కరోనా వైరస్ వ్యాధి (కొవిడ్-19)కి ఇంతవరకూ సరైన చికిత్స లేదు. దీన్ని అదుపు చేసే మందునూ ఇంతవరకు ఆవిష్కరించలేదు. అదే సమయంలో వ్యాక్సిన్‌ను తయారుచేసే యత్నాలు ఇంకా కొలిక్కి రాలేదు. ఈ నేపథ్యంలో ఇతర వ్యాధులకు చికిత్సలో వినియోగించే కొన్ని ఔషధాలు కొవిడ్-19 బాధితులకు ఉపశమనాన్ని కలిగిస్తున్నట్లు తేలింది. ఫలితంగా ఆ ఔషధాలకు ఒక్కసారిగా గిరాకీ ఏర్పడింది. అందులో హెచ్‌ఐవీ/ఎయిడ్స్ నివారణలో వినియోగించే మందులు, మలేరియా వ్యాధిని అదుపు చేసేందుకు వినియోగించే క్లోరోక్విన్, యాంటీ-బయాటిక్ ఔషధాలు ఉన్నాయి. ఈ మందులను తయారు చేసే ఫార్మా కంపెనీలు మనదేశంలోనే అధికంగా ఉన్నాయి.
వాస్తవానికి ఔషధ పరిశ్రమ మనదేశంలో గత రెండు మూడు దశాబ్దాల్లో బహుముఖంగా విస్తరించింది. అభివృద్ధి చెందిన అమెరికా, ఐరోపా దేశాల నుంచి అభివృద్ధి చెందుతున్న ఆఫ్రికా, లాటిన్ అమెరికా, కొన్ని ఆసియా దేశాలు... మనదేశం నుంచి మందులను పెద్దఎత్తున కొనుగోలు చేస్తున్నాయి. దీనికి తోడు కొవిడ్-19 వ్యాధిగ్రస్తులకు చికిత్సలో వినియోగిస్తున్న హెచ్‌ఐవీ/ఎయిడ్స్, మలేరియా మందుల తయారీ కూడా భారత్‌లోనే అధికం. ఫలితంగా ఈ ఔషధాలను సరఫరా చేయాల్సిందిగా అమెరికా నుంచి బ్రెజిల్, ఇజ్రాయెల్ తదితర ఎన్నో దేశాలు మనదేశంపై ఒత్తిడి తెస్తున్నాయి. అదే సమయంలో దేశీయ అవసరాలకు మందులు సరఫరా చేయాల్సిన బాధ్యత ఎటూ ఉండనే ఉంది. ఈ పరిస్థితుల్లో దేశీయ ఫార్మా కంపెనీలు పెద్దఎత్తున ఈ ఔషధాల తయారీని చేపట్టాయి. కానీ ఇక్కడే సమస్య ఉంది. ప్రస్తుత అవసరాలకు తగ్గట్లుగా ఈ ఔషధాలు తయారు చేయటానికి ఫార్మా కంపెనీలకు ముడిపదార్థాల కొరత ఎదురవుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఫార్మా కంపెనీల వద్ద ఉన్న ముడిసరకు నిల్వలు దాదాపుగా అయిపోయాయి. కొత్తగా ముడిపదార్థాలు అందితే గానీ మందులు తయారు చేయటం సాధ్యం కాని పరిస్థితి ఉన్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ప్రధానంగా 'క్లోరోక్విన్' తయారీకి అవసరమైన ముడిపదార్థాల కొరతను స్థానిక ఫార్మా కంపెనీలు ఎదుర్కొంటున్నాయి.
ఇదీ ప్రస్తుత పరిస్థితి...
- ప్రధానంగా హెచ్‌ఐవీ/ఎయిడ్స్, అజిత్రోమైసిన్, క్లోరోక్విన్ తయారు చేసే ఫార్మా కంపెనీలు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి. అందులోనే క్లోరోక్విన్‌కు ప్రస్తుతం అధిక గిరాకీ ఉంది. ఒక పక్క ఎగుమతులకు తోడు దేశీయ మార్కెట్లోనూ ఈ ఔషధాన్ని అధికంగా కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో.. స్థానిక ఫార్మా కంపెనీలు హైడ్రాక్సీ క్లోరోక్విన్, క్లోరోక్విన్ ఫాస్పేట్ మాత్రల తయారీకి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. కానీ వీటి అవసరాలకు తగినంతగా ముడిపదార్థాల సరఫరా లేదు.
- కొవిడ్-19 వ్యాధి విస్తరించటానికి ముందు క్లోరోక్విన్ మాత్రలకు ఉన్న గిరాకీ ఎంతో తక్కువ. కేవలం మలేరియా, రుమటాయిడ్ ఆర్థరైటిస్, లుపస్ వ్యాధిగ్రస్తులకు మాత్రమే ఈ మాత్రలు సిఫార్సు చేస్తారు. అందువల్ల పరిమితమైన వినియోగం మాత్రమే ఉండేది. అంతేగాక ఎగుమతులు కూడా తక్కువ. అందువల్ల పెద్దఎత్తున ముడిపదార్ధాలను నిల్వ చేయటంపై కానీ, తయారు చేయటంపై కానీ ఇక్కడి కంపెనీలు పెద్దగా దృష్టి సారించలేదు.
- కరోనా వైరస్ విజృంభతో ఒక్కసారిగా క్లోరోక్విన్‌కు గిరాకీ వచ్చింది. ఫలితంగా అప్పటికప్పుడు అందుబాటులో ఉన్నంత మేరకు ముడిపదార్ధాలు సేకరించి ఔషధాన్ని తయారు చేశాయి. ఇక కొత్తగా ముడిపదార్ధాలు సరఫరా అయితే గానీ ఈ మాత్రలు తయారు చేయలేని పరిస్థితి ఏర్పడినట్లు సంబంధిత వర్గాలు వాపోతున్నాయి.
సరఫరాల కోసం ఎదురుచూపులు
క్లోరోక్విన్ తయారీలో ఇప్కా ల్యాబ్స్, జైడస్, సిప్లా తదితర అగ్రగామి ఔషధ కంపెనీలతో పాటు హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న హెటెరో డ్రగ్స్, నాట్కో ఫార్మా, లారస్ ల్యాబ్స్... తదితర పలు ఫార్మా కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలన్నీ ఇప్పుడు సాధ్యమైనంత మేరకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రల తయారీలో నిమగ్నమై ఉన్నాయి. కానీ కొన్నింటికి తగినంతగా ముడిపదార్ధాల లభ్యత లేదని తెలిసింది. ఇందులో కొన్ని కంపెనీలు చైనా నుంచి ముడి పదార్ధాలు ఆర్డర్ చేసి... అక్కడి నుంచి కంటైనర్లు ఎప్పుడు వస్తాయా... అని ఎదురుచూస్తున్నాయి.
మరోపక్క స్థానికంగా ఉన్న బల్క్, ఏపీఐ (యాక్టివ్ ఫార్మా ఇన్‌గ్రేడియంట్స్) లు తయారు చేసే యూనిట్లు కొన్ని ఇప్పుడు క్లోరోక్విన్ తయారీకి అవసరమైన ముడిపదార్ధాలు, ఇంటర్మీడియేట్స్ తయారీని చేపట్టినట్లు తెలిసింది. తెలంగాణ రాష్ట్ర డ్రగ్ కంట్రోలర్ డైరెక్టర్ కార్యాలయం కూడా ఈ సమస్యను గుర్తించి ఇటీవల ఇంటర్మీడియేట్స్ తయారీ చేపట్టాల్సిందిగా కొన్ని బల్క్ డ్రగ్ యూనిట్లను కోరింది. గతంలో క్లోరోక్విన్ ముడిపదార్థాలు, ఇంటర్మీడియేట్స్ తయారు చేస్తూ గిరాకీ లేదని.. వాటి తయారీని నిలుపుదల చేసిన కొన్ని యూనిట్లు ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు అవి మళ్లీ ముడిపదార్దాల తయారీని చేపట్టినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ముడిపదార్థాలు లేకపోవటం వల్ల 'క్లోరోక్విన్' తయారీ పూర్తిస్థాయిలో సాధ్యం కావటం లేదు. 'అన్ని సిద్ధంగా పెట్టుకొని ముడిపదార్ధాల కన్‌సైన్‌మెంట్ల కోసం ఎదురుచూస్తున్నాం, ఎప్పుడు వస్తే అప్పుడు క్లోరోక్విన్ తయారీని చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నాం' అని స్థానిక ఫార్మా కంపెనీ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు.
ఈ ఔషధాలకు ఇప్పుడు అధిక గిరాకీ..
- హైడ్రాక్సీ క్లోరోక్విన్ (హెచ్‌సీక్యూ)
- క్లోరోక్విన్ ఫాస్పేట్ అజిత్రోమైసిన్
- పారాసెట్మాల్
- మాంటెలుకాస్ట్ ఎల్‌సీ ఒసెల్టామివిర్ (టామిఫ్లూ)
- ఫవిపిరవిర్
- లొపినవిర్
- రెమ్‌డెసివిర్
- ఐవర్‌మెక్టిన్
ఇదీ చదవండి:దొంగలు అనుకుని మూకదాడి- ముగ్గురు మృతి