300 కోట్లు
స్వచ్ఛ భారత్ కోసం 12వేల 3వందల కోట్ల రూపాయలను కేటాయించిన ఆర్థిక మంత్రి.. దేశంలోని ప్రజలందరికీ పైపుల ద్వారా నీరు అందించే జలజీవన్ మిషన్ పథకానికి 11వేల 5వందల కోట్ల రూపాయలను కేటాయించారు.
బేటీ బచావో బేటీ పడావో భేష్
విద్యలో ఆడపిల్లలను ప్రోత్సహించేందుకు నరేంద్రమోదీ ప్రవేశపెట్టిన బేటీ బచావో బేటీ పడావో పథకం ఊహించని రీతిలో ఫలితాలు సాధించిందని నిర్మలా సీతారామన్ చెప్పారు. ఈ పథకంతో దేశవ్యాప్తంగా అన్నిస్థాయుల్లో ఆడపిల్లల సంఖ్య పెరిగిందని పేర్కొన్న ఆర్థికమంత్రి...పాఠశాల స్థాయి నుంచి, ఉన్నత విద్య వరకు బాలికలే ముందంజలో ఉన్నట్లు పేర్కొన్నారు
వేతన జీవులకు శుభవార్త
ఆదాయపన్ను చెల్లింపుదారులకు ఊరట కలిగించేలా బడ్జెట్ 2020-21లో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మధ్య, ఎగువ మధ్య తరగతి వారికి ఊరటనిచ్చేలా ఆదాయపన్ను స్లాబులను 4 నుంచి 7కు పెంచింది.
నూతన స్లాబులు ఇవే..
- 0 నుంచి 2.50 లక్షల వరకు ఎలాంటి ఆదాయపన్ను లేదు.
- 2.50 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు 5 శాతం
- 5 లక్షల నుంచి 7.50 లక్షల వరకు 10 శాతం
- 7.50 లక్షల నుంచి 10 లక్షల వరకు 15 శాతం
- 10 లక్షల నుంచి 12.50 లక్షల వరకు 20 శాతం
- 12.50 లక్షల నుంచి 15 లక్షల వరకు 25 శాతం
- 15 లక్షలకు పైన ఆదాయం ఉన్నవారికి 30 శాతం
బడ్జెట్లో పూర్తి కేటాయింపులు సంక్షిప్తంగా
- గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, సాగునీటి రంగాలకు రూ.2.83 లక్షల కోట్లు
- మౌలికరంగ ప్రాజెక్టులకు రూ.లక్షా 3 వేల కోట్లు
- రవాణా, మౌలిక వసతుల అభివృద్ధికి రూ.1.7 లక్షల కోట్లు
- విద్యారంగానికి రూ.99,300 కోట్లు
- ఎస్సీలు, ఓబీసీలకు రూ.85 వేల కోట్లు కేటాయింపు
- ఎస్టీల కోసం రూ.53 వేల కోట్లు కేటాయింపు
- సీనియర్ సిటిజన్లు, దివ్యాంగుల కోసం రూ.9,500 కోట్లు
- పౌష్టికాహార పథకం కోసం రూ.35,600 కోట్లు
- మహిళలు, శిశువుల పౌష్టికాహారం కోసం రూ.28,600 కోట్లు
- జమ్ముకశ్మీర్‌కు రూ.30,757 కోట్లు
- లద్దాఖ్ ప్రాంతానికి రూ.5,958 కోట్లు
- పరిశ్రమలు, వాణిజ్యం ప్రోత్సాహకానికి రూ.27,300 కోట్లు
- బెంగళూరుకు రూ.18,600 కోట్లతో మెట్రో తరహా సబర్బన్ రైల్వే పథకం
- స్వచ్ఛభారత్ మిషన్‌కు రూ.12,300 కోట్లు
- జల్‌జీవన్ మిషన్‌కు రూ.11,500 కోట్లు
- నేషనల్ మిషన్ ఫర్ క్వాంటమ్ టెక్నాలజీస్‌కు నాలుగేళ్లలో రూ.8 వేల కోట్లు
- ప్రధాని జన ఆరోగ్య యోజనకు రూ.6,400 కోట్లు
- నగరాల్లో కాలుష్య నియంత్రణకు రూ.4,400 కోట్లు
- నైపుణ్యాభివృద్ధి కేంద్రాలకు రూ.3 వేల కోట్లు
- పర్యాటకరంగ అభివృద్ధికి రూ.2 వేల కోట్లు కేటాయింపు
- జౌళి రంగానికి రూ.1,480 కోట్లు
- ప్రభుత్వరంగ బ్యాంకులకు 3.5 లక్షల కోట్ల మూలధన సాయం
- డిపాజిటర్ల బీమా కవరేజ్ రూ.లక్ష నుంచి 5 లక్షలకు పెంపు
- ఔషధ, విడిభాగాల పరిశ్రమల్లో ఎగుమతుల ప్రోత్సాహానికి రూ.వెయ్యి కోట్లు